చిరకాల కల... నెరవేరుతున్న వేళ  | Central Airline Gave Green Signal To rajamahendravaram Airport | Sakshi
Sakshi News home page

చిరకాల కల... నెరవేరుతున్న వేళ 

Published Wed, Aug 21 2019 7:44 AM | Last Updated on Wed, Aug 21 2019 7:44 AM

Central Airline Gave Green Signal To rajamahendravaram Airport - Sakshi

అంగట్లో అన్నీ ఉన్నాయి... అల్లుడి నోట్లో శని ఉందన్నట్టుగా తయారైంది జిల్లా పరిస్థితి. కోనసీమలో కొబ్బరి, జిల్లా అంతటా ఆక్వా, కడియంలో పువ్వుల ఉత్పత్తి దండిగా ఉన్నా ఇతర దేశాలకు ఎగుమతి చేసే సదుపాయం లేకపోవడంతో ఇన్నాళ్లూ వేరే మార్గాల్లో ప్రయత్నించి నష్టాలపాలవుతూ వస్తున్నారు. ఇక్కడి రైతులు, వ్యాపారులు తాజాగా ఎయిర్‌ కార్గో కల నెరవేరనుండడంతో వారిలో ఆశలు చిగురిస్తున్నాయి.

సాక్షి, రాజమహేంద్రవరం : జిల్లావాసులు ఏళ్ల తరబడి వేచిచూస్తున్న చిరకాల స్వప్నం నెరవేరనుంది. సహజ వనరులకు పుట్టినిల్లయినా సరే వాటిని ఒడిసి పట్టి అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంతకాలం జెండా ఎగురవేయలేక మన వ్యాపారులు నష్టాలబాట పట్టేవారు. సరైన రవాణా వ్యవస్థ లేకపోవడం ఇందుకు ప్రతిబంధకమయింది. ఈ బంధనాలను తెంచివేయడానికి కొన్నేళ్లుగా రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు నుంచి కార్గో రవాణాకు అనుమతి తీసుకురావాలని తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు త్వరలో కార్గో రవాణా అందుబాటులోకి వచ్చే సమయం ఆసన్నమైంది. ఇందుకు కేంద్ర విమానయాన సంస్థ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించడంతో గురువారం సంబంధిత శాఖల నుంచి ముగ్గురు సభ్యుల ప్రతినిధి బృందం ఎయిర్‌ పోర్టు పరిసరాల పరిశీలనకు వస్తోంది. ఈ మేరకు ‘బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌’ నుంచి ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ రాజ్‌ కిశోర్‌కు వర్తమానం అందింది.

గత చరిత్ర ఇలా..
బ్రిటిష్‌ పాలనలో ప్రపంచ యుద్ధాలు జరిగినప్పుడు రక్షణ శాఖ విమానాలు ఇంధనం నింపుకొనేందుకు వీలుగా 1937లో మధురపూడిలో ఎయిర్‌పోర్టు ఏర్పాటైంది. అనంతరం లోక్‌సభ స్పీకర్‌గా పని చేసిన జీఎంసీ బాలయోగి తన పలుకుబడిని ఉపయోగించి ఎయిర్‌పోర్టు విస్తరణకు కృషిచేశారు. ఆ క్రమంలోనే 2004 నుంచి వాయుదూత్‌ విమాన సర్వీసులు నడిపారు. తరువాత 2012లో ఎయిర్‌పోర్టు టెర్మినల్‌ విస్తరణ, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ఏటీసీ) సిగ్నలింగ్‌ వ్యవస్థ ఏర్పాటైంది. 2015 నుంచి కేంద్ర విమానయాన శాఖ రన్‌వే పెంచాలని, విస్తరణకు ప్రతిపాదనలు ఇవ్వాలని ఆదేశించింది. ఇందుకోసం రూ.180 కోట్లు ఖర్చు చేశారు. విస్తరణకు ముందు 1750 మీటర్లుండే ఈ ఎయిర్‌పోర్టు రన్‌వే ప్రస్తుతం 3140 మీటర్లకు విస్తరించింది. కొత్త యాప్రాన్‌ నిర్మాణం, ఐసొలేషన్‌ బే ఏర్పాటు తదితర చర్యలతో ఇప్పుడు ఇక్కడి నుంచి 16 విమాన సర్వీసులు రాకపోకలు సాగిస్తున్నాయి. 2012కు ముందు కేవలం రెండు విమానాలు మాత్రమే నిర్వహించే పరిస్థితి. ప్రస్తుతం రోజూ ఈ ఎయిర్‌ పోర్టు నుంచి 1150 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. 
 

