మీకు తెలుసా!
ఇరుముడిలో ఏముంటుంది?
ఇరుముడిలో రెండు భాగాలు ఉంటాయి. ముందు భాగంలో పూజాసామగ్రి, వెనుకభాగంలో భక్తునికి కావలసిన వస్తువులు, తినుబండారాలు ఉంటాయి. ముందు భాగంలో ఉండే ఆవునెయ్యి భక్తుని ఆత్మతో, కొబ్బరికాయ దేహంతో సమానం. అంటే భక్తులైనవారు ఆత్మతో సమానమైన నేతితో స్వామికి అభిషేకం చేసి (ఆత్మార్పణం గావించి) దేహం వంటి కొబ్బరికాయను స్వామి సన్నిధిలోగల హోమకుండంలో వేయాలి. కామక్రోధాలను వీడి, కొబ్బరికాయలో ఉన్న మోహమనే నీళ్లను తీసేసి, జ్ఞానమనే నెయ్యి పోసి, భక్తి, నిష్ఠ అనే రెండు ముడులను (ఇరుముడి) వేసి 41 రోజులు స్వామి తలపులతోనే కఠినమైన జపం చేయాలి, శరీరం మీద మోహాన్ని విడిచి భగవంతునికే అంకితం చేయాలని అర్థం. వెనుకభాగంలో ఉన్న తినుబండారాలు మానవుని ప్రారబ్ధకర్మలు. ఎవరి ప్రారబ్ధాన్ని వారే మోసుకొనిపోవాలి, వారే అనుభవించాలి. స్వామి సన్నిధికి చేరుకొనే సరికి తినుబండారాలు అయిపోవాలి. అంటే స్వామి సన్నిధికి చేరుకున్న భక్తుడు ప్రారబ్ధకర్మను వదిలివేయాలని అర్థం.
శఠగోపం ఎందుకు?
ఎందుకు?
శఠగోపం శిరస్సు మీద పెడతారు. దీనిపైన భగవంతుని పాదుకలు ఉంటాయి. దేవుని పాదాలను శిరసున ధరించాలి. భగవంతుని స్పర్శ శిరస్సుకు తగలడం అంటే భక్తులను అనుగ్రహించడం అని అర్థం. శఠగోపం పాదాల ఆకృతిలో ఉంటే మన తలను అవి పూర్తిగా తాకడానికి అనుకూలంగా ఉండవనే ఉద్దేశంతో వాటిని వలయాకారంగా తయారుచేసి పైన పాదాలు ఉండేలా తయారుచేశారని చెబుతారు. శఠత్వం అంటే మూర్ఖత్వం అని, గోపం అంటే దాచిపెట్టడం అని కూడా ఉంది. భగవంతుడు మనిషిలో గోప్యంగా ఉన్న మూర్ఖత్వాన్ని, అహంకారాన్ని తొలగించి జ్ఞానిగా చేస్తాడనేది ఆధ్యాత్మికుల భావన. నేను, నాది అనే భ్రమను తొలగించడానికి శఠగోపం పెడతారు. శాస్త్రపరంగా చూస్తే... శఠగోపం పంచలోహాలతో కాని, ఇత్తడి, వెండి, రాగి, బంగారం, కంచులతో విడివిడిగా గాని తయారుచేస్తారు. వీటన్నిటికీ వేడిని సంగ్రహించే శక్తి ఉంది. అందుకే తలమీద పెట్టగానే తలలోని వేడిని ఇది సులువుగా లాగేస్తుంది.
మంచిమాట
కర్మ నడిచే విధానం చాలా కఠినమైనది. నేనేమీ చేయకుండా ఉన్నా, నన్నే సర్వానికి కారణభూతమని, అన్నింటికీ నేనే మూలమని చెబుతూ వాటన్నింటి ఫలాలూ నా నెత్తిన మోపుతుంటారు. అయితే అవన్నీ వాళ్ల కర్మకొద్దీ, అదృష్టం కొద్దీ లభిస్తుంటాయి. అవన్నీ అలా అనుభవించినా నేనే చేశానంటారు. చేసేవాణ్ణి నేను కాదు. నేను సాక్షీభూతుణ్ణి మాత్రమే. చేసేది కర్త, చేయించేవాడు పరమాత్మ. ఆ పరమాత్ముడే అన్నింటిలో నిండి వున్నాడు.
- షిర్డిసాయిబాబా