కొత్త సంవత్సరం వేడుక శాంతియుతంగా....
జగిత్యాల రూరల్: కొత్త సంవత్సరం వేడుకల పేరుతో ఎలాంటి ఆస్తులు ధ్వంసం చేసినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ అనంతశర్మ హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా పోలీసు క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన సంవత్సర వేడుకలు పురస్కరించుకుని పట్టణంలోని రెండు బైపాస్‌రోడ్లను మూసివేస్తున్నామని, స్థానిక ప్రజలకు మాత్రం రవాణా అందుబాటులో ఉంటుందని.. నూతన సంవత్సర వేడుకల రాత్రి సమయంలో మద్యంమత్తులో వాహనాలు నడిపినా కేసులు నమోదుతో పాటు వాహనాలను జప్తుచేస్తామన్నారు. రాత్రి ఒంటిగంట తర్వాత ప్రజలు గుంపులు గుంపులుగా ఉంటే వారిని అరెస్ట్ చేసి కేసులు నమోదు చేస్తామన్నారు. వేడుకల సందర్భంగా ఎలాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు జప్తు చేసినా నాన్ బెయిలబుల్ కేసులు పెడతామని, డీజే సౌండ్స్ ఉపయోగిస్తే వాటిని జప్తు చేయడంతో పాటు డీజే యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.
జిల్లా వ్యాప్తంగా అన్నిపోలీస్స్టేషన్లలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని, అవసరమైతే అదనపు బలగాలను కూడా రంగంలోకి దింపుతామన్నారు. పట్టణంలో ఆరు పార్టీల పోలీసు బలగాలు బందోబస్తుకు వినియోగిస్తున్నామని, బార్లు, వైన్స్‌లు కూడా ప్రభుత్వ నిబంధనల మేరకే అనుమతిస్తామని, సమయం దాటితే సహించేది లేదన్నారు. వాహనాలపై ముగ్గురు వెళ్లినా కేసులు నమోదు చేస్తామన్నారు. యువకుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను అందుబాటులో ఉంచుకునేలా సహకరించాలన్నారు. ఆపద సమయంలో 108, ఇతర వాహనాలు అందుబాటులో లేకుంటే పోలీసులకు సమాచారం అందించినా ఆస్పత్రికి చేరుస్తామని అన్నారు. ఆపద సమయంలో జిల్లా అధికారులకు ఎవరికైనా పోలీసులు అందుబాటులో ఉంటారన్నారు. పోలీ సులు భద్రత విషయంలో కాకుండా సామాజిక సేవలో కూడా తమవంతు సేవలందిస్తామని, కలెక్టర్ తీసుకున్న 36 గంటల్లో మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమంలో పెగడపల్లి మండలం దోమలకుంటలో పెగడపల్లి పోలీసుల ఆధ్వర్యంలో మరుగుదొడ్ల నిర్మాణంలో పోలీసులు కృషిచేయడం జరిగిందన్నారు. పెగడపల్లి మండలం వెంగళాయిపేటలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ప్రమాదకరమైన బావిని పోలీసు శాఖనేపూడ్చివేసి విద్యార్థులకు ఆటస్థలంగా మార్చామని అన్నారు. జిల్లా పోలీసులు ప్రజలతో ఫ్రెండ్లీగా ఉండేందుకే ముందుకెళ్తామన్నారు. చాల చోట్ల జిల్లాలో ధౌర్జన్యంగా భూములు ఆక్రమించుకుంటున్నారని పలు ఫిర్యాదులు వచ్చాయని, ఈనేపథ్యంలో అక్రమాలకు పాల్పడిన వారిని కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది హెచ్చరించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ ఏర్పాటు చేసి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ పుల్ల కరుణాకర్, సీఐలు కరుణాకర్‌రావు, సర్వర్ పాల్గొన్నారు.