Rajamahendravaram Airport
-
మధురపూడికి మహర్దశ.. రూ.347 కోట్లతో ఎయిర్పోర్ట్ విస్తరణ
సాక్షి, రాజమహేంద్రవరం: ఉభయగోదావరి జిల్లాల వాసులకు గగనతల ప్రయాణ సేవలందిస్తున్న (రాజమహేంద్రవరం) మధురపూడి విమానాశ్రయానికి మహర్దశ పట్టనుంది. ఇందుకోసం భారత పౌర విమానయాన శాఖ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నది. ఈ మేరకు రూ.347.15 కోట్లు విడుదల చేస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువరించింది. బిల్డింగ్ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభించేందుకు ఆ శాఖ సన్నాహాలు చేస్తోంది. పనులకు రాజమండ్రి ఎయిర్ పోర్ట్ ఇంజినీరింగ్ విభాగం నిర్వహించనుందని జాతీయ విమానాశ్రయం అధికారి అరుణ్‌కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఇలా.. మధురపూడి విమానాశ్రయంలో ప్రస్తుతం 3,165 మీటర్ల పొడవున్న రన్‌వే, 11 పార్కింగ్ బేస్‌తో కూడిన ఏఫ్రాన్, 11 విమాన సర్వీసులు ఏకకాలంలో నిలుపుదలకు అవకాశం కలిగిన వసతి ఉంది. 4,065 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న టెర్మినల్ భవనంలో ఏకకాలంలో 225 మంది ప్రయాణికులు స్టే చేసేందుకు సరిపోతుంది. అంతర్జాతీయ స్థాయికి అవసరమైన సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయి. 90 శాతం ఆక్యుపెన్సీతో విమానాలు నడుస్తున్నాయి. విమానాశ్రయం నుంచి ప్రస్తుతం 12 సర్వీసులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నంకు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రతి రోజూ 1,200 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. టెర్మినల్ భవన సామర్థ్యం పెంపు.. విమాన రాకపోకల సందర్భంగా ప్రయాణికుల తాకిడి పెరిగింది. ప్రతి రోజూ 1,200 మంది రాకపోకలు సాగిస్తుంటే.. ప్రస్తుతం ఉన్న భవనంలో కేవలం 225 మంది మాత్రమే స్టే చేసేందుకు అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం భవన సామర్థ్యం విస్తరించేందుకు నిధులు మంజూరయ్యాయి. రూ.347 కోట్లతో మరో 16,000 చదరపు గజాలకు విస్తరించేందుకు గానూ నూతన భవన నిర్మాణాన్ని చేపట్టనున్నారు. భవన నిర్మాణం పూర్తయితే 1,400 మంది ప్రయాణికులు స్టే చేయవచ్చు. అంతేగాక ఒకేసారి 5 విమానాలు అరైవల్ అయినా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులుండవు. భద్రతలోనూ మేటి ప్రయాణికులు, విమానాశ్రయ భద్రత, రక్షణ విషయంలో మధురపూడి ఏయిర్ పోర్ట్ ప్రత్యేకంగా నిలుస్తుంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దీని నిర్మాణం జరిగింది. యుద్ధ సమయంలో సముద్ర మార్గం ద్వారా రావాణాకు అనువైన ప్రాంతంగా ఖ్యాతి గడించింది. రెండో ప్రపంచ యుద్ధంలో యుద్ద విమానాలను ఇక్కడ ఉంచేవారు. సంతోషంగా ఉంది.. టెర్మినల్ భవన నిర్మాణ అనుమతులు, నిధుల విడుదల కోసం కొన్నేళ్లుగా చేస్తున్న కృషికి ఫలితం దక్కింది. గతేడాది డిసెంబరు 16న జరిగిన బోర్డు మీటింగ్‌లో తీర్మానం చేశాం. కాంపిటేటివ్ అథారిటీ, పరిపాలనా ఆమోదం, వ్యయం మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడటం సంతోషంగా ఉంది. ఇందుకు సంబంధించిన శాంక్షన్ ఆర్డర్స్ సంబంధిత ఉన్నతాధికారులకు అందాయి. –మార్గాని భరత్‌రామ్, ఎంపీ, రాజమహేంద్రవరం పనులు ప్రారంభిస్తాం.. టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణానికి పరిపాలనా అనుమతులు, నిధులు మంజూరయ్యాయి. త్వరలోనే పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం. ప్రయాణికులకు అధునాతన సేవలు అందించేందుకు భవన నిర్మాణం ఎంతగానో దోహదం చేస్తుంది. ప్రస్తుత సేవలను మరింతగా విస్తరించే వెసులుబాటు కలుగుతుంది. – ఎస్.జ్ఞానేశ్వరరావు, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ -
ఆరంభమైన గగనయానం
సాక్షి, మధురపూడి: కరోనా మహమ్మారిని కట్టడి చేసే లక్ష్యంతో విధించిన లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన పౌరవిమాన సేవలు ఎట్టకేలకు పునఃప్రారంభమయ్యాయి. లాక్‌డౌన్‌కు దశలవారీగా సడలింపులు ఇస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం సోమవారం నుంచి దేశీయ విమాన సేవలను పునరుద్ధరించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మధురపూడిలోని రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చెన్నై నుంచి సాయంత్రం 5.10 గంటలకు ఒక విమానం వచ్చింది. ఇండిగో సంస్థ నడిపిన ఈ విమానంలో 78 మంది ప్రయాణించేందుకు అనుమతి ఉండగా 54 మంది వచ్చారు. ఈ విమానం తిరిగి 5.45 గంటలకు 48 మంది ప్రయాణికులతో ఇక్కడి నుంచి చెన్నైకి పయనమైంది. పౌరవిమాన సేవలు తిరిగి ప్రారంభం కావడంతో ఎయిర్‌పోర్టులో సందడి నెలకొంది. అయితే అనుకున్నన్ని విమాన సరీ్వసులు రాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. చదవండి: ఏపీలో ప్రారంభమైన దేశీయ విమాన సర్వీసులు ప్రయాణికుల బ్యాగేజిని శానిటైజ్ చేస్తున్న సిబ్బంది ‘స్పందన’లో నమోదు చేసుకుంటేనే అనుమతి ►విమానంలో ప్రయాణించాలనకునేవారు రాష్ట్ర ప్రభుత్వ ‘స్పందన’ వెబ్సైట్లో తప్పనిసరిగా పేర్లు నమోదు చేసుకోవాలి. వారికి మాత్రమే విమానయాన సంస్థలు టిక్కెట్లు విక్రయించాల్సి ఉంటుంది. ►రాష్ట్రానికి చేరిన ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. అనుమానిత లక్షణాలుంటే వారం రోజుల పాటు ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్లో ఉంచుతారు. ►వారం తర్వాత మరోసారి పరీక్షలు నిర్వహించి, నెగెటివ్ వచ్చిన వారికి మరో వారం రోజులు హోమ్ క్వారంటైన్లో ఉంచుతారు. ►తక్కువ కరోనా కేసులున్న ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు.. వైద్య పరీక్షలకు స్వాబ్ ఇచ్చిన తర్వాత 14 రోజులు హోమ్ క్వారంటైన్లో ఉండాలి. హైదరాబాద్ సర్వీసు రద్దు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం రావల్సిన విమాన సర్వీసు రద్దయ్యింది. మామూలుగా ఈ సర్వీసు ప్రతి రోజూ రాత్రి 8.55 గంటలకు వచ్చి, 9.25 గంటలకు తిరుగు పయనమవుతుంది. కట్టుదిట్టంగా నిబంధనల అమలు ►విమాన సేవలు పునఃప్రారంభమైన నేపథ్యంలో కరోనా వ్యాప్తి చెందకుండా నిర్దేశించిన నిబంధనలను పక్కాగా అమలు చేశారు. ►ప్రయాణికులు భౌతికదూరం పాటించేలా ఏర్పాటు చేశారు. మాసు్కలు తప్పనిసరిగా ధరించేలా చూశారు. ►సింగిల్ బ్యాగేజీని మాత్రమే వెంట అనుమతించారు. ►అన్ని తనిఖీలు, పరిశీలనల అనంతరం ప్రయాణికులను విమానం వద్దకు