విశాఖ ఉక్కు లాభం రూ.62 కోట్లు
ఉక్కునగరం(విశాఖ) : విశాఖ స్టీల్‌ప్లాంట్ గత ఆర్దిక సంవత్సరంలో అనేక ఒడుదొడుకులను ఎదుర్కొని రూ. 11,665 కోట్లు టర్నోవర్‌తో రూ.62 కోట్లు నికరలాభం(పన్నున్నీ పోను) అర్జించింది. మంగళవారం స్టీల్‌ప్లాంట్ సిఎండి పి. మధుసూదన్ అధ్యక్షతన జరిగిన సంస్ద 33వ వార్షిక సాధారణ సమావేశం(ఎజిఎం)లో ఆడిట్ నివేదికను సమర్పించారు. ఈ సందర్భంగా సిఎండి మధుసూదన్ మాట్లాడుతూ గత ఏడాది సంభవించిన హుదూద్ తుఫాన్ ప్రభావం ప్లాంట్‌పై పడి పెద్ద ఎత్తున నష్టం జరిగిందన్నారు. యాజమాన్యం, ఉద్యోగుల సమిష్టి కృషితో అతి తక్కువ సమయంలో ఉత్పత్తిని సాధారణ స్దితికి తీసుకురావడంతో పాటు క్రూడ్ స్టీల్ ఉత్పత్తిలో 3 శాతం వృద్దిని నమోదు చేయగలిగామన్నారు.
చైనా నుంచి పొడవు ఉత్పత్తుల దిగుమతులు 202 శాతం పెరగడం వల్ల విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై దాని ప్రభావం పడి గత ఏడాది రెండవ అర్దభాగంలో లాభాలు తగ్గాయన్నారు. అయినా పూర్తి ఏడాదిలో రూ.865 కోట్లు విలువైన ఉత్పత్తులు ఎగుమతి చేసి 16శాతం వృద్ది నమోదు చేసామన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఇంటీరియం డివిడెండ్ రూపేణా రూ.14 కోట్లు, ప్రిఫరెన్స్ షేర్లపై వడ్డీ కింద రూ.11.35 కోట్లు చెల్లించామన్నారు. రాష్ట్రపతి ప్రతినిధిగా ఉక్కు మంత్రిత్వ శాఖ డైరక్టర్ మహాబిర్ ప్రసాద్ హాజరైన ఈ కార్యక్రమంలో స్టీల్‌ప్లాంట్ డైరక్టర్లు పి.సి.మహాపాత్ర, డాక్టర్ జి.బి.ఎస్.ప్రసాద్, డి.ఎన్.రావు, టి.వి.ఎస్.కృష్ణకుమార్, ఆడిట్ కమిటీ చైర్మన్ ప్రోఫెసర్ ఎస్.కె.గార్గ్ తదితరులు పాల్గొన్నారు.