శాంతి లేదు..కాంతి లేదు
అట్లూరు: మండల పరిధిలోని ముత్తుకూరు పంచాయతీలోని శాంతినగర్ కాలనీని సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. అక్కడ సుమారు 40 కుటుంబాల వారు నివశిస్తున్నారు. అంతా ఎస్సీ వర్గానికి చెందినవారు. వీరంతా ఒంటిమిట్ట మండలం పొన్నాపల్లికి చెందిన వారు. పొన్నాపల్లి సోమశిల ప్రాజెక్టుకింద ముంపునకు గురికావడంతో గత 30 సంవత్సరాల క్రితం ముత్తుకూరు పంచాయతీలోని పునరావాసం ఏర్పరచుకుని కాలనీకి శాంతినగర్ అని పేరు పెట్టుకున్నా వారి బతుకుల్లో శాంతి లేదు.. కాంతి లేదు. నాటి నుంచి నేటి వరకూ కాలనీ ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. కాలనీలో పూరి గుడిసెలు తప్ప పక్కా ఇళ్లు కనిపించవు. ఒక్కరికి కూడా పక్కా ఇళ్లు మంజూరు చేయలేదు. వర్షం కురిస్తే పూరి గుడిసెల్లో ఉండలేని పరిస్థితి. ఇళ్లపైన పట్టలు కప్పుకొని జీవనం గడుపుతున్నారు. అక్కడ మట్టిరోడ్లు తప్ప సిమెంటురోడ్లు కనిపించవు. కాలనీ చుట్టూ కంపచెట్లు అలుముకోవడంతో పాటు వీధిలైట్లు లేక రాత్రివేళ విషపురుగులు సంచరిస్తున్నాయి. కాలనీలో బడిలేదు.. గుడిలేదు ఇది కాలనీ దుస్థితి. తాగునీటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.