రాంపాల్ ఆశ్రమంలో గర్భనిర్ధారణ కిట్లు!!
హర్యానాలో వివాదాస్పద బాబా రాంపాల్ ఆశ్రమం మీద పోలీసులు దాడిచేసి, ఆయన్ను అరెస్టు చేసినప్పుడు అక్కడ దొరికిన వస్తువుల జాబితాలో ఏవేం ఉన్నాయో తెలుసా? రివాల్వర్లు, మిరపకాయ బాంబులు.. వాటితో పాటు గర్భనిర్ధారణ కిట్లు! బల్వారాలోని సత్లోక్ ఆశ్రమంలో గల రాంపాల్ వ్యక్తిగత గదిలో కూడా ఇలాంటి ఓ కిట్ బయటపడింది. రాంపాల్ భక్తులను ఉద్దేశించి ప్రసంగించే స్థలానికి కింద సొరంగం లాంటి గది ఒకటుంది. అందులో మూడు .32 బోర్ రివాల్వర్లు, 19 ఎయిర్గన్లు, రెండు .12 బోర్ రైఫిళ్లు, రెండు .315 బోర్ రైఫిళ్లు, మిర్చి గ్రెనేడ్లు, వాటి క్యార్ట్రిడ్జిలు కూడా ఆశ్రమంలో ఉన్నాయి.
భారీమొత్తంలో ఇతర ఆయుధాలు, మందుగుండు సామగ్రి కూడా కనిపించాయి. రెండు పెద్ద వాటర్ ట్యాంకులు కూడా ఆశ్రమ ప్రాంగణంలో కనిపించాయి. ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన సుమారు 865 మందిని అరెస్టు చేశామని, వాళ్లలో ఎవరైనా నక్సలైట్లు కూడా ఉన్నారేమో పరిశీలిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
ఇక రాంపాల్ అయితే.. జైల్లో ఎవరితోనూ మాట్లాడటంలేదు. గత రాత్రి మొత్తం ఆయన ఏమీ తినలేదు, తాగలేదు. పూర్తి నిరాహారదీక్ష పాటిస్తున్నారు. శుక్రవారం ఉదయం రెండుసార్లు టీ తాగారు, గురువారం నాటి మధ్యాహ్నం నాలుగు చపాతీలు పప్పుతో తిన్నారు. ఆ తర్వాత పూర్తి నిరాహారంగానే ఉన్నారు.