► పుదుకోట్టైలో రోడ్డు ప్రమాదం
► వ్యాన్‌ను ఢీ కొన్న లారీ
► ఒకే గ్రామానికి చెందిన ఆరుగురి బలి
► విషాదంలో తాడపట్టి
సాక్షి, చెన్నై: పుదుకోట్టై జిల్లా గంధర్వ కోట్టై పుదునగర్ వద్ద సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మినీ వ్యాన్‌ను లారీ వేగంగా వచ్చి ఢీ కొనడంతో ఆరుగురు సంఘటనా స్థలంలోనే విగత జీవులు అయ్యారు. మరో ఏడుగురి పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. మృతులు ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో తాడపట్టి శోకసంద్రంలో మునిగింది. పుదుకోట్టై జిల్లా తాడపట్టికి చెందిన ముఫ్‌పై మంది అరంతాంగిలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. శుభాకార్యాన్ని ముగించుకుని స్వగ్రామానికి మినీ వ్యాన్‌లో తిరుగు పయనం అయ్యారు.
వీరు పయనిస్తున్న మినీ వ్యాన్ గంధర్వ కోట్టై పుదునగర్ వద్దకు రాగానే ప్రమాదానికి గురైంది. ఎదురుగా అతి వేగంగా వస్తున్న లారీ అదుపు తప్పి మినీ వ్యాన్‌ను ఢీ కొంది. అప్పటి వరకు ఆనందోత్సాహాలతో వ్యాన్‌లో పయనం సాగిస్తున్న వారందరూ ఈ ప్రమాదంతో ఉలిక్కిపడ్డారు. గాల్లో ఎగిరిన వ్యాన్ నుజ్జునుజ్జయింది. అందులో నుంచి కొందరు ఎగిరి రోడ్డు మీద పడ్డారు. క్షణాల్లో చోటు చేసుకున్న ఈ ప్రమాదంతో అటు వైపుగా వెళ్తున్న వాహనా దారులు ఆందోళనకు గురయ్యారు. అంబులెన్స్‌లకు, పుదుకోట్టై పోలీసులకు సమాచారం అందించి సహాయక చర్యల్లో నిమగ్నం అయ్యారు.
గాయాలతో కొట్టుమిట్టాడుతున్న వారిని తంజావూరు మెడికల్ కళాశాల ఆసుపత్రికి తరలించారు. రోడ్డు మీద ఎగిరిపడ్డ వారి ఆరుగురు సంఘటనా స్థలంలోనే విగత జీవులు అయ్యారు. తమ గ్రామానికి చెందిన వారు ప్రమాదంలో మృతి చెందిన సమాచారంతో తాడపట్టి శోక సంద్రంలో మునిగింది. ఆ గ్రామం నుంచి పెద్ద ఎత్తున జనం సంఘటనా స్థలం వైపుగా దూసుకొచ్చారు. విగత జీవులుగా పడి ఉన్న తమ వాళ్ల మృత దేహాల్ని చూసి బోరున విలపించారు. దీంతో ఆ పరిసరాల్లో ఉద్వేగ భరిత వాతావరణం నెలకొంది.
మృతి చెందిన ఆరుగురు ఒకే గ్రామానికి చెందిన వారుగా విచారణలో తేలింది. అలాగే, 20 మంది గాయ పడ్డారు. వీరిలో ఏడుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. పుదుకోట్టై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపు తప్పడంతోనే ప్రమాదం చోటు చేసుకున్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ ప్రమాదం కారణంగా ఆ మార్గంలో గంటన్నరకు పైగా రాక పోకలు ఆగాయి. విల్లుపురం జిల్లా రిషివంధియం వద్ద జరిగిన మరో ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వ్యాను బోల్తా పడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడ్డ 20 మందిని విల్లుపురం ఆసుపత్రికి తరలించారు.
రక్త సిక్తం
Published Tue, Apr 11 2017 3:17 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
Advertisement
Advertisement