అంతర్జాతీయ వాణిజ్య మేళా షురూ
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని వేదికగా ప్రతి ఏటా నిర్వహించే భారత, అంతర్జాతీయ వాణిజ్యమేళా (ఇండియన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్-ఐఐటీఎఫ్) శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ 34 వ ఇండియన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్‌ను ప్రగతి మైదాన్‌లో ప్రారంభించారు. ‘మహిళా సాధికారిత- పారిశ్రామిక ప్రతియోగిత’ థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ ట్రేడ్ ఫెయిర్‌లో అన్ని రాష్ట్రాలతోపాటు పలు దేశాల పెవిలియన్లను ఏర్పాటు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు వేర్వేరుగా పెవిలియన్లు ఏర్పాటు చేయడం ఈమారు ఫెయిర్‌కి అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. శుక్రవారం నుంచి మొదలైన ఈ వాణిజ్య మేళా ఈనెల 27 వరకు కొనసాగనుంది.
ఆంధ్రప్రదేశ్ పెవిలియన్....
ఆంధ్రప్రదేశ్ పెవిలియన్‌ను ఏపీభవన్ ప్రత్యేక కమిషనర్ అర్జశ్రీకాంత్ ప్రారంభించారు. ఆయనతోపాటు పెవిలియన్ డెరైక్టర్ జీఎస్ రావు, ఏపీభవన్ ఇన్ఫర్మేషన్ అధికారి కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. హస్తకళలు, ఆప్కో ఉత్పత్తులు, వెంకటగిరి, ధర్మవరం చీరలు, కొండపల్లి చెక్కబొమ్మలు, అనంతపురం తోలుబొమ్మలు, వివిధ రకాల పచ్చళ్లు, తినుబండారాలు, ఆహార ఉత్పత్తుల స్టాళ్లు ఏర్పాటు చేశారు. పర్యాటకరంగం సహా మొత్తం ఎనిమిది ప్రభుత్వ విభాగాలు, 25 ప్రైవేటు సంస్థలకు చెందిన స్టాళ్లను ఏర్పాటు చేశారు.
తెలంగాణ పెవిలియన్....
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం నుంచి తొలిసారిగా ట్రేడ్ ఫెయిర్‌లో పెవిలియన్‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా దీన్ని తీర్చిదిద్దారు. నైజాం నవాబ్ కాలం నాటి పోస్టర్లు, తెలంగాణ జిల్లాల చిత్రపటాలు, ప్రముఖ చారిత్రక కట్టడాలతో అలంకరించారు. పెవిలియన్ బయట ఓ వైపు తెలంగాణ తల్లి విగ్రహం, హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధుడి ప్రతిమ, మరోవైపు భారీ బతుకమ్మను ఏర్పాటు చేశారు. ఈ పెవిలియన్‌ను శుక్రవారం సాయంత్రం తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి డా.వేణుగోపాలాచారి ప్రారంభించారు. హైదరాబాద్ బిర్యానీ ప్రాశస్త్యాన్ని, ఎంతో ప్రసిద్ధి చెందిన కరాచీ బేకరీ ఉత్పత్తుల రుచులను దేశవ్యాప్తంగా ప్రదర్శించేందుకు అవకాశం దక్కిందన్నారు.