ముస్తాబు
మంగళగిరి రూరల్, న్యూస్‌లైన్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. సభా ప్రాంగణంలో అంతర్గత రోడ్లు, హెలిప్యాడ్ల నిర్మాణాలతో పాటు బారికేడ్ల నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. మహిళలకు, పురుషులకు వేరువేరుగా గ్యాలరీలతో పాటు, వీఐపీల గ్యాలరీ, ప్రెస్ గ్యాలరీలను ఏర్పాటు చేశారు.
పధాన వేదికపై ఇనుప రేకులతో కప్పు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇక మైదానం చుట్టూ టీడీపీ నేతలు భారీ స్వాగత ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు, ఎన్టీ రామారావు, లోకేష్ ఫొటోలతో భారీ బెలూన్లు గాలిలో వేలాడుతూ ఏర్పాటు పనులను పరిశీలించేందుకు విచ్చేసిన అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మైదానం నలుమూలలా హైమాస్ట్ విద్యుత్ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు.
విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం కలుగకుండా రెండు ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వచ్చే నేతలకు, కార్యకర్తలకు, అభిమానుల దాహార్తిని తీర్చేందుకు తాగునీటి డ్రమ్ములను సిద్ధం చేస్తున్నారు. మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించేందుకు వస్తున్న నేతల వెంట పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలి వస్తున్నారు. దీంతో ఏర్పాట్లలో కొంత జాప్యం జరుగుతోంది. శుక్రవారం సాయంత్రం నాటికే ఏర్పాట్లు పూర్తి కావాల్సి వుండగా శనివారం సాయంత్రానికి గాని పూర్తికాని పరిస్థితి. మైదానంలో ఇప్పటికే పోలీస్ బలగాలు మోహరించాయి. దాదాపు 3వేల మంది పోలీస్ సిబ్బంది విధులకు హాజరయ్యారు.
అధికారుల పరిశీలన..
చంద్రబాబు ప్రమాణ స్వీకార ఏర్పాట్లను ప్రత్యేక అధికారి నవీన్ మిట్టల్, బి.రామాంజనేయులు, జిల్లా కలెక్టర్ ఎస్ సురేశ్‌కుమార్, కడప జిల్లా కలెక్టర్ కోన శశిధర్, మెప్మా పీడీ సేనాపతి ఢిల్లీరావు, డ్వామా పీడీ ప్రశాంతి, ఆర్డీవో రామ్మూర్తి, తహశీల్దార్ సరోజని పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
టీడీపీ ఎమ్మెల్యేల పరిశీలన...
సభా ప్రాంగణంలో జరుగుతున్న పనులను గుంటూరు, కృష్ణా జిల్లాల టీడీపీ ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, ధూళ్లిపాళ్ల నరేంద్ర, మోదుగుల వేణుగోపాలరెడ్డి, యరపతినేని శ్రీనివాసరావు, రావెల కిశోర్‌బాబు, జీవీ ఆంజనేయులుతో పాటు ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్, పార్టీ నేతలు కరణం బలరామ్, మన్నవ సుబ్బారావు, రాయపాటి శ్రీనివాస్, గంజి చిరంజీవి, మద్దాలి గిరిధర్ తదితరులు పరిశీలించారు.