ఉగ్రవాదులను ఎదిరించి స్నాతకోత్సవం
ఇస్తాంబుల్: సిరియాలో ఉగ్రవాదులు సాగిస్తున్న ఆగడాలకు ఆ దేశానికి చెందిన వేలాదిమంది ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్లిపోతున్నారన్న విషయం తెలిసిందే. అయితే అదే సిరియాలో ఓ మహిళ ఉగ్రవాదులను ఎదిరించి ఓ మోడల్ స్కూల్ నడపడమే కాదు.. వారి హెచ్చరికలను బేఖాతరు చేస్తూ స్నాతకోత్సవాన్ని కూడా నిర్వహించి, వార్తల్లో నిలిచింది. రానియా కిసార్... సిరియన్–అమెరికన్ మహిళ. అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ పెత్తనమున్న ఆ ప్రాంతంలో ఏ పనిచేయాలన్నా వారి అనుమతితోనే చేయాల్సి ఉంటుంది. అయితే వారిని ఎదిరించి, పాఠశాలను ప్రారంభించిన కిసార్‌కు.. ఎన్నోసార్లు ఉగ్రవాదుల నుంచి హెచ్చరికలు ఎదురయ్యాయి. అయితే ఆమె ఏమాత్రం బెదరకుండా తనపని తాను చేసుకుపోయింది.
తాజాగా.. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన విద్యార్థులతో స్నాతకోత్సవం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుసుకున్న మిలిటెంట్లు మరోసారి కిసార్‌ను బెదిరించారు. స్నాతకోత్సవం జరుపుకొంటే తమకేమీ అభ్యంతరం లేదుకానీ.. వేడుకలో ఎటువంటి ఆటపాటల వంటివి ఉండకూడదని హెచ్చరించారు. అయినా అవేవీ లెక్కచేయని కిసార్.. స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. విద్యార్థులు ఒక్కొక్కరుగా వేదికపైకి వచ్చి.. పట్టాను, ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్న సమయంలో స్వయంగా తానే గొంతువిప్పింది.
స్నాతకోత్సవం సమయంలో అమెరికా వర్సిటీల్లో పాడే గీతాన్ని ఆలపించింది. ఈ కార్యక్రమానికి ఉగ్రవాదుల కూడా హాజరైనా ఏమీ చేయలేకపోయారు. కార్యక్రమం అనంతరం కిసార్ మాట్లాడుతూ... ‘వాళ్లు వారి పెత్తనాన్ని చాటుకోవాలని ప్రయత్నించారు. కానీ ఏమీ చేయలేకపోయారు. ఎందుకంటే నేను చేస్తున్నది తప్పు కాదు. అటువంటప్పుడు నేనెవరికీ భయపడాల్సిన అవసరం కూడా లేద’ని పేర్కొంది.