రహదారి మధ్యలో రాడార్ స్పీడ్ గన్స్
హైదరాబాద్: వాహనాల ఓవర్ స్పీడింగ్‌పై సిటీ ట్రాఫిక్ విభాగం ప్రత్యేక దృష్టి పెట్టింది. దీనికి చెక్ చెప్పడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్పీడ్ లేజర్ కెమెరాలకు తోడు రాడార్ స్పీడ్ డిటెక్టర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటి పనితీరుకు సంబంధించి జర్మనీకి చెందిన ఓ సంస్థ సోమవారం నగర కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డితోపాటు ట్రాఫిక్ చీఫ్ డాక్టర్ వి.రవీందర్‌కు ప్రజెంటేషన్ ఇచ్చింది.
ప్రసుత్తం అందుబాటులో ఉన్న స్పీడ్ లేజర్ గన్స్ పగటిపూట మాత్రమే వినియోగించడానికి అనుకూలం. పైగా వీటితో తనిఖీలు చేయడానికి ప్రత్యేకంగా సిబ్బంది అవసరం. ఈ నేపథ్యంలో ఓవర్ స్పీడింగ్‌పై పగలు రాత్రి తేడా లేకుండా నిర్విరామంగా చర్యలు తీసుకోవడానికి రహదారుల్లో రాడార్ ఉపకరణాలను అమర్చాలని ట్రాఫిక్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. మొత్తం 70 ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనుకున్న అధికారులు తొలి దశలో రేసింగ్స్, ఓవర్‌స్పీడింగ్ ఎక్కువగా జరిగే కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల వీటిని నెలకొల్పనున్నారు.
రాడార్ పరిజ్ఞానంతో పనిచేసే ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో (టీ–సీసీసీ) అనుసంధానించి ఉండే ఈ ఉపకరణాలు పరిమితికి మించిన వేగంతో వెళ్లే వాహనాలకు సంబంధించి సెకనుకు మూడు ఫొటోలు తీస్తాయి. వీటి ఆధారంగా టీ–సీసీసీ అధికారులు ఈ–చలాన్లు జారీ చేస్తారు.