ఊరెళితే మొక్కలకు నీళ్లు పెడతాయి!
అర్జంటుగా ఊరెళ్లాలి.. వారం, పది రోజుల వరకూ మళ్లీ ఇంటికొచ్చే అవకాశమే లేదు. పెరట్లో మొక్కలు నీళ్లులేక చచ్చిపోతాయేమో! మహా నగరాల్లోని అపార్ట్మెంట్ల నుంచి.. పల్లెల్లోని ఇంటి పెరళ్ల వరకూ ఈ సమస్య గురించి మనం చాలాసార్లు వినే ఉంటాం. ఇరుగు పొరుగును అప్పుడప్పుడూ మొక్కలకు నీళ్లు పెట్టమని చెప్పడమో.. అపార్ట్మెంట్లలోని మొక్కలన్నీ వరండాల్లోకి తీసుకొచ్చి నీళ్లుపెట్టే బాధ్యతను వాచ్‌మెన్‌కు అప్పగించడమో.. సాధారణంగా మనం చేసే పని. కానీ ఫొటోలో కనిపిస్తున్న.. ఇలాంటి కూజాలు మీ దగ్గరున్నాయనుకోండి... ఈ సమస్య ఇట్టే మాయమైపోతుంది. ఒకట్రెండు వారాలు కాదు.. ఏకంగా నెలరోజులపాటు మొక్కలకు నీళ్లు పడుతుంది ఈ ‘క్లయోలా’.
దాదాపు 20 లీటర్ల బకెట్‌ను కొంచెం ఎత్తులో పెట్టి... దానికి క్లయోలా కూజాలను కలిపితే చాలు.. మిగిలినదంతా ఆటోమెటిక్‌గా జరిగిపోతుంది. కూజాల్లోకి చేరే నీరు... మట్టిలోని అతిసూక్ష్మమైన కంతల ద్వారా చెమ్మగా మారుతుంది. ఆ చెమ్మ నుంచి మొక్కల వేళ్లు నీళ్లు అందుకుంటాయి. చాలా సింపుల్‌గా అనిపించే ఈ క్లయోలా కూజాలను ఈజిప్టుకు చెందిన రామీ హలీమ్ అనే వ్యక్తి అభివృద్ధి చేశారు. ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలో ఒకప్పుడు విరివిగా వాడిన ఒల్లా అనే మట్టిపాత్రల డిజైన్ ఆధారంగా ఈ క్లయోలా తయారైంది. ఒక్కో క్లయోలా కూజా దాదాపు మూడు అంగుళాల వెడల్పు, ఐదంగుళాల పొడవు మాత్రమే ఉంటుంది. దాని మూతపై రెండు గొట్టాలు వ్యతిరేక దిశలో ఉంటాయి. మొక్కలకు ఎల్లప్పుడూ కావాల్సినంత నీళ్లు మాత్రమే అందుతాయి. కూజాలకు మూతలు ఉండటం వల్ల నీరు ఆవిరి రూపంలో వృథా అయ్యేది కూడా ఉండదు. కుమ్మర్ల పనితనానికి మచ్చుతునకలుగా కనిపించే ఈ ప్రత్యేకమైన మట్టి కూజాలు ఆరింటి ఖరీదు దాదాపు 30 డాలర్లు. అంటే సుమారు 2 వేల రూపాయలు.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్