అప్పుల ఊబిలో తమిళనాడు
► గత ఆరు సంవత్సరాల్లో 3.14 లక్షల కోట్లు ఆప్పు చేశారని ఆరోపణ
► రాష్ట్ర ఆదాయంలో సగం వడ్డీకే
► మరో రెండు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఎవ్వరూ కాపాడలేరన్న రాందాస్
తిరువళ్లూరు: అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, గత ఆరు సంవత్సరాల్లో 3.14 లక్షల కోట్లు అప్పులు పెరిగాయని పీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు రాందాస్ ఆరోపించారు. తిరువళ్లూరులో పీఎంకే ఆధ్వర్యంలో భారీ బహిరంగ సమావేశం పార్టీ రాష్ట్ర ఉపకార్యదర్శి బాలయోగి అధ్యక్షతన నిర్వహించారు. జిల్లా మాజీ కన్వీనర్ వెంకటేషన్, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దినేష్కమార్ ప్రారంభోపన్యాసం చేశారు. ముఖ్యఅతిథిగా పీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు రాందాస్, విశిష్ట అతిథిగా మాజీ కేంద్ర మంత్రి అన్బుమణి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా అన్బుమణి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్రను పోషించడంలో డీఎంకే ఘోరంగా విఫలమైందని ఆరోపించారు.
రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పిందని, ప్రస్తుతం అన్నాడీఎంకే నేతలకు రాజకీయ వ్యవహారాలు నడపడానికే సమయం లేకుండా పోయిందని విమర్శించారు. అవినీతిమయంగా రాష్ట్రాన్ని మార్చేసిన ద్రవిడ పార్టీలను రాష్ట్రం నుంచి తరిమి కొట్టాల్సిన అవసరం వచ్చిందన్నారు. అనంతరం రాందాస్ మాట్లాడుతూ పీఎంకే తీసుకున్న ముందు చూపుతో రాష్ట్రంలోని 90 వేల మద్యం దుకాణాలు, రాష్ట్రంలోని మూడు వేలకు పైగా మద్యం దుకాణాలు మూతపడ్డాయని, మద్యపాన నిషేధం విషయంలో రాజీ లేనీ పోరాటాన్ని సాగిస్తామని వారు స్పష్టం చేశారు. ఆరు సంవత్సరాల కాలంలో పెచ్చు మీరిన అవినీతితో 85 వేల కోట్లు రూపాయల పెట్టుబడి పొరుగు రాష్ట్రాలకు వెళ్లిందని ఆరోపించారు.
దక్షిణ కొరియాకు చెందిన కియా కారు విడిభాగాల తయారీ పరిశ్రమను పెట్టడానికి ముందుకు వస్తే, మంత్రులు, ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి అడిగి లంచం మొత్తాన్ని ఇవ్వలేక పొరుగు రాష్ట్రానీకి వెళ్లిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిశ్రమ తమిళనాడులో ఏర్పాటు చేసి ఉంటే దాదాపు ఐదు వేల మందికి ఉపాధి లభించేదన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అన్నాడీఎంకే అధికారంలోకి రాక ముందు లక్ష కోట్లు రూపాయలు అప్పు ఉండగా ప్రస్తుతం 5.30 లక్షల కోట్లుకు పెరిగిందని, ఈ మొత్తానికి ఏడాదికి 23 వేల కోట్లు రూపాయలు చెల్లించాల్సి వస్తుందని వాపోయారు. రాష్ట్ర ఆదాయంలో ఇంత మొత్తం వడ్డీ పోతే ఇక సంక్షేమం సంగతేంటని వారు ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఆరు నెలల కాలంలో రైతుల ఆత్మహత్యలు లేదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నాలుగు నెలల కాలంలో దాదాపు నాలుగు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, కరువు లేనప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని 40 వేల కోట్లు రూపాయలు కరువు, రైతుల పరిహరం కోసం ఎందుకు అడిగారని వారు ప్రశ్నించా రు. అవినీతి లేనీ పాలన అందించడానికి తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ అద్యక్షుడు జీకే మణి, పార్టీ నేతలు వైద్యలింగం, అంబత్తూరు కేఎన్ శేఖర్, అడ్వొకేట్ బాలుతో పాటు వేలాది మంది కార్యకర్తలు హాజరయ్యారు.