‘విలీన’ సమస్యలపై ప్రత్యేక దృష్టి
భద్రాచలం :ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన మండలాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించామని తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు అన్నారు. బుధవారం నెల్లిపాక, కూనవరం, చింతూరు మండలాల్లో రంపచోడవరం ఆర్డీఓ శంకర వరప్రసాద్‌తో కలిసి పర్యటించారు. భద్రాచలం సమీపంలోని ఎటపాకను విలీన మండలాలకు డివిజన్ కేంద్రంగా ప్రకటించినందున ఇక్కడున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ముందుగా ఎటపాకలో ఏర్పాటు చేసిన నెల్లిపాక తహశీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలను పరిశీలించారు. ఎంత మంది సిబ్బంది అందుబాటులో ఉన్నారు, ఇంకా ఎంత మంది అవసరమని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అక్కడున్న వీఆర్ఓల సమస్యలు ఏమిటన అడగగా, తాము తెలంగాణ ప్రాంత వాసులమని, ఆ రాష్ట్రానికే బదిలీ చేయాలని కోరారు. దీంతో జేసీ, ఆర్డీఓ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
విభజన చట్టం ప్రకారం ఉన్నది ఉన్నట్టుగా ఏపీకి బదలాయించారని, ఇక్కడ కార్యాలయాలు, భవనాలు అన్నీ ఏపీకే చెందుతాయన్నారు. ఉద్యోగులు కూడా ఎక్కడి వార క్కడే పనిచేయాల్సి ఉంటుందని, కమల్‌నాథన్ కమిటీ సిఫారసు వచ్చేంత వరకూ ఉద్యోగులంతా ఏపీలోనే పనిచేయాలన్నారు. వారికి జీతాలు కూడా తామే చెల్లిస్తామన్నారు. కార్యాలయంలో సమస్యలు తెలుసుకునే క్రమంలో ఎంపీడీఓ రాధాకృష్ణకుమారితో మాట్లాడుతుండగా.. సిబ్బంది ఎవరూ లేకపోవటంతో పనిచేయటం కష్టంగా ఉందని చెప్పడంతో జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎవరూ లేకపోతే పనిచేయటం మానేస్తారా..? ఇలా అయితే మీరెందుకు’ అని ప్రశ్నించారు. అలా అయితే తనను తెలంగాణకు సరెండర్ చేయాలని కృష్ణకుమారి కోరగా.. చింతూరులో పనిచేసినప్పుడు కూడా ‘మీపై ఆరోపణలు ఉన్నాయి..తెలంగాణకు సరెండర్ కాదు.. సస్పెండ్ చేస్తా’ అని జేసీ హెచ్చరించారు.
ఖాళీలు భర్తీ చేస్తాం..
విలీన మండలాల్లో ప్రభుత్వ శాఖల్లో ఉన్న అన్ని ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని జేసీ అన్నారు. ఎటపాకలో ఇప్పటికే డీఎస్పీ కేడర్ గల అధికారికి పోస్టింగ్ ఇచ్చామని, పాలన గాడిలో పెట్టేందుకు ముందుగా పంచాయతీ కార్యదర్శుల నియామకంపై దృష్టి సారించామని చెప్పారు. ఏ నియామకాల్లో అయినా విలీన మండలాలకే మొదటి ప్రాధాన్యం ఇస్తామన్నారు. నెల్లిపాకతో పాటు అన్ని తహశీల్దా కార్యాలయాల నుంచి ఏపీ ప్రభుత్వం పేరుతోనే సర్టిఫికెట్లు జారీచేస్తామన్నారు.