షారుక్ ఖాన్ బంగ్లా ముందు ర్యాంప్ కూల్చివేత!
ముంబై: సబర్బన్ బాంద్రా ప్రాంతంలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ బంగ్లా 'మన్నత్'ముందు ఉన్న వివాదాస్పద ర్యాంప్‌ను ముంబై మహానగర పాలక సంస్థ అధికారులు శనివారం కూల్చివేశారు. తన ప్రై వేట్ వాహనాన్ని పార్కింగ్ చేసుకొనేందుకు షారుక్ ఈ ర్యాంపును నిర్మించారు. అయితే దాని వల్ల ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తుతోందని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో స్థానిక ఎంపీ పూనమ్ మహజన్ ఆ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని మున్సిపల్ కమిషనర్‌కు జనవరి 29న లేఖ రాశారు.
ర్యాంప్‌ను వారం రోజుల్లో కూల్చివేయాలని మున్సిపల్ అధికారులు షారుక్‌కు ఇది వరకే నోటీసులు పంపారు. అయినా షారుక్ పట్టించుకోకపోవడంతో ర్యాంప్‌ను కూల్చివేశామని అధికారులు తెలిపారు. తమ నోటీస్‌కు స్పందించనందుకు షారుక్‌కు జరిమానా కూడా విధించే అవకాశం ఉందని చెప్పారు.