మురిగిన కోడిగుడ్లే పౌష్టికాహారం
మాతాశిశు మరణాలను తగ్గించేందుకు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారంలో నాణ్యత లోపిస్తోంది. ఐసీడీఎస్ అధికారులు పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టర్లు నాసిరకం సరుకులను పంపిణీ చేస్తున్నారు. పెద్దసైజు కోడిగుడ్ల స్థానంలో చిన్నసైజువి, మురిగిపోయినవి సరఫరా చేస్తున్నారు. ఈ గుడ్లను తిన్న చిన్నారులు, గర్భిణులు, బాలింతలు అనారోగ్యం బారిన పడుతున్నారు.
వెంకటగిరిరూరల్: ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందజేసే పౌష్టికాహారం నాణ్యంపై విమర్శలు వినిపిస్తున్నాయి. మండలంలోని 111 అంగన్వాడీ కేంద్రాలు, 3 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ అంగన్వాడీ కేంద్రాల పరిధిలో వందలాది మంది బాలింతలు, గర్భిణులు, చిన్నారులు ఉన్నారు. వీరికి పౌష్టికాహారం కింద ప్రతి నెల డజనుకుపైగా కోడిగుడ్లను అందజేస్తోంది. అయితే టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు మురిగిన, సైజు లేని కోడిగుడ్లను అందజేస్తున్నారు. ఈ గుడ్లను తిన్న చిన్నారులు, గర్భిణులు రోగాల బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నారు. కొన్ని కేంద్రాల్లో సుమారు 7 నెలల నుంచి తరచూ మురిగిన కోడిగుడ్లను సరఫరా చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గర్భిణులు, బాలింతలు ఆరోపిస్తున్నారు.
మురిగిన గుడ్లను సరఫరా చేస్తున్నారు– రాజేశ్వరి, వెంకటగిరి.
అంగన్వాడీ కేంద్రంలో అందజేసే గుడ్లు మురిగిపోయి ఉంటున్నాయి. గుడ్లను ఉడకబెడితే దుర్గంధం వెదజల్లుతున్నాయి. పౌష్టికాహారం మాట దేవుడెరుగు ప్రభుత్వం అందజేసే గుడ్లను తింటే ఆస్పత్రి పాలవ్వాల్సిందే.
అధికారులు పట్టించుకోవడం లేదు– జి మల్లెమ్మ, బంగారుపేట.
అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చే కోడి గుడ్లు చిన్నపరిమాణంలో, మురిపోయి ఉంటున్నాయి. మురిగిపోయిన గుడ్లను తిని చిన్నారులు అస్వస్థతకు గురవుతున్నారు. అదికారులు పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.