నాన్నపై కవిత్వానికి రామకృష్ణకు పురస్కారం
రాజమహేంద్రవరం రూరల్: ప్రముఖ కవి, చిత్రకారుడు ఆత్మకూరు రామకృష్ణను ‘గూటం తాతారావు విశిష్ట సాహిత్య పురస్కారం–2016’కు ఎంపిక చేసినట్టు పురస్కార కమిటీ న్యాయనిర్ణేతలు డాక్టర్ చిలుకోటి కూర్మయ్య, ఎస్ఆర్ పృథ్వి, గిడ్డి సుబ్బారావు, ఫణినాగేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆత్మకూరు రామకృష్ణ నాన్నపై రాసిన దీర్ఘకవిత ‘అవ్యక్తం’ కవితా సంపుటి ఎంపికయ్యిందన్నారు. రెండేళ్లుగా నాన్న వస్తువుగా కవిత్వం రాసిన వారికి కీ.శే. గూటం తాతారావు కళావేదిక పురస్కారాలు ప్రదానం చేస్తున్న విషయం తెలిసిందే. ఆత్మకూరు రామకృష్ణ ¯ð ల్లూరు జిల్లా ఇందుకూరుపేటకు చెందిన వారు. చిత్రకారుడుగా సుప్రసిద్ధుడు. ఆయన కేంద్రీయ విద్యాలయం, విజయవాడ–2లో చిత్రకళా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఇంతవరకు నాలుగు కవితా సంపుటులను వెలువరించారు.
సూర్యనారాయణకు గిడుగు భాషా సేవా సత్కారం
తెలుగు భాషాభివృద్ధికి కృషిచేస్తున్న రాజమహేంద్రవరానికి చెందిన కవి, తెలుగుభాషోపాధ్యాయుడు ముంగండి సూర్యనారాయణకు గిడుగు రామ్మూర్తి పంతులు భాషా సేవా సత్కారం చేయనున్నట్టు వారు వెల్లడించారు. సెప్టెంబర్ ఒకటవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు రాజమహేంద్రవరం ఆనంరోటరీ హాల్లో జరిగే గూటం తాతారావు జయంత్యుత్సవంలో వీటిని ప్రదానం చేస్తామని డాక్టర్ గూటం స్వామి, ఫణినాగేశ్వరరావు తెలిపారు.