న్యాయశాఖలో ఉద్యోగాలకు రాత పరీక్షలు
చిత్తూరు(అర్బన్), న్యూస్‌లైన్: జిల్లా న్యాయశాఖలో ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు ఆదివారం రాత పరీక్షలు నిర్వహించారు. న్యాయశాఖలో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంటు, ఫీల్డు అసిస్టెంటు, ఎగ్జామినర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే దరఖాస్తులను సక్రమంగా పూరించిన 3,200 మందికి మాత్రమే అధికారులు హాల్‌టికెట్లు పంపిణీ చేశారు.
జిల్లా నలుమూలల నుంచి నిరుద్యోగులు ఆదివారం చిత్తూరుకు చేరుకుని పరీక్షలు రాశారు. చిత్తూరులోని ఎన్పీ.సావిత్రమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో నిర్వహించిన పరీక్షలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవిబాబు పర్యవేక్షించారు. న్యాయమూర్తులు, న్యాయశాఖ ఉద్యోగులు పరీక్షల విధులకు హాజరయ్యారు. కాగా పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు పెద్ద సంఖ్యలో బందోబస్తు నిర్వహించారు.