అండర్-14 నాకౌట్ టోర్నీ లో ప్రజ్ఞయ్ శతకం
జింఖానా, న్యూస్‌లైన్: శ్రీ చైతన్య స్కూల్ బ్యాట్స్‌మన్ ప్రజ్ఞయ్ రెడ్డి (120) సెంచరీతో కదం తొక్కాడు. దీంతో ఆ జట్టు 157 పరుగుల భారీ తేడాతో హెచ్‌పీఎస్ (బేగంపేట్) జట్టుపై ఘన విజయం సాధించింది. హెచ్‌సీఏ బ్రదర్ జాన్ ఆఫ్ గాడ్ అండర్-14 నాకౌట్ టోర్నీలో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీ చైతన్య స్కూల్ జట్టు 3 వికెట్లు కోల్పోయి 267 పరుగులు చేసింది. గౌరవ్ రెడ్డి (76) అర్ధ సెంచరీతో రాణించాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హెచ్‌పీఎస్ జట్టు 110 పరుగులకే కుప్పకూలింది. నిఖిల్ (44) మెరుగ్గా ఆడాడు.
శ్రీ చైతన్య బౌలర్లు దీపక్, ఆశిష్ చెరో 4 వికెట్లు పడగొట్టారు. మరో మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ వరుణ్ గౌడ్ (114), వికాస్ (107) సెంచరీలతో గౌతమ్ మోడల్ స్కూల్ జట్టు 177 పరుగుల భారీ తేడాతో హెచ్‌పీఎస్ (రామంతపూర్) జట్టుపై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గౌతమ్ మోడ ల్ స్కూల్ 8 వికెట్ల నష్టానికి 400 పరుగుల భారీ స్కోరు చేసింది. అజయ్‌దేవ్ గౌడ్ (57), సాగర్ చౌరాసియా (56) అర్ధ సెంచరీలతో రాణించారు. తర్వాత బ్యాటింగ్ చేసిన హెచ్‌పీఎస్ 223 పరుగుల వద్ద ఆలౌటైంది. తరుణ్ (62), అమోఘ్ రాహుల్ (65) అర్ధ సెంచరీలు సాధించారు.