ఎగుమతి, దిగుమతులకు ఊరట
జిల్లా నుంచి విదేశాలకు లక్షల విలువైన సహజ వనరులు ఎగుమతి  అవుతున్నాయి. విదేశీమారక ద్రవ్యాన్ని ఆర్జించే ఆక్వారంగం నుంచి పలు దేశాలకు ఆక్వా ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేయాలంటే విశాఖపట్నం ఎయిర్‌ పోర్టు లేదా, కాకినాడ పోర్టు ద్వారా మాత్రమే జరుగుతున్నాయి. ఆక్వా ఉత్పత్తులు సకాలంలో చేర్చలేకపోతున్నామనే ఆవేదన జిల్లాలోని ఆక్వా రంగంపై ఆధారపడే వ్యాపారులు, రైతుల్లో చాలా కాలంగా ఉంది. జిల్లా నుంచి రోజుకు సుమారు 350 టన్నుల ఆక్వా ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇందులో 60 శాతం ఉత్పత్తులు అమెరికాకు, 25 శాతం ఉత్పత్తులు యూరోపియన్‌ దేశాలకు, మిగిలిన 15 శాతం ఉత్పత్తులు చైనా, గల్ఫ్‌ దేశాలకు వెళుతున్నాయి. అలాగే కేరళ తరువాత కేరళగా పేరొందిన కోనసీమ నుంచి ఏటా సుమారుగా రూ.1,200 కోట్ల విలువైన కొబ్బరి ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. ఇంతవరకూ ఇవి అంతర్రాష్ట్రంగానే జరుగుతున్నాయి. గుజరాత్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, బీహార్‌ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. ఎయిర్‌ కార్గో వ్యవస్థ వృద్ధి చెందితే జిల్లా నుంచి కూడా కొబ్బరి ఉత్పత్తులు జెట్‌ స్పీడ్‌తో విదేశాలకు ఎగుమతిచేసే అవకాశం లభిస్తుంది.
ఉద్యానానికి ఊతం

బెంగళూరు, కోల్‌కతాల నుంచి నిత్యం బస్సుల్లో పలు రకాల డెకరేషన్‌ పువ్వులు దిగుమతి చేసుకుంటున్నారు. ఒక రోజు రాత్రి ఆ రాష్ట్రంలో సరుకు వేస్తే తరువాత రోజు ఉదయం జిల్లాకు వస్తున్నాయి. అదే ఎయిర్‌ కార్గో ఉంటే చెన్నై, కోల్‌కతా, బెంగళూరుల నుంచి గంటల వ్యవధిలోనే జిల్లాకు దిగుమతి అయ్యేందుకు మార్గం సుగమమవుతుందని నర్సరీ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మల్లెమొగ్గలు లైఫ్‌ టైమ్‌ 24 గంటలు దాటితే పాడైపోతాయి. ఎయిర్‌ కార్గో సాకారమైతే మల్లెలు ఇతర రాష్ట్రాలకు ఒక రోజులోపు వెళ్లేందుకు అవకాశం లభిస్తుంది. కడియం నర్సరీల నుంచి మొక్కలు వెళ్లాలంటే ఓ అవరోధం కనిపిస్తోంది. ఎయిర్‌పోర్టులో ప్లాంట్‌ క్వారన్‌టైమ్‌ సెంటర్‌ ఏర్పాటు కావాలి.

ఎయిర్‌ కార్గో దిగుమతి చేసుకున్నాక ఎయిర్‌పోర్టులో ఉండే ఈ సెంటర్‌లో మొక్కలు తనిఖీ చేసి వ్యాధులు లేవని నిర్థారించాకనే బయటకు పంపిస్తారు. అటువంటి సెంటర్‌ ఏర్పాటు చేశాక కాని మొక్కలు ఎగుమతి, దిగుమతికి అవకాశం లేదు. చిన్న సైజులో ఉండే (సీడ్‌లింక్స్‌) అలంకరణ మొక్కలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే అవకాశం ఉన్నా ఈ సెంటర్‌ లేకపోవడంతో ఇబ్బందే. వీరంతా రాజమహేంద్రవరం ఎయిర్‌ పోర్టు నుంచి కార్గో ఎగుమతికి ఎప్పుడు అవకాశం వస్తుందా అని కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికి రెండు ఎయిర్‌ కార్గోలు వస్తాయని ఎయిర్‌ పోర్టు వర్గాలు చెబుతున్నాయి. ఒక్కో కార్గో విమానంలో సరుకులతోపాటు నిత్యం 180 మంది అదనంగా ప్రయాణించడానికి వీలు కలుగుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement