పేకాటలో గొడవతోనే యువకుడి హత్య
శాంతినగర్ : పేకాటలో జరిగిన గొడవతోనే ఓ యువకుడిని హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసు వివరాలను బుధవారం సాయంత్రం రాజోలి పోలీస్‌స్టేషన్‌లో అలంపూర్ సీఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు. వడ్డేపల్లి మండలం రాజోలికి చెందిన అమీర్ (32) వ్యసనపరుడు. పేకాట ఆడటానికి డబ్బులు అప్పు ఇవ్వకుంటే చంపుతానని అదే గ్రామానికి చెందిన నాయికి చంద్రను, పొలం వద్ద జరిగిన గొడవలో చంపుతానని యూనుస్‌ను బెదిరించాడు. దీంతో అతడిని ఎలాగైన తుదముట్టించాలని ఇద్దరూ కలిసి పథకం వేసుకున్నారు. ఇందులోభాగంగా ఈనెల 21వ రాత్రి ఎనిమిది గంటలకు మటన్‌మార్కెట్ సమీపంలోని మద్యం దుకాణం వద్ద ఉన్న అమీర్‌ను మారణాయుధాలతో దాడికి పాల్పడి చంపేసి పారిపోయారు. ఈ ఘటనపై స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఎట్టకేలకు ఇద్దరు నిందితులను బుధవారం పట్టుకుని విచారించి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మరో నిందితుడిని త్వరలో పట్టుకుంటామని సీఐ తెలిపారు. ఈ సమావేశంలో శాంతినగర్ ఎస్ఐ వెంకటేశ్వర్లు, రాజోలి హెడ్‌కానిస్టేబుల్ సురేందర్, కానిస్టేబుళ్లు తులసీనాయుడు, చిన్నికృష్ణ, మన్యం పాల్గొన్నారు.