గిట్టుబాటు ధర లేక శనగ రైతు గజగజ
ఒంగోలు, న్యూస్‌లైన్: జిల్లాలో శనగ రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పటికే శీతల గిడ్డంగుల్లో 20 లక్షల క్వింటాళ్ల నిల్వలు పేరుకుపోయాయి. కోల్డ్ స్టోరేజీల్లో ఉంచిన శనగలపై రుణాలు తీసుకున్న రైతులకు ప్రస్తుతం బ్యాంకర్ల నుంచి తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయి. రుణం చెల్లిస్తారా..శనగలను వేలం వేయమంటారా అంటూ ఒత్తిడి చేస్తున్నారు. వేలం ద్వారా విక్రయిస్తే బ్యాంకుల అప్పులు తీరడం తప్ప చేతికి పైసా రాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో పొగాకు పంటకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం శనగ సాగును ప్రోత్సహించింది. ప్రస్తుతం ఏటా 3 లక్షల ఎకరాల్లో శనగలు పండిస్తుంటారు. పంట ఉత్పత్తి వ్యయం ఏటేటా పెరిగిపోతుండగా, విక్రయించే సమయానికి ధరలు దిగజారి రైతులు నట్టేట మునుగుతున్నారు.
2011-12లో పండించిన పంటలో మంచి ధర వస్తుందని దాచుకున్న 3 లక్షల క్వింటాళ్ల తెల్ల శనగలు నేటికీ శీతల గిడ్డంగుల్లోనే నిల్వ ఉన్నాయి. ఈ విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మరుసటి ఏడాది అంటే 2012-13లో పండించినవి మరో 17 లక్షల క్వింటాళ్లు కోల్డు స్టోరేజీలకు చేరుకున్నాయి. దీంతో మొత్తం 20 లక్షల క్వింటాళ్లు నిల్వ ఉంటాయని అంచనా. దేశీయంగా పండించిన శనగలకు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతుంటే మరోవైపు 40 దేశాల నుంచి మన దేశానికి శనగలు దిగుమతవుతుండటంతో పరిస్థితి మరింత దిగజారింది. ఈ ఏడాది పండించిన పంటను కనీసం దాచుకునేందుకు సైతం ఇక్కట్లు తప్పేలా లేవు. గిడ్డంగుల్లో దాచుకోవడం కూడా గగనంగా మారుతోంది. వీటిని బయట నిల్వ ఉంచుకోవడం వల్ల తీవ్రంగా నష్టపోక తప్పదు. దీంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఏడాది కాలంగా 50 వేలమందికి పైగా రైతులు తీవ్ర సమస్యను ఎదుర్కొంటున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు పరిష్కారాన్ని కనుగొనలేకపోయారు.
మహానేత ఉన్నపుడు ఇలా: వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. దీనిపై రైతు సంఘాల ప్రతినిధులు వైఎస్ఆర్ను కలుసుకొని విన్నవించారు. దీంతో ఆయన వెంటనే కేంద్రంతో మాట్లాడి దిగుమతులపై ఆంక్షలు విధించడం ద్వారా రైతులకు మేలు కలిగేలా చూశారు. కానీ ప్రస్తుతం రైతుల గోడు వినేవారే కరువయ్యారు. శనగ రైతులు తమ సమస్యలు పరిష్కరించాలని గతంలో ఒకసారి ఢిల్లీకి వెళ్లి కేంద్రమంత్రి పురందేశ్వరితో కలిసి వాణిజ్యశాఖామంత్రికి విజ్ఞప్తి చేశారు. వ్యవసాయశాఖ మంత్రితో కూడా మాట్లాడి తప్పక న్యాయం చేస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. కానీ ఆనాటి నుంచి నేటి వరకు శనగ రైతుల విషయంపై ఏమాత్రం స్పందన కనిపించలేదు. దీంతో రైతు సంఘ ప్రతినిధులు మళ్లీ ఆందోళన మొదలుపెట్టారు.
రైతు సంఘాల డిమాండ్లు ఇవీ:
కోల్డు స్టోరేజీల్లో ఉన్న శనగలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
- శనగలకు సంబంధించి జేజే-11 రకానికి క్వింటాలుకు రూ.4 వేలు, కాక్-2 రకం శనగలకు క్వింటాలుకు రూ.5 వేలు, బోల్ట్ రకం క్వింటాలుకు రూ.6 వేలు కనీస మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించాలి. ఆ మేరకు రైతుల వద్దనుంచి ప్రభుత్వం శనగలను కొనుగోలు చేయాలి.
- శనగ దిగుమతులను వెంటనే ఆపాలి.
- శనగ రైతుల రుణాలకు సంబంధించి బ్యాంకర్ల ఒత్తిడిని తగ్గించాలి. రైతులకు వడ్డీ రాయితీ ఇవ్వాలి.