మైక్రోల్యాబ్స్ నుంచి డెంగ్యూ నివారణకు క్యారిపిల్ కాప్యుల్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న వారిలో ప్లేట్లెట్స్ సంఖ్యను పెంచే ‘క్యారిపిల్’ కాప్యుల్స్ను మైక్రోల్యాబ్స్ మార్కెట్లోకి విడుదల చేసింది. బొప్పాయి ఆకుల రసం నుంచి తయారు చేసిన ఈ ఔషధాన్ని వినియోగించిన వారిలో ప్లేట్లెట్స్ సంఖ్య పెరగడం నిరూపితమైనట్లు మైక్రోల్యాబ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జయరాజ్ జి అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లలో లాంఛనంగా విడుదల చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోజుకు మూడు చొప్పున ఐదు రోజులు వీటిని వినియోగిస్తే సరిపోతుందన్నారు.
డెంగ్యూ వ్యాధితో హాస్పిటల్లో చేరితే సగటున రూ. 25,000 నుంచి రూ. 75,000 వరకు వ్యయం అవుతోందని, కానీ క్యారిపిల్ ఐదు రోజుల ఖర్చు రూ. 375 మాత్రమేనన్నారు. క్యారిపిల్ను తయారు చేసి విక్రయించడానికి ఆయుష్ అనుమతులు మంజూరు చేసిందని, వీటిని వినియోగించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవన్నారు. నాలుగు దేశాల్లో 350 మందిపై, ఇండియాలో 30 మందిపై క్లీనికల్ ట్రయల్స్ నిర్వహించినట్లు మైక్రోల్యాబ్ సీనియర్ మేనేజర్ డాక్టర్ ప్రభు కస్తూరి తెలిపారు. విడుదల చేసిన తొలి నెలల్లో 40,000, మరుసటి నెలలో 1.8 లక్షలు క్యారిపిల్స్ను విక్రయించినట్లు జయరాజ్ తెలిపారు.