మోదీ, బాబు .. ఇద్దరూ మోసగాళ్లే
మాజీ మంత్రి దేవినేని నెహ్రూ
మోపిదేవి : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరూ మోసగాళ్లేనని మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) చెప్పారు. మోపిదేవిలో మంగళవారం రేమాల బెనర్జీ అధ్యక్షతన నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నెహ్రూ మాట్లాడుతూ బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అద్వానీకి మోదీ అన్యాయం చేస్తే, చంద్రబాబు సొంత మామనే వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. కేవలం రెండు సీట్లున్న బీజేపీ నేడు అధికారంలోకి రావడానికి అద్వానీ ఎంతో కృషిచేయగా, మామకు వెన్నుపోటు పొడిచి బాబు సీఎం అయ్యారని దుయ్యబట్టారు. గుజరాత్ రాష్ట్రంలో అల్లర్లు జరిగినప్పుడు సీఎంగా ఉన్న నరేంద్రమోదిని తప్పించాలని నాడు వాజ్‌పేయి చూస్తే, అండగా నిలిచిన అద్వానీని మోదీ విస్మరించారన్నారు.
సింగపూర్ పేరుతో ప్రజలకు మోసం
రాష్ట్రాన్ని సింగపూర్‌గా మారుస్తామని చెబుతున్న చంద్రబాబు మాటలన్నీ మోసమేనని మరో ముఖ్యఅతిథి, మాజీ మంత్రి సి.రామచంద్రయ్య విమర్శించారు. నూతన రాజధాని నిర్మాణానికి రైతుల భూములు తీసుకుని పట్టా ఇస్తా, వెయ్యిగజాలు స్థలం ఇస్తామంటూ మరోసారి నమ్మించడాని బాబు చూస్తున్నారని, అయితే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని తెలిపారు. ఏడాదికి మూడు పంటలు పండే భూములు వదులుకోవడాని రైతులు సిద్ధంగా లేరని స్పష్టంచేశారు.
బాబు పాలనలో పూర్తిగా విఫలమై ప్రధాని మోదీ జపంచేస్తూ ఢిల్లీలో అపాయిమెంట్ కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నారని ఎద్దేవా చేశారు. డీసీసీ అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహారావు పార్టీ సభ్వత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వివిధ రకాల తెలుగు వంటకాలతో వనభోజనాలు నిర్వహించారు. పార్టీ నాయకుడు దేవినేని అవినాష్, మత్తి వెంకటేశ్వరావు, జి.బాబూరావు, పి.విశ్వేశ్వరావు, డి.మురళీకృష్ణ, అడపా నాగేంద్ర, మస్తాన్ వలీ, అన్నపరెడ్డి సత్యనారాయణ, పద్మశ్రీ, బండ్రెడ్డి వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.