పీఆర్కే రావుకు హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: చెక్కు బౌన్స్ వ్యవహారం లో అరకు పార్లమెంట్ సభ్యురాలు కొత్తపల్లి గీత భర్త, విశ్వేశ్వర ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ పరుచూరి రామకోటేశ్వరరావు (పీఆర్‌కె రావు)కు ఉమ్మడి హైకోర్టులో ఊరట లభించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) నుంచి రూ.25 కోట్ల రుణం తీసుకుని దాని చెల్లింపు నిమిత్తం ఇచ్చిన చెక్కు బౌన్స్ కావడంతో ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష, రూ.25.24 కోట్ల జరిమానా విధిస్తూ ఆర్థిక నేరాల ప్రత్యేక న్యాయస్థానం కమ్ 8వ అదనపు ఎంఎస్‌జే కోర్టు ఇచ్చిన తీర్పు అమలును హైకోర్టు నిలిపేసింది. రామకోటేశ్వరరావుకు బెయిల్ మంజూరు చేసింది. రూ.10వేల చొప్పున రెండు పూచీ కత్తులు సమర్పించాలని ఆయన్ని ఆదేశిం చింది.
అంతేకాక జరిమానాగా విధించిన రూ.25.24 కోట్ల వసూలును కూడా నిలిపేసింది. అయితే ఆ మొత్తంలో 6వ వంతును కింది కోర్టులో డిపాజిట్ చేయాలని పీఆర్కే రావును ఆదేశించింది. ఒకవేళ ఆ మొత్తం చెల్లించకుంటే దానిని వారెంట్ జారీ చేసి రావు నుంచి చట్ట ప్రకారం వసూలు చేసుకోవాలని కింది కోర్టుకు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకర రావు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
చెక్కు బౌన్స్ కేసులో మేజిస్ట్రేట్ కోర్టు తీర్పును, ఆపై సెషన్స్‌కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ పీఆర్కే రావు హైకోర్టులో రివిజన్ పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి ఇటీవల విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది నవీన్‌కుమార్ వాదనలు వినిపించారు. వీటితో ఏకీభవించిన హైకోర్టు, పీఆర్‌కె రావుకు కింది కోర్టు విధించిన జైలుశిక్ష, జరిమానా అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యాజ్యంపై తుది తీర్పు వెలువడేంత వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని న్యాయ మూర్తి తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.