ప్రతిపల్లెకు బీటీరోడ్డు
పంచాయతీ, అంగన్వాడీలకు నూతనభవనాలు
పంచాయతీరాజ్ సీఈ సత్యనారాయణరెడ్డి
షాద్‌నగర్ రూరల్: రెండేళ్లలో రాష్ట్రంలోని ప్రతిపల్లెకు బీటీరోడ్డు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పంచాయతీరాజ్‌శాఖ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ సత్యనారాయణరెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 8695 గ్రామపంచాయతీలు ఉన్నాయని, అందులో 460పంచాయతీలకు బీటీరోడ్లు లేవని చెప్పారు. అన్ని పంచాయతీలకు బీటీ సౌకర్యం కల్పించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. గురువారం పట్టణంలోని పంచాయతీరాజ్ శాఖ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 460 గ్రామపంచాయతీలకు బీటీ రోడ్డు లేదని, అందులో పాలమూరు జిల్లాలోనే 185 ఉన్నాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 1000 నూతనపంచాయతీ భవనాలు, 1063 నూతన అంగన్వాడీ భవనాలను మంజూరు చేసినట్లు తెలిపారు. మహబూబ్నగర్జిల్లాకు 144 నూతన గ్రామపంచాయతీ భవనాలు మంజూరు అయ్యాయని తెలిపారు. అసంపూర్తిగా ఉన్న 264 భవనాలను త్వరలోనే పూర్తిచేసేందుకు నిధులు మంజూరు చేశామన్నారు. అంగన్వాడీ, పంచాయతీ, మహిళాసమాఖ్య భవన నిర్మాణాలను పంచాయతీరాజ్ ఆధ్వర్యంలోనే చేపట్టనున్నామని తెలిపారు. 1163 అంగన్‌భవనాలను అక్టోబర్31 నాటికి పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
జిల్లాకు 74 అంగన్వాడీ భవనాలు
జిల్లాకు 74 నూతన అంగన్వాడీ భవనాలు మంజూరయ్యాయని తెలిపారు. రూ. 8లక్షలతో నిర్మించనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటివిడతగా 1064 అంగన్‌వాడీభవనాల్లో 550 అంగన్వాడీ భవనాల నిర్మాణాలకు రూ. 3లక్షల చొప్పున ఐసీడీఎస్, రూ.5లక్షలు ఎన్ఆర్ఈజీఎస్ నుంచి కేటాయిస్తామని తెలిపారు. నూతన భవనాల నిర్మాణాలలో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో పంచాయితీరాజ్ జిల్లాఎస్‌ఇ రఘు, ఎగ్జిక్యూటివ్‌ఇంజనీర్ అశోక్, షాద్‌నగర్ డిప్యూటి ఇఇ సంజీవచారి, ఎఇలు శ్రీనివాసులు, యాదగిరి, ఎం.శ్రీనివాస్, భూపాల్, కిశోర్‌బాబు, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.