రైతులను ఆదుకుంటాం
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన పంటలను సర్వే చేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం అందించి రైతులను ఆదుకుంటామని ఇన్చార్జి కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ అన్నారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు జిల్లావ్యాప్తంగా 592 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూనే ప్రజా విజ్ఞప్తులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో జాతీయజెండాను ఎగురవేసి ప్రసంగించారు. ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ కార్యక్రమాల్లో అగ్రభాగాన నిలవడమే కాకుండా తెలంగాణకే కరీంనగర్ జిల్లా తలమానికంగా నిలుస్తోందన్నారు. మరిన్ని విషయాలు ఆయన మాటాల్లోనే..
రెండవ విడత రచ్చబండ కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 1,08,019 తెల్లరేషన్ కార్డులు, 44,017 పింఛన్లు, 31వేల గృహాలు మంజూరు చేశాం. ఈ నెల 11 నుంచి నిర్వహించే మూడవ విడత రచ్చబండ కార్యక్రమంలో లబ్ధిదారులకు వీటిని పంపిణీ చేస్తాం. తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 62,958 కార్డుల మంజూరు కోసం ఆన్లైన్లో నమోదు చేశాం. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే వాటిని అందిస్తాం.
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రజలకు అందించడమే లక్ష్యంగా జిల్లాలో గ్రామ సందర్శన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. ఇప్పటివరకు 12 విడతలుగా 684 గ్రామాలు, 237 వార్డులలో గ్రామ సందర్శన జరిగింది. 1,06,486 వ్యక్తిగత సమస్యల దరఖాస్తులను రాగా, 70,778 దరఖాస్తులను పరిష్కరించాం. రెండు లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లు, రెండు లక్షల కుటుంబాలకు వంద రోజలు పని, ఐదు లక్షల మంది వయోజనులను అక్షరాస్యులను తీర్చిదిద్ది జాతీ య అక్షరాస్యత పరీక్షకు హాజరుపర్చేందుకు కృషి చేస్తాం.
పటిష్టమైన ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణానికి ఓటు బలమైన ఆయుధం. ప్రజాస్వామ్యంలో ఓటరే పరిపాలకుడు. 18 సంవత్సరాలు నిండినవారందరినీ జాబితాలో చేర్పించి నిజమైన, ఖచ్చితమైన ఓటరు జాబితా రూపకల్పనకు ప్రణాళికాబద్దంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వచ్చే సాధారణ ఎన్నికల్లో 95 శాతం ఓటింగ్ జరిగేలా చైతన్యవంతం చేస్తున్నాం.
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తున్నాం. 47 మోడల్ స్కూల్స్‌లో 40 పాఠశాలలను ఈ విద్యాసంవత్సరం ప్రారంభించాం. 1-10 తరగతి వరకు 3,053 పాఠ శాలల్లోని 2,70,306 మంది విద్యార్థులకు మధ్యాహ్నభోజనం అందిస్తున్నాం. ఎస్ఆర్డీడబ్ల్యూపీ కింద జిల్లాలో ప్రభుత్వ భవనాలు కలిగిన 250 అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లకు నీటి సౌకర్యార్థం రూ.18.7 కోట్లు మంజూరు చేసి 200 పనులు పూర్తి చేశాం. 679 పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లకు నీటి సౌకర్యం కల్పించేందుకు రూ.54.8 కోట్లు మంజూరు చేసి 639 పనులు పూర్తి చేశాం.
ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక వసతులు కల్పించి మెరుగైన వైద్య సేవలందిస్తూ ప్రసవాలు పెంచేందుకు కృషి చేస్తున్నాం. ఇప్పటివరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన 12,625 మంది గర్భిణులకు జననీ సురక్ష యోజన పథకం కింద కాన్పు అయిన వెంటనే పారితోషికం కింద రూ.8.6 కోట్లు పంపిణీ చేశాం.
సమగ్ర పారిశుధ్య పథకం కింద ఉపాధిహామీ పథకంలో 2014 మార్చి వరకు జిల్లాను సంపూర్ణ పారిశుధ్య జిల్లాగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో రూ.227.97 కోట్ల అంచనాలతో 2,50,503 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేశాం. ఇప్పటివరకు 56,892 మరుగుదొడ్లు పూర్తి కాగా, రూ.55.95 కోట్ల చెల్లింపులు చేశాం.
ఎలగందల్ ఖిల్లాపై సౌండ్, లైటింగ్ అభివృద్ధి పనులకు రూ.4.62 కోట్లను పర్యాటక శాఖ మంజూరు చేసిం ది. పనులు త్వరలోనే ప్రారంభించనున్నాం. రూ.11.88 కోట్లతో వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరంలో రెస్టారెంట్, గెస్ట్‌హౌస్ పనులు ప్రారంభించాం.
క్రీడలను ప్రోత్సహించేందుకు మండలానికో మినీ స్టేడియం నిర్మాణానికి జిల్లాకు రూ.27.4 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఐఏపీ కింద నక్సల్ ప్రభావిత మారుమూల ప్రాంతాల అభివృద్ధికి గతేడాది రూ.31.12 కోట్లతో 228 పనులు మంజూరు చేసి 120 పనులు పూర్తి చేశాం. ప్రజావాణి సమస్యల పరిష్కారంలో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ప్రజావాణిలో ఇంతవరకు 1,61,626 దరఖాస్తులు నమోదు కాగా 1,54,345 దరఖాస్తులు పరిష్కరించామని వివరించారు.