గుర్ ర్ర్ ర్ ర్ర్...
♦ 8-10 శాతం మందిని వేధిస్తున్న గురక సమస్య
♦ గ్రేటర్లో 30 శాతం మందిలో నిద్రలేమి
♦ నేడు వరల్డ్ స్లీప్ డే
సాక్షి, సిటీబ్యూరో: ఇంటర్నెట్... ఫేస్బుక్... వాట్సాప్... టెలివిజన్... ఇవన్నీ సిటీజనులకు ఆనందాన్ని ఇవ్వడమే కాదు... కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పరోక్షంగా ఆరోగ్యంపై దాడి చేస్తున్నాయి. రాత్రి తొమ్మిది గంటలకే పడక పైకి చేరాల్సిన నగర వాసులు అర్థరాత్రి దాటిన తర్వాత కూడా మేలుకునేఉంటున్నారు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లతో గ్రేటర్ జనాభాలో 30 శాతం మంది నిద్రలేమి సమస్యతో బాధ పడుతున్నారు. వీరిలో 8-10 శాతం మంది అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నీయాతో బాధ పడుతున్నట్లు ఎయిమ్స్, స్టార్ ఈఎన్టీ వైద్యుల సర్వేలో వెల్లడైంది. ఢిల్లీలో 16-18 శాతం ...
బెంగళూరులో 15.5... చెన్నైలో 15... హైదరాబాద్లో 8 నుంచి 10 శాతం మంది (గురక, నిద్రలో శ్వాస సరిగా తీసుకోలేకపోవ డం) అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నీయాతో బాధ పడుతున్నట్లు తేలింది. నిద్రకు ఉపక్రమించిన తర్వాత 4 నుంచి 6 సార్లు మాత్రమే మేల్కొనాలి. కానీ చాలా మంది ఇలా నిద్రపోగానే అలా లేచి కూర్చుంటున్నారు. బలవ ంతంగా శ్వాస తీసుకునే ప్రయత్నం చేసినా ఊపిరితిత్తులు, మెదడు, గుండెకు చేరడం లేదు. పరోక్షంగా ఇది గుండె పోటుకు కారణమవుతోంది. రాత్రి రెండు నుంచి తెల్లవారుజామున ఐదు గంటల మధ్యలో వెలుగు చూస్తున్న మరణాల్లో 60 శాతానికి పైగా అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నీయానే కారణమని నిపుణుల అభిప్రాయం. పని ఒత్తిడి... మానసిక ఆం దోళనలతో అర్థరాత్రి దాటినా రెప్ప వాల్చడం లేదు. ఐటీ అనుబంధ రం గాల్లో పని చే స్తున్న వారు విదేశాలకు అనుగుణంగా తమ పనివేళలను మార్చుకుంటున్నారు. వీకెండ్ పార్టీలు కూడా ప్రబావం చూపుతున్నాయి.
ఏ వయసు వారు ఎన్ని గంటలు నిద్రపోవాలంటే...
రోజుల వయసున్న శిశువులు 18 గంటలు
ఏడాది లోపు చిన్నారులు 14-18 గంటలు
ఏడాది నుంచి మూడేళ్లలోపు చిన్నారులు 12-15 గంటలు
మూడు నుంచి ఐదేళ్లలోపు చిన్నారులు 11-13 గంటలు
ఐదు నుంచి 12 ఏళ్లలోపు పిల్లలు 9-11 గంటలు
12 నుంచి 19 ఏళ్లలోపు వారు 9-10 గంటలు
21 సంవత్సరాలు పైబడిన వారు 7-8 గంటలు
50 ఏళ్లు పైబడిన వారు 5-7 గంటలు
యువతలోనే ఎక్కువ
ప్రతి పది మందిలో ముగ్గురు నిద్రలేమితో బాధ పడుతున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది 35 ఏళ్ల లోపు వారే. రాత్రి నిద్రపోకపోవడం వల్ల మానసిక, శారీరక ఎదుగుదలకు సంబంధించిన హార్మోన్స్ తగ్గడంతో పాటు సెక్సువల్ హార్మోన్స్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతుంది. ప్రతి చిన్న విషయానికీ కోపం, చిరాకు పడతారు. అంతేకాదు.. అధిక రక్తపోటు, గుండెపోటు, మధుమేహం బారిన పడే ప్రమాదం ఉంది. -డాక్టర్ శ్రీనివాస్ కిషోర్, ఈఎన్టీ నిపుణుడు, స్టార్ ఆస్పత్రి