యాదవరెడ్డిపై వేటు?
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జోడు పదవులు నిర్వర్తిస్తున్న ఎమ్మెల్సీ కొంపల్లి యాదవరెడ్డికి క్రమేణా ఉచ్చు బిగుస్తోంది. కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యుడిగా చెలామణి అవుతూనే టీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఆయనపై వేటుకు రంగం సిద్ధమవుతోంది. పార్టీ విప్‌ను ధిక్కరించి గులాబీ దళంతో చేతులు కలిపిన యాదవరెడ్డి తీరును జీర్ణించుకోలేని కాంగ్రెస్...ఆయన్ని అనర్హుడిగా ప్రకటింపజేసేందుకు సర్వశక్తులొడ్డుతోంది. ఎమ్మెల్సీగా, జెడ్పీటీసీ(నవాబ్‌పేట)గా రెండు పదవుల్లో కొనసాగుతున్న యాదవరెడ్డిపై చర్య తీసుకోవాలని శాసనమండలి కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మొదలు సీఎస్, కలెక్టర్లకు జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) మంగళవారం ఫిర్యాదు చేసింది.
మండలి దృష్టికి...
ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న నవాబ్‌పేట జెడ్పీటీసీ యాదవరెడ్డి వ్యవహారంపై జిల్లా కలెక్టర్ శాసనమండలి దృష్టికి తీసుకెళ్లారు. ్ల పంచాయతీరాజ్ చట్టం-1994 సెక్షన్ 177 (4) కింద జోడు పదవులను నిర్వర్తించడం నిబంధనలకు విరుద్ధం. ఈ సెక్షన్ ప్రకారం జెడ్పీటీసీగా ప్రమాణం చేసిన అనంతరం పక్షం రోజుల్లో ఏదేనీ ఒక పదవికి యాదవరెడ్డి రాజీనామా చేయాల్సివుంది. అయితే ఆయన మాత్రం ఇప్పటి వరకూ ఏ పదవిని విడిచిపెట్టకుండా అటు ఎమ్మెల్సీగా, ఇటు జెడ్సీటీసీగా కొనసాగుతున్నారు.
ఇదే విషయాన్ని తెలియజేస్తూ జిల్లా కలెక్టర్ ఎన్.శ్రీధర్ మంగళవారం శాసనమండలి కార్యదర్శికి లేఖ రాశారు. ఇదిలావుండగా, యాదవరెడ్డి తోపాటుగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విప్‌ను ధిక్కరించిన జడ్పీటీసీ ముంగి జ్యోతి(రాజేంద్రనగర్)లపై చర్య తీసుకునే విషయంలో కలెక్టర్ న్యాయసలహా కోరారు. అయితే ఒకవేళ యాదవరెడ్డిపై జోడుపదవుల వేటు పడే పక్షంలో ఆయన ఎమ్మెల్సీ పదవిని వదులుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది.