రైళ్లలో నేరాలు అరికట్టేందుకు చర్యలు
రాజమండ్రి సిటీ, న్యూస్‌లైన్ : రాజమండ్రి డివిజన్ పరిధిలోని ఉభయగోదావరి, విశాఖ, విజయవాడ బోర్డర్ల వరకూ రైళ్లలో నేరాలు జరగకుండా ఉండేందుకు రాత్రి పూట నిఘాను పటిష్టం చేశామని రాజమండ్రి జీఆర్పీ డీఎస్పీ వరప్రసాదరావు తెలిపారు. ఇతర ప్రాంతాల రైళ్లలో జరుగుతున్న దోపిడీలు, దొంగతనాలపై ఆయన స్పందించారు. విజయవాడ జిల్లా రైల్వే ఎస్పీ శ్యామ్‌ప్రసాద్ ఆదేశాల మేరకు రాజమండ్రి నుంచి అనకాపల్లి, కృష్టాజిల్లాలోని గుడివాడ వరకూ గల స్టేషన్లలో రైళ్ల రాకపోకల సమయాల్లో రాత్రి పూట పోలీసు గస్తీ పెంచామన్నారు.
ప్రతి రైలులో ఆయుధాలు కలిగిన సిబ్బందిని వెంట పంపిస్తున్నామన్నారు. కాకినాడ, భీమవరం ఇన్స్పెక్టర్లు సీహెచ్‌రాజు, ఎస్కే బాజీలాల్ సహకారంతో ట్రాక్ వెంబడి రోడ్లను పర్యవేక్షిస్తూ రాత్రి సమయాల్లో గస్తీ ఏర్పాటు చేశామన్నారు. నేరానికి ఏవిధమైన ఆస్కారం లేకుండా సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్స్ తో రాత్రి సమయాల్లో పటిష్టమైన పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. మైక్రోఫోన్ల సహా యంతో ప్రయాణికులను అనుక్షణం అప్రమత్తం చేస్తున్నామన్నారు. ప్రయాణికులు రాత్రి సమయాల్లో బంగారు నగలు ధరించి గేటు వద్ద, బెర్త్‌ల్లో నిద్రించే సమయంలో అవసరమైన జాగ్రత్తలు పాటించాలన్నారు. నేరాల అదుపునకు పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచామన్నారు.