‘రోబో’పై కూడా పన్ను వేయాలి
మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ వ్యాఖ్య
వాషింగ్టన్: మానవుల ఉద్యోగాలను తన్నుకుపోతున్న రోబోలపై (ఆటోమేషన్)నా పన్నులు ఉండాల్సిందేనని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ అన్నారు. ‘‘ఆటోమేషన్‌కు కచ్చితంగా పన్నులు ఉండాల్సిందే. ప్రస్తుతం మానవ ఉద్యోగి ఫ్యాక్టరీలో 50,000 డాలర్ల విలువైన పనిచేస్తే ఆ ఆదాయంపై ఆదాయపన్ను, సామాజిక భద్రతా పన్ను వంటివి ఉన్నాయి. ఒకవేళ ఇదే పనిని చేసేందుకు ఓ రోబో వస్తే దానిపైనా ఇదే స్థాయిలో పన్ను విధించాలని నేను అంటాను’’ అని ప్రపంచ కుబేరుడైన బిల్‌గేట్స్ ‘క్వార్ట్జ్ వెబ్సైట్’కు తెలిపారు.
రోబోలను వినియోగిస్తున్న కంపెనీలపై ప్రభుత్వాలు పన్నులు విధించాలని ఆయన సూచించారు. దానివల్ల ఆటోమేషన్‌ను తాత్కాలికంగానైనా నిదానించేలా చేయవచ్చని, అలాగే, ఇతర ఉపాధి అవకాశాలపై నిధుల వినియోగానికి సైతం అవకాశం ఉంటుందన్నారు. మానవులు మాత్రమే చూడగలిగే పెద్దవాళ్ల సంక్షేమం లేదా పాఠశాలల్లో చిన్నారులతో కలసి పనిచేసే ఉద్యోగాలకు కావాల్సిన నిధులను రోబో పన్ను ద్వారా రాబట్టుకోవచ్చని సూచించారు. ఈ పన్ను పట్ల రోబో కంపెనీలు ఆగ్రహిస్తాయని తాను అనుకోవడం లేదన్నారు.
అయితే, గేట్స్ సూచన పూర్తిగా ఆమోదయోగ్యం కాకపోవచ్చని క్వార్ట్జ్ వెబ్సైట్ పేర్కొంది. రోబోల వల్ల ఉపాధి కోల్పోయేవారికి శిక్షణ ఇచ్చేందుకు వీలుగా నిధుల కోసం రోబో యజమానులపై పన్నుల విధింపు ప్రతిపాదన యూరోపియన్ యూనియన్ చట్టసభ సభ్యుల ముందుగా రాగా, వారు దాన్ని తిరస్కరించిన విషయాన్ని ఆ పోర్టల్ పేర్కొంది.