కాంగ్రెస్ పార్టీ... ఈజిప్టు మమ్మీ!
ధ్వజమెత్తిన వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకరరెడ్డి
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సలహాలు ఇచ్చే స్థాయిగానీ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును ఉచ్ఛరించే అర్హత గానీ జాతీయ కాంగ్రెస్‌కు లేదని పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత వైఎస్సార్ లేకపోతే 2004లో యూపీఏ ప్రభుత్వమే ఏర్పడేది కాదన్నారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఈజిప్టు మమ్మీకి ఏ స్థాయి ఉందో.. దేశంలో కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థానం ఉందన్నారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామనాథ్ కోవింద్‌కు వైఎస్సార్సీపీ మద్దతు ఇవ్వటాన్ని ప్రశ్నిస్తూ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి లేఖ రాయటంపై భూమన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి 10 సంవత్సరాలు దేశాన్ని పాలించే అవకాశం ఇచ్చిన మహానేత వైఎస్సార్ తనయుడు అని కూడా చూడకుండా సోనియాను ధిక్కరించాడనే నెపంతో అభియోగాలు మోపి జైలుకు పంపించిన నీచ చరిత్ర కాంగ్రెస్ పార్టీదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి కాంగ్రెస్ పార్టీకి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి మాట్లాడే స్థాయి ఎక్కడదని సూటిగా ప్రశ్నించారు.
ఎన్డీయే అభ్యర్థిని జగన్ బలపరిచారు: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వాలంటూ జగన్‌కు రఘువీరారెడ్డి లేఖ రాయడం రాయడం విడ్డూరంగా ఉందని భూమన చెప్పారు.రాష్ట్రపతి ఎన్నికపై బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా జగన్ మద్దతు కోరారని తెలిపారు. రాష్ట్రపతి లాంటి సమున్నత పదవికి, రాజకీయేతర పదవికి గెలిచే వ్యక్తికి మద్దతు ఇవ్వటం పద్ధతని జగన్ చాలా స్పష్టంగా చెప్పారని పేర్కొన్నారు.