చిన్న పార్టీల పెద్ద దెబ్బ
రాజస్తాన్‌లో 99 స్థానాలు గెలుచుకుని మెజారిటీకి దగ్గరగా వచ్చిన కాంగ్రెస్‌ను తిరుగుబాటుదారులు, స్వతంత్రులు బాగా దెబ్బతీశారు. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులూ, చిన్న చిన్న పార్టీలూ కలిపి మొత్తం 199 సీట్లలో 27 సీట్లను గెలుచుకున్నారు. రాజస్తాన్‌లో కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజారిటీ వస్తుందని ఊహించినా.. ఆ స్థాయిలో గెలుపు సాధించలేకపోయింది. ఎన్నికలకి ముందు ఎవరితోనూ పొత్తు పెట్టుకోకపోవడం కొన్ని స్థానాల్లో విజయావకాశాలను దెబ్బతీసిందనేది పార్టీలో సీనియర్ నాయకులు భావిస్తున్నారు. ఎన్నికల అనంతరం ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకోసం కొత్తగా ఎన్నికైన బీజేపీయేతర పార్టీల అభ్యర్థుల మద్దతుని ఆశించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
చిన్న పార్టీలను తమకు మద్దతుగా ఒక్కతాటిపైకి తేవడంలోనూ, తిరుగుబాటుదారులను బుజ్జగించి తన దోవలోకి తెచ్చుకోవడంలోనూ కాంగ్రెస్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. రాజస్థాన్‌లో ప్రధానమైన ఎదురుదెబ్బ స్వతంత్ర అభ్యర్థులనుంచే ఎదుర్కొంది. గత(2013) ఎన్నికల్లో 7 సీట్లు సాధించిన స్వతంత్రులు ఈసారి ఏకంగా 13 సీట్లు గెలుచుకున్నారు. ఈ 13 సీట్లలో కనీసం 8 స్థానాల్లో గెలుపొందిన వారు కాంగ్రెస్ పార్టీ రెబల్సే కావడం గమనార్హం. ‘బిజెపి కన్నా మా పార్టీకే తిరుగుబాటు దారుల వల్ల ఇబ్బంది ఎక్కువన్న విషయం మాకు ముందే తెలుసు. సగానికి పైగా ఇండిపెండెంట్లు కాంగ్రెస్ పార్టీనుంచి వెళ్లినవారే. వాళ్ళు మా అవకాశాలను బాగా దెబ్బతీశారు’ అని రాజస్థాన్‌కి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు అన్నారు. స్వతంత్రులను పక్కనపెడితే ఆరు సీట్లను గెలుచుకున్న బహుజన్ సమాజ్ పార్టీ చెప్పుకోదగ్గ ప్రభావాన్ని చూపింది.
మాజీ బీజేపీ నేత హనుమాన్ బెనివాల్ సారథ్యంలోని రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ 3 సీట్లూ, గుజరాత్ కి చెందిన భారతీయ ట్రైబల్ పార్టీ, సీపీఎం చెరో 2, రాష్ట్రీయ లోక్‌దళ్ ఒక సీటు గెలిచాయి. ‘ ముందుగానే కాంగ్రెస్ తిరుగుబాటుదారులను ఒప్పించినా, లేదా స్వతంత్ర అభ్యర్థులను చేర్చుకున్నా ఫలితాలు మరో రకంగా ఉండేవి’ అని జైపూర్‌కి చెందిన రాజస్థాన్ యూనివర్సిటీ మాజీ ప్రిన్సిపల్ ఆర్.డి.గుర్రాజ్ అభిప్రాయపడ్డారు.
ఎంపీలో 17.. రాజస్తాన్‌లో 141% తేడాతో సీట్లు తారుమారు
ఒక శాతం, లేదా ఒక శాతం లోపు ఓట్లు అటూ ఇటూ అయితే ప్రభుత్వాలే పడిపోతాయని మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికలు రుజువు చేశాయి. కేవలం ఒక్క శాతంలోపు ఓట్ల తేడాతో రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 31 అసెంబ్లీ స్థానాల్లో గెలుపు ఓటముల నిర్ణయం జరిగింది. మధ్యప్రదేశ్‌లో 17 నియోజకవర్గాలు, రాజస్థాన్‌లో 14 అసెంబ్లీ సీట్లలో అతి తక్కువ ఓట్ల తేడాతో విజయావకాశాలు చేజారి పోయినట్టు ఓట్ల వివరాలను బట్టి తెలుస్తోంది. ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ఓట్ల శాతంలో తేడా అత్యంత స్వల్పంగా ఉండటం ఇక్కడ గమనార్హం. మధ్య ప్రదేశ్‌లో పోటీపోటీగా జరిగిన ఎన్నికల్లో 17 స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్ధుల మధ్య ఓట్ల తేడా కేవలం ఒక శాతం లోపు ఉండగా, అందులో 15 స్థానాల్లో మరితం తక్కువ ఓట్ల తేడాతో గెలుపు ఓటముల నిర్ణయం జరిగిపోయింది.ఈ 15 సీట్లలో 9 చోట్ల కాంగ్రెస్ విజయం సాధిస్తే, బీజేపీ అభ్యర్ధులు ఆరు స్థానాల్లో గెలిచారు.
శివరాజ్ సింగ్‌చౌహాన్ మంత్రివర్గంలో వైద్య విద్యాశాఖ మంత్రిగా ఉన్న శరద్ జైన్ జబల్పూర్ నార్త్ నియోజకవర్గంలో కేవలం 0.4శాతం ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ సక్సేనా చేతిలో ఓటమి పాలయ్యారు.అలాగే, ఓటమి పాలయిన 13 మంది మంత్రుల్లో ఉమా శంకర్ గుప్తా, దీపక్ జోషి, రుస్తుం సింగ్ అతి తక్కువ ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఇక రాజస్థాన్ విషయానికి వస్తే 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1 శాతం ఓట్ల తేడాతో అభ్యర్థుల తలరాతలు మారిపోయాయి. వీటిలో ఏడు చోట్ల బీజేపీ గెలుపొందగా, మిగతా స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. వసుంధర రాజె ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న రాజేంద్ర రాతోర్ 1 శాతం ఓట్ల తేడాతో చురు నియోజకవర్గం నుంచి గెలుపొందారు.