తెల్లదొరల భరతం పట్టిన ధీరవనిత ‘రాణీమా’
నేడు రాణీమా గైడిన్ల్యూ 22వ వర్ధంతి
భారత స్వాతంత్య్రోద్యమంలో బ్రిటిష్ సైన్యాన్ని ఎదిరించి పోరాడిన ఏకైక ఆదివాసీ వీరనారి గైడిన్ల్యూ. ఈశాన్య రాష్ట్రా ల ఆదివాసులు ‘రాణీమా’ అని ప్రేమగా పిలుచుకునే ఆమె నాగా జాతిలోని రాంగ్ మోయీ గిరిజన తెగకు చెంది నది. పశ్చిమ మణిపూర్‌లోని ఒక కుగ్రామంలో గైడిన్ల్యూ 1915, జనవరి 26న జన్మిం చారు. యావత్ భారతావని గర్వించదగిన ఆ స్వాతం త్య్ర యోధురాలు మణిపూర్ ప్రాంతంలో ఆదివాసీల తరఫున పోరాడుతున్న జాదోనాంగ్తో కలిసి ‘హరాకా’ అనే సంస్థను స్థాపించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకం గా పోరాడటంతోపాటూ నాగాజాతి ప్రజల్లో సామాజిక, ధార్మిక, రాజకీయ, నైతిక చైతన్యాన్ని రగిలించడంలోనూ రాణీమా అలుపెరుగని కృషి చేశారు. 1931, ఆగస్టు 29న జోదానాంగ్ను బ్రిటిష్ పాలకులు ఉరితీశారు. దీంతో 17 ఏళ్ల ప్రాయంలోనే గైడిన్ల్యూ ఉద్యమ నాయ కత్వాన్ని చేపట్టి స్వతంత్ర సాయుధ బలగాలను నిర్మిం చారు. గిరిజన, గిరిజనేతర గ్రామాలపై తెల్లదొరలు విరు చుకుపడి విధ్వంసం సాగించారు. రాణీమా బలగాలు ధైర్యసాహసాలతో వారిని ఎదిరించి పోరాయి.
ముఖ్య నాగాతెగలైన జెమీ, ల్యాగ్ మేయీ, రాంగ్ మేయీలను హరాకా ఉద్యమం ఏకతాటిపైకి తెచ్చింది. ఆదివాసీ సంస్కృతిని పరిరక్షించింది. అందుకే మణిపూర్ ప్రజలు రాణీమాను సాక్షాత్తూ దేవతగా భావించేవారు. ఆమె నేతృత్వంలో పశ్చిమ మణిపూర్, దక్షిణ నాగాలాండ్, ఉత్తర అసోం ప్రాంతాల్లో స్వాతంత్య్రోద్యమ జ్వాలలు ఎగసాయి. కక్షకట్టిన బ్రిటిష్ ప్రభు త్వం రాణీమాపైకి సైన్యాన్ని పంపింది. ఆమె ఆచూకీ తెలిపిన వారికి నజరానాలు ప్రకటించింది. నిత్యం ప్రజల మధ్యే ఉంటున్నా రాణీమా జాడను ఎవరూ బయట పెట్టలేదు. కానీ బ్రిటిష్‌వారి ఆధునిక ఆయుధ సంపత్తికి కత్తి, డాలు వంటి నాగాల సంప్రదాయక ఆయుధాలు నిలవరిం చలేకపోయాయి. ఎందరో నాగా లు పోరాటంలో నేలకొరిగారు. ఎట్టకేలకు 1932 అక్టో బర్ 17న అస్సాం రైఫిల్స్ పొలోమీపై చేసిన దాడిలో నాగాలకు ఓటమి తప్పలేదు. రాణీమాను నిర్బంధించిన బ్రిటిష్ ప్రభుత్వం ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయినా హరాకా ఉద్యమం నాగాలాండ్, మణిపూర్ ప్రాంతమంతటా వ్యాపించింది. వివిధ జైళ్లలో 15 ఏళ్లు మగ్గిన తర్వాత, స్వాతం త్య్రానంతరం 1947లో రాణీమా విడుదల య్యారు. కానీ మణిపూర్‌లో ఆమె ప్రవే శాన్ని నిషేధించారు. దీంతో నాగా ప్రజలు ప్రభుత్వ వ్యతిరేక సాయుధ పోరాటం చేప ట్టారు.
1960 నుంచి అజ్ఞాతంలోనే ఉన్న ఆమె 1966 నుంచి బహిరంగంగా నాగా లాండ్లో శాంతిస్థాపనకు కృషి చేశారు. 1972 భారత స్వాతంత్య్ర రతజోత్సవాలలో ప్రభుత్వం ఆమెను ‘తామ్రపత్రం’తో సత్కరించింది. దేశ స్వాతంత్య్రం కోసం, ఆదిమ గిరిజన జాతుల స్వేచ్ఛ కోసం అవిశ్రాంతంగా పోరాడిన రాణీమా 1993, ఫిబ్ర వరి 17న తుదిశ్వాస విడిచారు. రాజ్యాంగం 6వ షెడ్యూ ల్ ఈశాన్య రాష్ట్రాల ఆదివాసీలకు కల్పించిన విశేష హక్కుల వెనుక, దేశవ్యాప్త ఆదివాసీ ఉద్యమాల వెనుక రాణీమా కృషి ఉంది. ఆ ఆదివాసీ, స్వాతంత్య్రయోధు రాలి స్మృతి భారత ప్రజల గుండెల్లో చిరకాలం పది లంగా నిలుస్తుంది.
గుమ్మడి లక్ష్మీనారాయణ
ఆదివాసీ రచయితల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
మొబైల్: 9951430476