కాలుష్యం కోరల్లో పుష్కర ఘాట్లు
గోదారి తీరం విషతుల్యం
* ఎక్కడ చూసినా అపరిశుభ్ర వాతావరణం.. పిండ ప్రదానాలు, పూజా సామగ్రి అంతా నదిలోకే..
భద్రాచలం నుంచి సాక్షి బృందం: ఏడు రోజులుగా లక్షల సంఖ్యలో స్నానాలు, పిండ ప్రదానాలు, కుంకుమ పూజలతో భద్రాచలం వద్ద గోదావరి తీరం ప్రమాదకరంగా మారుతోంది. ఘాట్ల సమీపంలో నీరంతా కాలుష్యపు కోరల్లో చిక్కుకుంటోంది. పిండ ప్రదానాల సామగ్రిని నదిలో పడేస్తుండడం, వెంట తెచ్చుకున్న ఆహార పదార్థాలూ అక్కడే వేస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొం ది.
లక్షలాది మంది భక్తులకు తోడు పుష్కర విధుల కోసం వచ్చిన వేలాది మంది సిబ్బం దికి సరిపడ మరుగుదొడ్లు ఏర్పాటు చేయలేదు. ఫలితంగా బహిరంగ ప్రదేశాల్లోనే మల, మూత్ర విసర్జన చేస్తున్నారు. దీంతో తీర ప్రాంతం దుర్గంధం వెదజల్లుతోంది.
కంపుకొడుతున్న ఘాట్లు..
అపరిశుభ్రత వాతావరణంతో ఘాట్లు కంపుకొడుతుండటంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అడపాదడపా వర్షం పడుతోంది. ఆ సమయంలో దుర్వాసన మరింతగా పెరుగుతోంది. ఘాట్ల వద్ద ప్రత్యేకంగా ట్రాక్టర్లను ఏర్పాటు చేసి చెత్తను తరలిస్తున్నా.. పరిస్థితిలో మార్పు రావడం లేదు. ఇప్పటిదాకా సుమారు 20 లక్షల మందికిపైగా భద్రాచలంలోని పుష్కర ఘాట్లలో స్నానమాచరించారు.
స్నానాల సమయంలో భక్తులు షాంపూలు, సబ్బులు వాడుతున్నారు. దీపాలు వదులుదున్నారు. దీంతో ఆ ప్రాంతంలో స్నానం చేసే వారికి దురదలు వస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. పిండ ప్రదానం, పూజా సామగ్రి నదిలో వేయొద్దని సూచిస్తున్నారు.
ప్రబలుతున్న అతిసారం..
తీరంలో అపరిశుభ్రత నెలకొనడంతో అతిసారం లక్షణాలు పెరిగాయి. వాంతులు, విరేచనాలతో ఇప్పటికే జనం ఆసుపత్రుల బాటపడుతున్నారు. ఇక్కడ విధులు నిర్వహించేందుకు వచ్చిన సిబ్బందితోపాటు స్థానికులు అతిసారంతో బాధపడుతున్నారు. ఏడు రోజుల వ్యవధిలో అతిసారంతో 381 మంది చికిత్సలు చేయించుకున్నట్టు వైద్య ఆరోగ్యశాఖాధికారులు చె బుతున్నారు. అనధికారికంగా ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఘాట్ల వద్దే స్నానం చేయండి
అధికారులు సిద్ధం చేసిన ఘాట్ల వద్ద మాత్రమే పుష్కర స్నానాలు ఆచరించాలని ప్రభుత్వం సూ చించింది. రద్దీ ఉందన్న ఉద్దేశంతో కొన్నిచోట్ల ఘాట్లు లేని ప్రాంతాల్లో కూడా భక్తులు స్నానాలు చేస్తున్నారని, ఇది ప్రాణాలకు ప్రమాదకరంగా మారుతుందని ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి పేర్కొన్నారు.
ఉపవాస స్నానాలొద్దు: స్వామి పరిపూర్ణానంద
హైదరాబాద్, సాక్షి: పుష్కరస్నానాలు ఆచరించడానికి వెళుతున్నవారిలో ఎవరికైనా బీపీ, షుగర్ తదితర ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే వారు ఉపవాసాలు, మందులు తీసుకోకుండా వెళ్లటం మంచిది కాదని స్వామి పరిపూర్ణానంద తెలిపారు. అవసరమైన ఆహారం, మందులు తీసుకుని పుష్కర స్నానాలు చేయవచ్చునన్నారు. దీంతో పాటు స్నానాలు ఆచరిస్తున్న భక్తులు మట్టి, పసుపు కుంకుమలు, గాజులు, చీరల వం టి వస్తువుల్ని గోదావరిలో వేస్తున్నారని, అది సరి కాదని చెప్పారు.