పండించకుండానే పడేశారు
♦ కార్యాలయంలో మూలన కూరగాయల విత్తనాలు
♦ రెండు శాఖల మధ్య సమన్వయలోపం
♦ ఏడాదిగా మెప్మా కార్యాలయంలో మూలుగుతున్న వైనం
♦ ఆరోగ్య పరిరక్షణ పథకం ఉత్తిదే
పట్టణాల్లోని పేదవారు పౌష్టికాహార సమస్యను అధిగమించేందుకు ఏడాది పొడవునా కూరగాయలను పండించుకుని తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనేది ఆరోగ్య పరిరక్షణ పథకం ఉద్దేశం. అయితే ఈ పథకాన్ని మెప్మా సంస్థ నీరుగార్చింది. పథక లక్ష్యాన్ని మూలన పడేసిందని ఉద్యానశాఖ అధికారులు విమర్శిస్తున్నారు. ప్రజలకు పంపిణీ చేయాల్సిన విత్తనాలను ఏడాదిగా కార్యాలయంలో నిర్లక్ష్యంగా వదిలేయడమే ఇందుకు నిదర్శనం.
కడప అగ్రికల్చర్: సమాజంలో అందరికీ ఆరోగ్యం అనే నినాదంతో కేంద్రం ఆరోగ్య పోషణ పథకాన్ని తీసుకువచ్చింది. దీనిని రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ద్వారా అమలు చేస్తోంది. ఈ పథకం కింద జిల్లాలో తొలిసారిగా పట్టణ ప్రాంతాల్లోని మహిళా సంఘాలకు ఆధునిక వంగడాలతో రూపొందించిన కూరగాయ విత్తనాలను అందించి ఆహార కొరతను కొంతవరకు నివారించాలనేది లక్ష్యం. పేదవర్గాల వారికి ఆయా విత్తనాలను అందించి కూరగాయలను ఇంటి ఆవరణల్లో సాగు చేసుకునేలా వీలు కల్పించారు. ఈ ఆరోగ్య పోషణ పథకాన్ని ఉద్యానశాఖ పర్యవేక్షణలో జిల్లాలోని మెప్మా (పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ)ద్వారా అమలుచేయాలని ప్రణాళికను రూపొందించారు.
బెంగళూరు నుంచి విత్తనాలు
గతేడాది ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ హాసరగట్ట బెంగళూరు నుంచి నాణ్యమైన 8రకాల కూరగాయ విత్తనాలను ఉద్యానశాఖ తీసుకువచ్చింది. జిల్లాలో అన్ని పట్టణాల్లోని మెప్మా సంఘాలకు అందజేసేలా మొత్తం 3,300 ప్యాకెట్లు తీసుకువచ్చారు. ఈ విత్తన పాకెట్ల అసలు ధర రూ.3.96 లక్షలుకాగా, ఇందులో రూ.1.98 లక్షల సబ్సిడీ ఇచ్చా రు. ఒక్కో విత్తన ప్యాకెట్ ధర రూ.120లుకాగా, ఇందులో 50 శాతం సబ్సిడీ పోను రూ.60కి మహిళలకు అందజేయాల్సి ఉంది. ఆ కూరగాయ విత్తనాలను కడపలోని మెప్మా సంస్థకు అందజేశారు.
గతేడాది మెప్మా సంస్థకు అందజేసినా వాటిని ఇప్పటివరకు మహిళా సంఘాలకు ఇవ్వకుండా మూలనపడేశారు. దీనికి సంబంధించిన వివరాలు కావాలని ఆడిట్శాఖ సిబ్బంది ఉద్యానశాఖను కోరింది. దీంతో అసలు విషయం బయపడింది. విత్తనాలను పంపిణీ చేయకుండా మూలన పడేసిన మెప్మాపైన, ఆరా తీయని ఉద్యానశాఖపై ఆయా శాఖలకు చైర్మన్గా వ్యవహరిస్తున్న కలెక్టర్ చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు. తమకు పూర్తి ధరకు ఇచ్చి ఉంటే ఇళ్ల ఆవరణలో సాగు చేసుకుని ఎంతో కొంత ఖర్చులు తగ్గించుకునే వారమని ప్రజలు అంటున్నారు.