బ్రిక్స్ బ్యాంక్ సారథి కామత్
గత వారం బిజినెస్
మూడోసారి వడ్డీరేట్లు తగ్గించిన చైనా
10/05/15: ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగిన చైనా ఆర్థిక వృద్ధి మందగమనం వల్ల గతేడాది నవంబర్ నుంచి ఇప్పటి వరకు అంటే ఆరు నెలల సమయంలో మూడు సార్లు వడ్డీరేట్లను తగ్గించింది. చైనా పబ్లిక్ బ్యాంక్ వడ్డీ రేటును 25 బేసిక్ పాయింట్లు తగ్గించింది.
బ్రిక్స్ బ్యాంక్ సారథి... కామత్
11/05/15: ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధికి పోటీగా వర్ధమాన దేశాల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు నిధులందించడమే లక్ష్యం గా 100 బిలియన్ డాలర్ల మూలధనంతో షాంఘై కేంద్రంగా ఏర్పాటుకానున్న బ్రిక్స్ బ్యాంకు తొలి ప్రెసిడెంట్‌గా కేవీ కామత్ పేరు ఖరారైంది.
రెండంకెల వృద్ధే లక్ష్యంగా.. లగ్జరీ కార్ల కంపెనీలు
మెర్సిడస్, ఆడి, బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ కార్ల కం పెనీలు రెండంకెల వృద్ధిపై కన్నేశాయి. ఈ ఏడాది తొలి 5 నెలల్లో బీఎండబ్ల్యూ 10 మోడళ్లను, మెర్సిడస్ 5 మోడళ్లను, ఆడి 4 మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేశాయి. అలాగే ఈ 3 కంపెనీలు డిసెంబర్ చివరికి 30 మోడళ్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నాయి.
టోకు ధరలు మరింత తగ్గాయ్
12/05/15: టోకు ధరల సూచీ ఆధారిత (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణ రేటు ఏప్రిల్‌లో -2.65 శాతానికి క్షీణించింది. 2014 ఏప్రిల్‌తో పోలిస్తే మొత్తం టోకు వస్తువుల ధరలు -2.65 శాతానికి తగ్గాయన్నమాట. గతేడాది జీరో స్థాయిలో కదలాడుతున్న ద్రవ్యోల్బణ రేటు జనవరి నుంచి ఏకంగా మైనస్లలోకి జారిపోయింది. ఇది వ్యవస్థలో డిమాండ్ లేకపోవడానికి ప్రతిబింబమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
5 నెలల కనిష్టానికి పారిశ్రామికాభివృద్ధి
తయారీ రంగం కాస్త పుంజుకున్నప్పటికీ పారిశ్రామికాభివృద్ధి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. మార్చిలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు (ఐఐపీ) 2.1 శాతానికి పరిమితమైంది. ఫిబ్రవరిలో ఈ రేటు 4.86 శాతంగా (సవరణకు ముందు 5 శాతం) నమోదైంది. గతేడాది ఐఐపీ మైనస్‌లలో (-0.5 శాతం) కొనసాగింది. గతేడాది అక్టోబర్‌లో -2.7 శాతంగా ఉన్న ఐఐపీ నవంబర్‌లో 5.2 శాతం, డిసెంబర్ 3.56 శాతం, జనవరి 2.77 శాతం చొప్పున వృద్ధి చెందుతూ వచ్చింది.
రిటైల్ ధరలు కూల్
వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం రేటు ఏప్రిల్ నెలలో 4.87 శాతంగా నమోదైంది. ఇది నాలుగు నెలల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. అంటే 2014 ఏప్రిల్ ధరలతో పోలిస్తే ఆయా వినియోగ వస్తువుల ధరలు 4.87 శాతం పెరిగాయన్నమాట. ఇక మార్చి నెలలోలో రిటైల్ ద్రవ్యోల్చణం రేటు 5.25 శాతంగా నమోదైంది.