పంపారు. ►ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకున్నారో లేదో పరిశీలించారు. హైదరాబాద్, చెన్నైకి సేవలు రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్, చెన్నై నగరాలకు విమాన సేవలున్నాయి. అయితే సోమవారం హైదరాబాద్ సర్వీసు రద్దయ్యింది. దేశంలోని ముంబయ్, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ తదితర ఆరు మెట్రో నగరాల్లోని విమానాశ్రయాల నుంచి మిగిలిన నగరాలకు విమానాలు నడుస్తున్నాయి. ఆ నగరాల నుంచే మూడో వంతు సర్వీసులు నడుస్తాయి. విమానాలు అక్కడి నుంచి వస్తేనే తప్ప, వాటి రాకపోకల వివరాలను కచ్చితంగా తెలియజేసే పరిస్థితి లేదు. – మనోజ్‌కుమార్ నాయక్, ఎయిర్‌పోర్టు డైరెక్టర్, రాజమహేంద్రవరం -
చిరకాల కల... నెరవేరుతున్న వేళ
అంగట్లో అన్నీ ఉన్నాయి... అల్లుడి నోట్లో శని ఉందన్నట్టుగా తయారైంది జిల్లా పరిస్థితి. కోనసీమలో కొబ్బరి, జిల్లా అంతటా ఆక్వా, కడియంలో పువ్వుల ఉత్పత్తి దండిగా ఉన్నా ఇతర దేశాలకు ఎగుమతి చేసే సదుపాయం లేకపోవడంతో ఇన్నాళ్లూ వేరే మార్గాల్లో ప్రయత్నించి నష్టాలపాలవుతూ వస్తున్నారు. ఇక్కడి రైతులు, వ్యాపారులు తాజాగా ఎయిర్ కార్గో కల నెరవేరనుండడంతో వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. సాక్షి, రాజమహేంద్రవరం : జిల్లావాసులు ఏళ్ల తరబడి వేచిచూస్తున్న చిరకాల స్వప్నం నెరవేరనుంది. సహజ వనరులకు పుట్టినిల్లయినా సరే వాటిని ఒడిసి పట్టి అంతర్జాతీయ మార్కెట్లో ఇంతకాలం జెండా ఎగురవేయలేక మన వ్యాపారులు నష్టాలబాట పట్టేవారు. సరైన రవాణా వ్యవస్థ లేకపోవడం ఇందుకు ప్రతిబంధకమయింది. ఈ బంధనాలను తెంచివేయడానికి కొన్నేళ్లుగా రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు నుంచి కార్గో రవాణాకు అనుమతి తీసుకురావాలని తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు త్వరలో కార్గో రవాణా అందుబాటులోకి వచ్చే సమయం ఆసన్నమైంది. ఇందుకు కేంద్ర విమానయాన సంస్థ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో గురువారం సంబంధిత శాఖల నుంచి ముగ్గురు సభ్యుల ప్రతినిధి బృందం ఎయిర్ పోర్టు పరిసరాల పరిశీలనకు వస్తోంది. ఈ మేరకు ‘బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్’ నుంచి ఎయిర్‌పోర్టు డైరెక్టర్ రాజ్ కిశోర్‌కు వర్తమానం అందింది. గత చరిత్ర ఇలా.. బ్రిటిష్ పాలనలో ప్రపంచ యుద్ధాలు జరిగినప్పుడు రక్షణ శాఖ విమానాలు ఇంధనం నింపుకొనేందుకు వీలుగా 1937లో మధురపూడిలో ఎయిర్‌పోర్టు ఏర్పాటైంది. అనంతరం లోక్‌సభ స్పీకర్‌గా పని చేసిన జీఎంసీ బాలయోగి తన పలుకుబడిని ఉపయోగించి ఎయిర్‌పోర్టు విస్తరణకు కృషిచేశారు. ఆ క్రమంలోనే 2004 నుంచి వాయుదూత్ విమాన సర్వీసులు నడిపారు. తరువాత 2012లో ఎయిర్‌పోర్టు టెర్మినల్ విస్తరణ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటైంది. 2015 నుంచి కేంద్ర విమానయాన శాఖ రన్‌వే పెంచాలని, విస్తరణకు ప్రతిపాదనలు ఇవ్వాలని ఆదేశించింది. ఇందుకోసం రూ.180 కోట్లు ఖర్చు చేశారు. విస్తరణకు ముందు 1750 మీటర్లుండే ఈ ఎయిర్‌పోర్టు రన్‌వే ప్రస్తుతం 3140 మీటర్లకు విస్తరించింది. కొత్త యాప్రాన్ నిర్మాణం, ఐసొలేషన్ బే ఏర్పాటు తదితర చర్యలతో ఇప్పుడు ఇక్కడి నుంచి 16 విమాన సర్వీసులు రాకపోకలు సాగిస్తున్నాయి. 2012కు ముందు కేవలం రెండు విమానాలు మాత్రమే నిర్వహించే పరిస్థితి. ప్రస్తుతం రోజూ ఈ ఎయిర్ పోర్టు నుంచి 1150 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఎగుమతి, దిగుమతులకు ఊరట జిల్లా నుంచి విదేశాలకు లక్షల విలువైన సహజ వనరులు ఎగుమతి అవుతున్నాయి. విదేశీమారక ద్రవ్యాన్ని ఆర్జించే ఆక్వారంగం నుంచి పలు దేశాలకు ఆక్వా ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేయాలంటే విశాఖపట్నం ఎయిర్ పోర్టు లేదా, కాకినాడ పోర్టు ద్వారా మాత్రమే జరుగుతున్నాయి. ఆక్వా ఉత్పత్తులు సకాలంలో చేర్చలేకపోతున్నామనే ఆవేదన జిల్లాలోని ఆక్వా రంగంపై ఆధారపడే వ్యాపారులు, రైతుల్లో చాలా కాలంగా ఉంది. జిల్లా నుంచి రోజుకు సుమారు 350 టన్నుల ఆక్వా ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇందులో 60 శాతం ఉత్పత్తులు అమెరికాకు, 25 శాతం ఉత్పత్తులు యూరోపియన్ దేశాలకు, మిగిలిన 15 శాతం ఉత్పత్తులు చైనా, గల్ఫ్ దేశాలకు వెళుతున్నాయి. అలాగే కేరళ తరువాత కేరళగా పేరొందిన కోనసీమ నుంచి ఏటా సుమారుగా రూ.1,200 కోట్ల విలువైన కొబ్బరి ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. ఇంతవరకూ ఇవి అంతర్రాష్ట్రంగానే జరుగుతున్నాయి. గుజరాత్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. ఎయిర్ కార్గో వ్యవస్థ వృద్ధి చెందితే జిల్లా నుంచి కూడా కొబ్బరి ఉత్పత్తులు జెట్ స్పీడ్‌తో విదేశాలకు ఎగుమతిచేసే అవకాశం లభిస్తుంది. ఉద్యానానికి ఊతం బెంగళూరు, కోల్‌కతాల నుంచి నిత్యం బస్సుల్లో పలు రకాల డెకరేషన్ పువ్వులు దిగుమతి చేసుకుంటున్నారు. ఒక రోజు రాత్రి ఆ రాష్ట్రంలో సరుకు వేస్తే తరువాత రోజు ఉదయం జిల్లాకు వస్తున్నాయి. అదే ఎయిర్ కార్గో ఉంటే చెన్నై, కోల్‌కతా, బెంగళూరుల నుంచి గంటల వ్యవధిలోనే జిల్లాకు దిగుమతి అయ్యేందుకు మార్గం సుగమమవుతుందని నర్సరీ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మల్లెమొగ్గలు లైఫ్ టైమ్ 24 గంటలు దాటితే పాడైపోతాయి. ఎయిర్ కార్గో సాకారమైతే మల్లెలు ఇతర రాష్ట్రాలకు ఒక రోజులోపు వెళ్లేందుకు అవకాశం లభిస్తుంది. కడియం నర్సరీల నుంచి మొక్కలు వెళ్లాలంటే ఓ అవరోధం కనిపిస్తోంది. ఎయిర్‌పోర్టులో ప్లాంట్ క్వారన్‌టైమ్ సెంటర్ ఏర్పాటు కావాలి. ఎయిర్ కార్గో దిగుమతి చేసుకున్నాక ఎయిర్‌పోర్టులో ఉండే ఈ సెంటర్లో మొక్కలు తనిఖీ చేసి వ్యాధులు లేవని నిర్థారించాకనే బయటకు పంపిస్తారు. అటువంటి సెంటర్ ఏర్పాటు చేశాక కాని మొక్కలు ఎగుమతి, దిగుమతికి అవకాశం లేదు. చిన్న సైజులో ఉండే (సీడ్లింక్స్) అలంకరణ మొక్కలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే అవకాశం ఉన్నా ఈ సెంటర్ లేకపోవడంతో ఇబ్బందే. వీరంతా రాజమహేంద్రవరం ఎయిర్ పోర్టు నుంచి కార్గో ఎగుమతికి ఎప్పుడు అవకాశం వస్తుందా అని కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికి రెండు ఎయిర్ కార్గోలు వస్తాయని ఎయిర్ పోర్టు వర్గాలు చెబుతున్నాయి. ఒక్కో కార్గో విమానంలో సరుకులతోపాటు నిత్యం 180 మంది అదనంగా ప్రయాణించడానికి వీలు కలుగుతుంది. -
రాత్రి వేళ.. రయ్..
