prathibha awards
-
ప్రభుత్వ విద్యార్థులకే ‘ప్రతిభ’ అవార్డులు
సాక్షి, ఒంగోలు : ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి ఫలితాల్లో అత్యధిక జీపీఏ సాధించిన విద్యార్థులకు అందించే ఏపీజే అబ్దుల్‌కలాం ప్రతిభ అవార్డులను ఇక నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ప్రతిభ అవార్డులు ఇస్తూ వచ్చారు. అయితే ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడంతోపాటు అక్కడ చదువుకునే పదో తరగతి విద్యార్థులను మరింత ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ప్రతిభ అవార్డులను వారికే ఇచ్చేలా చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్ధులకే ప్రతిభ అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంపట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. విద్యార్థుల్లో ఉత్సాహం ఈ ఏడాది మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని జిల్లాపరిషత్, ప్రభుత్వ, కేజీబీవీ, మున్సిపల్, ఏపీ మోడల్ స్కూల్స్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్స్, ఏపీఆర్ఈ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుకుంటూ అత్యధిక జీపీఏ మార్కులు సాధించిన విద్యార్థులు ప్రతిభ అవార్డులకు ఎంపిక కానున్నారు. ప్రతిభ అవార్డుకు ఎంపికైన విద్యార్థి బ్యాంకు ఖాతాల్లో రూ. 20 వేల చొప్పున నగదు జమకానుంది. ట్యాబ్, మెడల్, సర్టిఫికెట్, విద్యార్థి కెరీర్‌కు ఉపయోగపడే పుస్తకాన్ని బహుమానంగా ఇవ్వనున్నారు. పదో తరగతి చదివే ప్రతి విద్యార్థి తాను ప్రతిభ అవార్డుకు ఎంపిక కావాలని కష్టపడుతుంటాడు. ప్రతిభ అవార్డును గర్వంగా అందుకొని తాను నివసించే ప్రాంతంలో ప్రత్యేక గుర్తింపు పొందుతుంటారు. ఫిఫ్టీ ఫిఫ్టీ ఇంతకు ముందు వరకు ప్రతిభ అవార్డులను ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు చెరో సగం పంచుకున్నట్లుగా ఇచ్చేవారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటూ పదో తరగతిలో అత్యధిక జీపీఏ సాధించిన విద్యార్థులకు ప్రతిభ అవార్డు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇచ్చినట్లవుతోంది. మండలానికి ఆరు చొప్పున ప్రతిభ అవార్డులను ఇవ్వాల్సి ఉంటుంది. జిల్లాలో 56 మండలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 336 ప్రతిభ అవార్డులు జిల్లాకు కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఆ 336 అవార్డుల్లో ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల్లో సగం మంది కొట్టుకొనిపోయేవారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ పాటశాలల కంటే ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులే ఎక్కువగా ప్రతిభ అవార్డులను సొంతం చేసుకోవడం జరిగేది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు కొంత నిరుత్సాహానికి గురువుతూ ఉండేవారు. ప్రతిభను ఎలా గుర్తిస్తారంటే మార్చిలో జరిగిన పదో తరగతి ఫలితాల్లో అత్యధిక జీపీఏలు సాధించిన విద్యార్థులను ప్రతిభ అవార్డు కింద ఎంపిక చేయడం జరుగుతోంది. మండలానికి ఆరు చొప్పున ప్రతిభ అవార్డులు కేటాయిస్తాయరు. జిల్లాలో 56 మండలాలు ఉండటంతో 336 మంది విద్యార్థులు ప్రతిభ అవార్డులను పొందనున్నారు. మండలానికి ఇచ్చే ఆరు ప్రతిభ అవార్డుల్లో ఎస్సీ విద్యార్ధికి ఒకటి, ఎస్టీ విద్యారి్ధకి ఒకటి, బీసీ విద్యార్థికి ఒకటి, ఓసీ విద్యార్థికి ఒకటి, ప్రత్యేకంగా బాలికలకు సంబంధించి ఇద్దరికి ఇవ్వనున్నారు. అయితే ఆయా కేటగిరిల వారీగా ప్రతిభ అవార్డులు ఇచ్చే క్రమంలో ముందుగా ఆ విద్యార్థి సాధించిన జీపీఏ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. ఒకవేళ ఆ మండలంలో ఎక్కువ మంది విద్యార్థులు సమానంగా జీపీఏ సాధించి ఉంటే, వారి పుట్టిన తేదీని పరిగణనలోకి తీసుకుంటారు. పుట్టిన తేదీలో వయస్సు ఎక్కువగా ఉన్న వారికే ప్రతిభ సొంతం అవుతోంది. సీఎస్ఈ ద్వారానే ఎంపిక రాష్ట్రవ్యాప్తంగా ప్రతిభ అవార్డులకు విద్యార్థుల ఎంపిక ప్రక్రియ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆధ్వర్యంలోనే జరుగుతోంది. పదో తరగతికి సంబంధించిన విద్యార్థుల నామినల్ రోల్స్ అన్ని పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌లో ఉంటాయి. ఆ నామినల్ రోల్స్‌లో విద్యార్థికి సంబంధించిన సమగ్ర సమాచారం అందులో పొందుపరచి ఉంటుంది. పదో తరగతి ఫలితాలు వెలువడిన అనంతరం పాఠశాలల వారీగా ఏ విద్యార్థి జీపీఏ ఎంత సాధించారన్న వివరాలు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలోనే ఉంటాయి. ప్రతి ఏటా నవంబర్ 11వ తేదీ ఏపీజే అబ్దుల్ కలాం పేరిట ప్రతిభ అవార్డులను విద్యార్థులకు అందించాల్సి ఉంది. అయితే గత ప్రభుత్వం విద్యార్థులకు సకాలంలో ప్రతిభ అవార్డులు ఇచ్చిన దాఖలాలు లేవు. దానికితోడు రాష్ట్రవ్యాప్తంగా ప్రతిభ అవార్డులకు ఎంపికైన విద్యార్థులను ఒకచోటకు రప్పించి అక్కడ భారీ ఎత్తున సభ ఏర్పాటుచేసి ప్రతిభ అవార్డులు అందిస్తూ వచ్చింది. సుదూర ప్రాంతాల్లో ప్రతిభ అవార్డులు ఇస్తుండటంతో విద్యార్ధులు ఇబ్బందులు పడుతూ వచ్చారు. ఏ జిల్లాకు ఆ జిల్లాలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిభ అవార్డుల ప్రధానోత్సవాన్ని ఏ జిల్లాకు ఆ జిల్లాలో నిర్వహించాలని ఆదేశించారు. ఇతర జిల్లాలకు చెందిన విద్యార్థులు, వారికి తోడుగా వచ్చే తల్లిదండ్రులు ప్రతిభ అవార్డుల ప్రధానోత్సవ సమయంలో రెండు రోజులపాటు గతంలో ఇబ్బందులు పడ్డారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిభ అవార్డుల ప్రధానోత్సవాన్ని కూడా రాజకీయ వేదికగా మార్చుకున్నారు. దీంతో ప్రతిభ అవార్డులు అందుకునేందుకు వచ్చిన విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిభ అవార్డులను ఏ జిల్లాకు ఆ జిల్లాలో అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం పట్ల విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
అవార్డులు సరే.. ప్రోత్సాహక నగదేదీ ?
యడ్లపాడు(చిలకలూరిపేట): ప్రతిభా అవార్డు –2018 సంబంధించిన నగదు ప్రోత్సాహం ప్రభుత్వం ఇప్పట్లో ఇచ్చేలా లేదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవార్డులు ప్రదానం చేసి నాలుగు నెలలైనా నేటికి వాటి తాలూకు ప్రభుత్వం ఇవ్వాల్సిన నగదు ప్రోత్సాహాకం మాత్రం ఇవ్వకపోవడంపై విద్యార్థుల కుటుంబాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 10 తరగతి నుంచి పీజీ వరకు వివిధ స్థాయిల్లో ఉత్తమ ప్రతిభ కనపర్చిన వారిని ప్రొత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం అందించే నగదు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రతిభావంతులైన ఒక్కొక్క విద్యార్థికి ప్రోత్సాహకంగా రూ.20 వేలు చొప్పున ఇస్తామని ప్రకటించి నాలుగు నెలలు గడిచినా నేటికీ అందివ్వలేదు. జాప్యం లేకుండా చూడాల్సిన విద్యాశాఖ మాత్రం ఇంకా విద్యార్థుల బ్యాంక్ ఖాతా నంబర్ల వెతుకులాట పనిలోనే ఉండటం గమనార్హం. దీంతో రాష్ట్రంలో 7010 మంది ప్రతిభవంతులకు పురస్కారం కింద లభించాల్సిన నగదు రూ.14.20 కోట్లు వారి ఖాతాల్లో జమకాలేదు. వాటితో పాటు విద్యార్థి, వారి తల్లిదండ్రులకు చెల్లించాల్సిన టీఏ, డీఏలు కూడా దక్కకపోవడంతో విద్యార్థుల కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. భారత మాజీ ప్రధాని ఏపీజే అబ్ధుల్ కలాం జయంతి రోజునే వీటిని ఇవ్వాల్సి ఉన్నా పాలకులు, అధికారుల అలసత్వంతో నగదు వీరికి చేరడం లేదు. రాష్ట్రంలో ప్రతిభావంతులు వీరే.. ప్రతిభా అవార్డు –2018 కింద