ప్రజారోగ్య పరిరక్షణలో ఆర్ఎంపీల భాగస్వామ్యం అవసరం
ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్యం అందించడంలో ఆర్ఎంపీల సేవలు ఎంతో కీలకమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. నగర శివారులోని గోపాలపురం వద్దనున్న ఎస్ఆర్ గార్డెన్స్‌లో శుక్రవారం జిల్లా ఆర్ఎంపీల సంఘం 13వ మహాసభను ఆయన వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాం తాల్లో ప్రజలకు సకాలంలో వైద్యమందించేం దుకు ఆర్ఎంపీల సేవలను వినియోగించుకునేందుకు వైఎస్ఆర్ ప్రభత్వం నిర్ణయించిందన్నారు.
ఇందు లో భాగంగానే వారికి ప్రభుత్వరంగ సంస్థయిన పారా మెడికల్ బోర్డు ద్వారా శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఆయన మరణాంతరం వచ్చిన పాలకులు ఈ కార్యక్రమాన్ని నీరుగార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ఎంపీలకు ప్రత్యేక గుర్తింపునిస్తే రోడ్డు సౌకర్యాల్లేని మారుమూల గ్రామాల్లోని ప్రజలకు అత్యవసర వైద్యం అందుతుందని అన్నారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి రాగానే ఆర్ఎంపీలకు తగిన ప్రాధాన్యమిస్తుందని అన్నారు. మహాసభ ప్రారంభానికి ముందు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ మహాసభలో పార్టీ సేవాదళ్ నాయకుడు దారెల్లి అశోక్, జిల్లా బీసీ సెల్ కన్వీనర్ తోట రామారావు, కార్మిక విభాగం జిల్లా కన్వీనర్ సంపెట వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు మార్కం లింగయ్య గౌడ్, మందడపు వెంకటేశ్వరరావు, డాక్టర్ సామాన్య, వాలూరి సత్యనారాయణ, జాకబ్ ప్రతాప్, మైపా కృష్ణ, జిల్లేపల్లి సైదులు, ఆర్ఎంపీల సంఘం జిల్లా అధ్యక్షుడు బి.వెంకటేశ్వర్లు, గౌరవాధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వీరాచారి, కోశాదికారి నాగభూషణరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నాగభూషణం, న్యూరాలజిస్ట్ డాక్టర్ కె.గురునాధరావు, డాక్టర్ మురళి, డాక్టర్ నారాయణ, దంత వైద్యుడు పరుచూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.