జిల్లాలో 2085 పోలింగ్ కేంద్రాలు
475 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్
2562 మంది పీఓలు, 10వేల మంది పోలింగ్ సిబ్బంది
కలెక్టర్ కాంతిలాల్ దండే
విజయనగరం కంటోన్మెంట్, న్యూస్‌లైన్: సాధారణ ఎన్నికల నిర్వహణకు జిల్లాలో 2085 పోలింగ్ కేంద్రాలు గుర్తించామని కలెక్టర్ కాంతిలాల్ దండే తెలిపారు. ఈ కేంద్రాల్లో 416 అతి సున్నితమైన, 304 సున్నితమైన, 287 సమస్యాత్మక కేంద్రాలున్నాయన్నారు. నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్లో ఆదివారం రాత్రి జరిగిన జనరల్ అబ్జర్వర్ల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వెబ్ కాస్టింగ్, సూక్ష్మ పరిశీలకులు, వీడియో గ్రఫీ ఆధ్వర్యంలో పోలింగ్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామన్నారు.
475 కేంద్రాలలో వెబ్ కాస్టింగ్, 355 ప్రాంతాలలో సూక్ష్మ పరిశీలకులు, 194 కేంద్రాలలో వీడియోగ్రఫీ నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు, రాజకీయ పార్టీ ప్రతినిధులు సమక్షంలో సూక్ష్మ పరిశీలకులు కేటాయింపును ర్యాండమైజేషన్ ద్వారా నిర్ణయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2562 మంది ప్రిసైడింగ్ అధికారులు, మరో 2562 మంది సహాయ ప్రిసైడింగ్ అధికారులు, 10 వేల మంది ఇతర పోలింగ్ అధికారులను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించినట్లు తెలిపారు.
రెండవ ర్యాండమైజేషన్ ద్వారా నియోజక వర్గాల కేటాయింపు జరిగిందని , మూడవ ర్యాండ మైజేషన్ ద్వారా పోలింగ్ కేంద్రాలు కేటాయిస్తామని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు విజయ్ బహుదూర్ సింగ్, దినేష్ కుమార్ సింగ్, అజయ్ శంకర్ పాండే, స్వపన్ కుమార్ పాల్, నరేందర్ శంకర్ పాండే, సంయుక్త కలెక్టర్ బి.రామారావు, అదనపు సంయుక్త కలెక్టర్ యు.సి.జి. నాగేశ్వరరావు, జిల్లా రెవెన్యూ అదికారి బి.హెచ్.ఎస్.వెంకటరావు, ముఖ్య ప్రణాళికాధికారి మోహనరావు, ఇన్మర్మేటిక్ అధికారి నరేంద్ర, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.