Pudukottai District
-
తనయుడిని హత్య చేసి దంపతుల ఆత్మహత్య
తిరువొత్తియూరు: అప్పుల బాధ కారణంగా కుమారుడిని హత్య చేసి భార్య, భర్త ఇద్దరూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కొత్త చాకలిపేటలో సంచలనం కలిగించింది. విల్లుపురం జిల్లాకు చెందిన శివాజీ (45), అతని భార్య వనిత (32). వీరికి వెట్రివేల్ (10) అనే కుమారుడు ఉన్నాడు. శివాజీ చాకలిపేటలో వెంకటేశం వీధిలో అద్దె ఇంటిలో నివాసం ఉంటూ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీలో పని చేస్తున్నారు. ఇతను కుటుంబ ఖర్చుల కోసం పలువురి వద్ద అప్పు చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి అందరూ భోజనం చేసి పడుకున్నారు. బుధవారం ఉదయం చాలా సమయం అయినప్పటికీ శివాజీ కుటుంబ సభ్యులు బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగు వారు వెళ్లి చూశారు. ఆ సమయంలో శివాజి, వనిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. కొత్తచాకలిపేట ఇన్స్పెక్టర్ చిదంబర భారతి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సృహ తప్పి పడి వున్న బాలుడిని పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మరో ఘటనలో సహకార సంఘం కార్యదర్శి ఆత్మహత్య పుదుకోట్టై జిల్లా కీరానూరుకు చెందిన నీలకంఠన్ (52). కీరనూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బ్యాంకులో కార్యదర్శిగా పని చేస్తున్నా డు. ఇతను నగలపై రుణాలు ఇవ్వడంలో 1.08 కోట్లు మోసం చేసినట్లు గుర్తించారు. అధికారులు నీలకంఠను అతనికి సహాయపడిన బ్యాంకు సూపర్వైజర్ శక్తివేల్‌ను తాత్కాలికంగా పని నుంచి తొలగించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్న ఈ క్రమంలో కీరనూరులో నివాసం వుంటున్న నీలకంఠన్ ఇంటిలో బుధవారం ఉదయం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. చదవండి: Punjab: ఫోన్ సంభాషణల ఆధారంగా విడాకులు మంజూరు చేయడం కుదరదు! -
రక్త సిక్తం
► పుదుకోట్టైలో రోడ్డు ప్రమాదం ► వ్యాన్‌ను ఢీ కొన్న లారీ ► ఒకే గ్రామానికి చెందిన ఆరుగురి బలి ► విషాదంలో తాడపట్టి సాక్షి, చెన్నై: పుదుకోట్టై జిల్లా గంధర్వ కోట్టై పుదునగర్ వద్ద సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మినీ వ్యాన్‌ను లారీ వేగంగా వచ్చి ఢీ కొనడంతో ఆరుగురు సంఘటనా స్థలంలోనే విగత జీవులు అయ్యారు. మరో ఏడుగురి పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. మృతులు ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో తాడపట్టి శోకసంద్రంలో మునిగింది. పుదుకోట్టై జిల్లా తాడపట్టికి చెందిన ముఫ్పై మంది అరంతాంగిలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. శుభాకార్యాన్ని ముగించుకుని స్వగ్రామానికి మినీ వ్యాన్‌లో తిరుగు పయనం అయ్యారు. వీరు పయనిస్తున్న మినీ వ్యాన్ గంధర్వ కోట్టై పుదునగర్ వద్దకు రాగానే ప్రమాదానికి గురైంది. ఎదురుగా అతి వేగంగా వస్తున్న లారీ అదుపు తప్పి మినీ వ్యాన్‌ను ఢీ కొంది. అప్పటి వరకు ఆనందోత్సాహాలతో వ్యాన్‌లో పయనం సాగిస్తున్న వారందరూ ఈ ప్రమాదంతో ఉలిక్కిపడ్డారు. గాల్లో ఎగిరిన వ్యాన్ నుజ్జునుజ్జయింది. అందులో నుంచి కొందరు ఎగిరి రోడ్డు మీద పడ్డారు. క్షణాల్లో చోటు చేసుకున్న ఈ ప్రమాదంతో అటు వైపుగా వెళ్తున్న వాహనా దారులు ఆందోళనకు గురయ్యారు. అంబులెన్స్‌లకు, పుదుకోట్టై పోలీసులకు సమాచారం అందించి సహాయక చర్యల్లో నిమగ్నం అయ్యారు. గాయాలతో కొట్టుమిట్టాడుతున్న వారిని తంజావూరు మెడికల్ కళాశాల ఆసుపత్రికి తరలించారు. రోడ్డు మీద ఎగిరిపడ్డ వారి ఆరుగురు సంఘటనా స్థలంలోనే విగత జీవులు అయ్యారు. తమ గ్రామానికి చెందిన వారు ప్రమాదంలో మృతి చెందిన సమాచారంతో తాడపట్టి శోక సంద్రంలో మునిగింది. ఆ గ్రామం నుంచి పెద్ద ఎత్తున జనం సంఘటనా స్థలం వైపుగా దూసుకొచ్చారు. విగత జీవులుగా పడి ఉన్న తమ వాళ్ల మృత దేహాల్ని చూసి బోరున విలపించారు. దీంతో ఆ పరిసరాల్లో ఉద్వేగ భరిత వాతావరణం నెలకొంది. మృతి చెందిన ఆరుగురు ఒకే గ్రామానికి చెందిన వారుగా విచారణలో తేలింది. అలాగే, 20 మంది గాయ పడ్డారు. వీరిలో ఏడుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. పుదుకోట్టై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపు తప్పడంతోనే ప్రమాదం చోటు చేసుకున్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదం కారణంగా ఆ మార్గంలో గంటన్నరకు పైగా రాక పోకలు ఆగాయి. విల్లుపురం జిల్లా రిషివంధియం వద్ద జరిగిన మరో ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వ్యాను బోల్తా పడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడ్డ 20 మందిని విల్లుపురం ఆసుపత్రికి తరలించారు.