మధురపూడి (రాజానగరం): విమానయాన ప్రయాణాలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ఎయిర్‌నెట్ వర్క్‌ను విస్తరించిందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మంగళవారం మధురపూడిలోని రాజమహేంద్రవరం వి మానాశ్రయంలో ఇండిగో విమానయానసంస్థ çసర్వీసులను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఇండిగో సంస్థ దేశీ విమానయాన రంగంలో స్థానాన్ని బలపరచుకుందన్నారు. మంగళవారం ఇండిగో రాజమహేంద్రవరం–చెన్నై ద్వారా ఏటీఆర్ ఆపరేషన్స్‌ను ప్రారంభించారు. మొత్తం నాలుగు సర్వీసులు ఉదయం నుంచి రాత్రివరకు నడుస్తాయన్నారు. ఉదయం 8.20 గంటలకు మొదటిసర్వీసు, మధ్యాహ్నం 12.30 గంటలకు రెండో సర్వీసు, మధ్యాహ్నం 2.35 గంటలకు మూడో సర్వీసు ఉంటాయన్నారు. నైట్ ల్యాండింగ్స్ మొదలు ఇండిగో విమాన సర్వీసులతో నైట్ ల్యాండింగ్స్ ప్రారంభమవుతాయని ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ఎమ్.రాజ్‌కిషోర్ అన్నారు. రాత్రి 8.40గంటలకు చివరి సర్వీసు చేరుతుంది. దీంతో రాత్రి సర్వీసుల నిర్వహణకు ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేసినట్టు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఇండిగోసంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ కస్టమర్ సర్వీసెస్ ఎం.సంజీవ్ రామదాస్ జెండా ఊపి విమాన సర్వీసులను ప్రారంభించారు. కార్యక్రమంలో రాజమహేంద్రవరంఎంపీ మాగంటి మురళీ మోహన్, ఎమ్మెల్యేలు ఆకుల రామకృష్ణ, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ చైర్మన్ పంతం రజనీశేష సాయి, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, రాజమహేంద్రవరం సబ్ కలె క్టర్ సాయికాంత్ వర్మ, అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టు టెర్మినల్ భవనంలో జ్యోతి ప్రజ్వలన, కేక్‌కటింగ్ జరిగింది. రాజమహేంద్రవరాన్ని కేంద్రం అంగీకరించాలి రాజమహేంద్రవరంగా రాష్ట్ర ప్రభుత్వం నామకరణ చేసింది. ఆ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపినా కేంద్రం అంగీకరించలేదని రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహాన్ ప్రెస్మీట్లో తెలిపారు. ‘‘కేంద్రం అంగీకారం అవసరం. దానికోసం ప్రయత్నిస్తాను. రైల్వేజోన్ సాధనకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే బడ్జెట్ సమావేశాలకు ముందే మా ప్రతిపాదనలు తీసుకోవాలి. కాని కేంద్రం (పార్లమెంటరీకమిటీ) ఎంపీలకు అవకాశం ఇవ్వలేదు’’ అని చెప్పుకొచ్చారు. -
రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి త్వరలో కార్గో సేవలు
సాక్షి, రాజమండ్రి: రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి త్వరలో కార్గో సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ దిశగా జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా ఢిల్లీకి చెందిన కార్గో సర్వీసుల నిర్వహణాధికారి, కార్గో సంస్థల ప్రతినిధులతో విమానాశ్రయం డెరైక్టర్ ఎం.రాజ్‌కిశోర్ సోమవారం సమావేశమయ్యారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పరిస్థితులు, కార్గో సంస్థల వివరాలు, సేవల విషయమై చర్చించారు. ఈ సందర్భంగా రాజ్‌కిశోర్ మాట్లాడుతూ...జంబోజెట్, ఇతర భారీ విమానాల రాకపోలకు వీలుగా విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. రాజమహేంద్రవరం నుంచి ఇప్పటికే హైదరాబాద్‌తోపాటు బెంగళూర్, చెన్నైకి కొన్ని సర్వీసులు నడుస్తున్నాయని, త్వరలో తిరుపతి, గోవా, ముంబై తదితర ప్రాంతాలకు విమానాలు నడిపేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.