‘పాస్‌పోర్ట్’ కేసు సూత్రధారి అరెస్టు
సాక్షి, హైదరాబాద్: బంగ్లాదేశీయుల్ని అక్రమ పాస్‌పోర్ట్‌ల ద్వారా దేశం దాటిస్తున్న ముఠా సూత్రధారి ఎట్టకేలకు పట్టుబడ్డాడు. ఈ గ్యాంగ్ సభ్యులను నగర పోలీసులు గత ఏడాది ఆగస్టులో అరెస్టు చేయగా... ప్రధాన నిందితుడిగా ఉన్న షౌకత్ అలీని ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారులు శుక్రవారం అక్కడ పట్టుకున్నారు. ఇతడిని ప్రిజనర్స్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్‌పై హైదరాబాద్ తీసుకువచ్చేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌లో 2013 ఫిబ్రవరి 21 జరిగిన బాంబు పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న జియా ఉర్ రెహ్మాన్ అలియాస్ వఖాస్‌ను ఈ ఘాతుకం తరవాత దేశం దాటించిన హుజీ ఉగ్రవాది మహ్మద్ నసీర్‌ను నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు గత ఏడాది ఆగస్టు 14న అరెస్టు చేశారు.
అక్రమంగా వలసవచ్చి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న మయన్మార్, బంగ్లాదేశ్ జాతీయులకు ఆశ్రయం కల్పించడం, నకిలీ ధ్రువీకరణ పత్రాలతో పాస్‌పోర్టులు, వీసాలు ఇప్పించడం ద్వారా విదేశాలకు పంపిస్తున్న ఆరోపణలపై ఇతడితో పాటు ఆరుగురిని పట్టుకున్నారు. విచారణ నేపథ్యంలో ఉగ్రవాద సంస్థ హర్కత్ ఉల్ జిహాద్ అల్ ఇస్లామీ (హుజీ)తో ఇతడికి ఉన్న సంబంధాలు, మనుషుల అక్రమ రవాణా తదితర అంశాలు వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన నూర్ ఉల్ హక్ విచారణతోనే ఈ అక్రమ పాస్పోర్ట్స్ వ్యవహారం మొత్తం బయటపడింది.
మయన్మార్‌కు చెందిన ఇతడు ఢిల్లీలో స్థిరపడి అక్కడ నుంచే దేశవ్యాప్తంగా నెట్వర్క్ నడిపించాడని తేలింది. ఇతడిని సైతం హైదరాబాద్ పోలీసు లు పీటీ వారెంట్‌పై తీసుకువచ్చి అరెస్టు చేసి విచారించారు. ఈ నెట్వర్క్ మొత్తానికి ఢిల్లీలో స్థిరపడిన బంగ్లాదేశ్ జాతీయుడు షౌకత్ అలీ కీలకమని బయటపడింది. అప్పటి నుంచి షౌకత్ కోసం ఢిల్లీతో పాటు హైదరాబాద్ పో లీసులు గాలిస్తున్నారు.
దక్షిణ ఢిల్లీలోని సరాయ్ కాలే ఖాన్ ప్రాంతంలో షౌకత్ ఉన్నాడన్న సమాచారం అందుకున్న ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు శుక్రవారం వలపన్ని అరెస్టు చేశారు. ఇతడికి హైదరాబాద్‌తో పాటు బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్, సౌదీ అరేబియాల్లోనే నెట్వర్క్ ఉన్నట్లు నిర్థారించారు. షౌకత్ అరెస్టు విషయం తెలుసుకున్న నిఘా విభాగం అధికారులు, పీటీ వారెంట్‌పై అతడిని నగరానికి తెచ్చేందుకు హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.