టూకీగా ప్రపంచ చరిత్ర 56
ఆడ-మగ
‘ఎప్పుడు’ అనే ప్రశ్నకు ఇటీవలి కాలంలో సమాధానం దొరికింది. ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ వచ్చిన తరువాత, జన్యుపదార్థ నిర్మాణాన్నిబట్టి, జీవులను రెండు తరగతులుగా విభజించారు. మొదటి తరగతి ‘ప్రొకార్యోట్స్ కాగా, రెండవ తరగతి ‘యూకార్యోట్స్. ‘ప్రొకార్యోట్స్’ మొత్తం ఏకకణజీవులే. వీటిల్లో న్యూక్లియస్ ఉండదు; చిక్కటి జన్యుపదార్థం కణం మధ్యలో ఉంటుందేగానీ, దాని చుట్టూ న్యూక్లియార్ మెంబ్రేన్ ఏర్పడివుండదు. యూకార్యోట్లలో ఏకకణజీవులూ ఉన్నాయి, బహుకణజీవులూ ఉన్నాయి. కణాలసంఖ్య ఎంతైనా, ప్రతికణంలోని జన్యుపదార్థం పొరతో ఉండడం కారణంగా, అది న్యూక్లియస్‌గా కనిపిస్తుంది. ఈ తరగతిలోని బహుకణజీవుల్లో జన్యుపదార్థం వేరువేరు గనుల నుండి వచ్చిన మిశ్రమం కావడంతో, కణవిభజనకు ‘మైటాసిస్’నే కాకుండా, పరిమితంగా ‘మియాసిస్ పద్ధతిని గూడా అవలంబించే జీవుల దగ్గర సెక్స్ మొదలౌతుంది. వేరువేరు గనులనుండి పొందిన రెండురకాల జన్యువులు, తమ పదార్థాన్ని పరస్పరం మార్పిడి చేసుకోవడం ద్వారా వైవిధ్యం సంపాదించుకోవడం మియాసిస్ కణవిభజనలోని ప్రత్యేకత. పొరపాటుకు తావివ్వకుండా ఇక్కడ గుర్తుంచుకోవలసిన కీలకాశం ఏమిటంటే - ఆడ, మగ జీవుల్లో ప్రత్యేకంగా ఏర్పడిన జననేంద్రియాల్లో తయారయ్యే కణాలకు మాత్రమే మియాసిస్ విభజన పరిమితం. దేహంలోని మిగతా కణాలన్నీ పెరిగేదీ, యథాస్థితిని పోషించుకునేదీ మైటాసిస్ విభజన ద్వారానే.
(అర్థం చేసుకునేందుకు మియాసిస్ విభజన కొంత కష్టంగా ఉంటుంది గాబట్టి, పాఠకులకు ఇబ్బంది కలగకుండా ఆ వివరణ అనుబంధంగా చేర్చబడింది. తెలుసుకోవాలనే కుతూహలం కలిగినవాళ్ళు ఈ అధ్యాయం చివరిలోని అనుబంధం నుండి తెలుసుకోగలరు)
‘ఇంత తతంగంతో అవసరం ఎందుకు ఏర్పడింది?’ అనే ప్రశ్నకు జవాబుగా ఎవరి ప్రతిపాదన వాళ్ళది. ‘ప్రయోజనం కోసం ఏర్పడింది కాదు. ఏదో సమయంలో సృష్టి పరిణామంలో జరిగిన యాక్సిడెంట్ కారణంగా ఏర్పడింది మాత్రమే. దీన్ని పట్టుకుని శాస్త్రజ్ఞులు కొందరు లేనిపోని రాద్దాంతం చేస్తున్నారు’ అనేవాళ్ళు లేకపోలేదు. కానీ, ఎక్కువమంది శాస్త్రజ్ఞులు సృష్టిని అంత తేలిగ్గా తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. ‘అది కేవలం యాక్సిడెంటే అయ్యుంటే, సృష్టి దాన్ని పక్కకు తొలగించుకోకుండా రెండువందల కోట్ల సంవత్సరాలుగా ఎందుకు కొనసాగిస్తుంది? కాబట్టి, ఏదోవొక ప్రయోజనం ఉండే ఉండాలి.’ అనేది మిగతావాళ్ళ నమ్మకం. ఇది కూడా తోసిపుచ్చేందుకు వీలులేని వాదనే. మనుగడ నిలుపుకునే విధానంలో జీవి ఎన్నో గాయాలను మాన్పుకోగలుగుతోంది.
అవసరం తీరిపోయిన తోకను రాల్చేసింది; సంతానం సంఖ్య పడిపోయిన తరువాత స్తనాల సంఖ్యను కుదించుకుంది; ‘అపెండిక్స్’ను ఖాతరులేని అవయవంగా మూలకు నెట్టేసింది. ప్రయోజనం లేనివాటిని తనకుతానై తొలగించుకోగలిగిన ప్రాణి సెక్స్‌ను వందల కోట్ల సంవత్సరాలు కొనసాగించడం నిరర్థకమని భావించేందుకూ వీలుగాదు. కానీ, ఏమిటి ఆ ప్రయోజనం అనేది మాత్రం స్పష్టంగా తేల్చుకోలేకపోతున్నాం.
‘ఈ తరహా కణవిభజనకు పట్టే కాలం ఎక్కువ, ఖర్చయ్యే శక్తిగూడా ఎక్కువ. సంయోగంలో బలమైన గ్యామేట్లే కలుస్తాయో, బలహీనమైనవి కలుస్తాయే ముందుగా తెలియని లాటరీ ఫలితం వంటిది. ఇంతమాత్రానికి అంత ప్రయాస అవసరమా? పైగా, సెక్స్ లేకుండా పుడుతున్న సంతానం గూడా ఈ రెండువందల కోట్ల సంవత్సరాలుగా కొనసాగుతూనేవుంది గదా’ అంటారు కొందరు.
రచన: ఎం.వి.రమణారెడ్డి