ప్రసవం కోసం మహిళ పడిగాపులు
కంగ్టి, న్యూస్‌లైన్:
వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పురిటినొప్పులతో వచ్చిన ఓ గర్భిణి తీవ్ర అవస్థలు పడింది. వైద్యం కోసం గంటపాటు పడిగాపులు గాసింది. ఆమె పురిటి బాధలను చూసి చలించి ఓ మహిళ వైద్య అధికారికి ఫోన్‌చేయడంతో ఏఎన్ఎం హుటాహుటిన వచ్చి వై ద్యం ప్రారంభించింది. ఈ ఘటన ఆదివారం కంగ్టి పీహెచ్సీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..మండల పరిధిలోని బోర్గికి చెందిన లక్ష్మి(25) పురిటి నొప్పులతో బాధ పడుతుండగా ఆమె బంధువులు ఆటోలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం ఉదయం 11గంటలకు తీసుకొచ్చారు. అయితే తెరచే ఉన్న స్థానిక ఆస్పత్రిలో సిబ్బంది ఎవరూ అందుబాటులో లేరు. గంట పాటు సిబ్బంది కోసం వారు పడిగాపులు కాశారు. ప్రసవానికి సకాలంలో వైద్యం అందక మహిళా అవస్థలు పడింది. ఇదేసమయంలో మరో పేషెంటు సాధారణ చికిత్స కోసం ఆస్పత్రికి రాగా ప్రసవం కోసం లక్ష్మీ పడుతున్న బాధను చూసి చలించి సంబంధిత వైద్యాధికారి, ఫార్మాసిస్ట్‌కి ఫోన్ చేసింది. ఇక్కడ ఎవరూ పట్టించుకోవడంలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
కూర్చున్న చోటే నొప్పులతో బాధ పడుతున్న గర్భిణిని స్థానికులు పడకపై పడుకోబెట్టారు. పది నిమిషాల తర్వాత డ్యూటీ ఏఎన్ఎం హుటా హుటిన ఆస్పత్రికి చేరుకొని లక్ష్మీకి వైద్య చికిత్సలు ప్రారంభించారు. అయితే ఇంకాస్త ఆలస్యం చేస్తే ప్రాణాపాయం ఉండేదని బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం మహిళ ప్రసవించి ఆడపిల్లను జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు.