సిద్ధూకు తలంటేసిన హైకోర్టు!
న్యూఢిల్లీ: నిబంధనలు ఎందుకు పాటించరు, చట్టసభ సభ్యులే నిబంధనలు పాటించకుంటే ఎలా అని పంజాబ్ సాంస్కృతిక శాఖ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూను పంజాబ్-హర్యానా హైకోర్టు ప్రశ్నించింది. మంత్రిగా ఉన్న సిద్ధూ టీవీ కామెడీ షోలో పాల్గొనడం చట్ట ఉల్లంఘన కిందకు వస్తుందంటూ దాఖలైన పిటిషన్ పై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కోర్టు పలు ప్రశ్నలు సంధించింది.
'ప్రతిదీ చట్టం చెప్పదు. ఔచిత్యం, నైతికత మాట ఏంటి? మంత్రిగా సర్వీసు నిబంధనలు పాటించకుండా మీ కింద పనిచేసే వారికి రూల్స్ పాటించాలని ఎలా చెబుతారు? స్టార్ ఎంపీలకు వర్తించే నిబంధనలను ఎందుకు ఆయన పాటించరు?' అని న్యాయస్థానం ప్రశ్నలు కురిపించింది. చట్టసభ సభ్యులు, ప్రభుత్వ అధికారులు లాభదాయక పదవులు, ప్రైవేటు వ్యాపారాలు చేయరాదని, కోడ్ ఆఫ్ కండక్ట్, 1952 చట్టం చెబుతోందని గుర్తు చేసింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను మే 11కు హైకోర్టు వాయిదా వేసింది.