రాష్ట్ర వ్యాపితంగా ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశా>లలకు చెందిన 7,010 మంది విద్యార్థులను పాఠశాల విద్యశాఖ ఎంపిక చేసింది. పదో తరగతిలో 3,985 మంది, ఇంటర్లో 745 మంది, టెక్నికల్ విభాగంలో 430 మంది, డిగ్రీ, పీజీలో 311, యూనివర్సిటీలో 1,285 మందిని వివిధ కేటగిరిల కింద ఎంపికయ్యారు. వీరిలో బాలికలు 4,385 మంది, బాలురు 2,374 మంది ఉన్నారు. జిల్లాల వారీగా... అవార్డులు తీసుకున్న వారిలో శ్రీకాకుళం జిల్లా 356, విజయనగరం – 309, విశాఖపట్నం –486, తూర్పుగోదావరి –771, పశ్చిమగోదావరి –402, కృష్ణా –492, గుంటూరు –607, ప్రకాశం –448, నెల్లూరు –455, చిత్తూరు –682, వైఎస్సార్ కడప 495, అనంతపురం –756, కర్నూల్ – 501 మంది విద్యార్థులు ఉన్నారు. వీరితో పాటు స్పోర్ట్ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన 248 మందికి అవార్డులు లభించాయి. గతేడాది అక్టోబర్‌లో అవార్డుల ప్రదానం.. ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ, పాఠశాల విద్యాశాఖ, సర్వశిక్షా అభియాన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ అవార్డుల ప్రదానోత్సవం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు సౌత్ బైపాస్ వెనుక ఉన్న మిని స్టేడియంలో అబ్దుల్‌కలాం జయంతిని పురస్కరించుకుని గతేడాది అక్టోబర్ 15వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవార్డులు అందజేశారు. అవార్డు పొందిన విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్, గోల్డ్‌కోటెడ్ కాపర్ మెడల్, ట్యాబ్‌లను పంపిణీ చేశారు. రూ.20 వేల నగదు ప్రోత్సాహం, టీఏ, డీఏలను చెల్లించకపోవడంతో అంతా నిరాశచెందుతున్నారు. ఇప్పటికైనా నగదు ప్రోత్సాహాన్ని, టీఏ, డీఏలను త్వరితగతిన తమ ఖాతాలలో వేయాలంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. నగదు జమ కావాలి ప్రతిభా అవార్డు సెలక్షన్ లిస్ట్ వచ్చిన వెంటనే విద్యార్థుల బ్యాంక్ ఖాతా నంబర్లను ఆ రోజే ఇచ్చేశాం. ఒక్కొక్కరి బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేశారు. ప్రస్తుతం 2 వేల మందికి నగదు జమ కావాల్సి ఉంది. –ఆర్ఎస్ గంగాభవాని,జిల్లా విద్యాశాఖాధికారి -
ఐక్యతతోనే ఈడిగల అభివృద్ధి
రాష్ట్ర అధ్యక్షుడు కొనకోళ్ల నారాయణ అనంతపురం రూరల్: ఐక్యతతోనే ఈడిగల అభివృద్ధి సాధ్యం అవుతుందని ఈడిగ, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొనకోళ్ల నారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక కేఎస్ఆర్ బాలికల పాఠశాలలో జిల్లా అధ్యక్షుడు కిరణ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన గౌడ విద్యార్థుల ప్రతిభా ఆవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన ఈడిగలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కులవృత్తిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న ఈడిగలు తమ పిల్లలను విద్యవైపు అడుగులు వేయించాలన్నారు. గీతకార్మికుల కార్పొరేషన్ చైర్మన్ తాతా జయప్రకాష్ నారాయణన్ మాట్లాడుతూ విదేశీ చదువులు కోసం కార్పొరేషన్ ద్వారా గీత కార్మికుల పిల్లలకు రుణాలను అందజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఇంటర్, 10వ తరగతిలో మంచి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ ఫోన్లతోపాటు నగదు పురస్కారాలు, జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ చమన్, ఎమ్మెల్యే జితేంద్రగౌడ్, గౌడ సంఘం నాయకులు రాజు, సుధాకర్, బీసీ ఐక్యవేదిక నాయకులు ఆంజనేయులుగౌడ్, వెంకటరమణ, విజయ్‌కుమార్, హరిప్రతాప్, వెంకటేష్‌గౌడ్, జిల్లా నాయకులు కూడేరు జయప్రకాష్‌గౌడ్, శ్రీహరి, లక్ష్మీకాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.