rate raise
-
గుడ్డుకు రెక్కలు..!
భువనగిరి : కోడిగుడ్ల ధరలకు రెక్కలొచ్చాయి. రోజురోజుకూ ధరలు పెరుగుతూ వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. నెల రోజుల క్రితం రూ.4 ఉన్న గుడ్డు ధర ప్రస్తుతం రూ.5కు పెరిగింది. దీంతో పేదలు గుడ్డు కొనుగోలు చేయలేకపోతున్నారు. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు, గర్భిణులు, బాలింతలు, విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో సైతం గుడ్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో గుడ్ల వినియోగం అమాంతంగా పెరిగింది. వేసవిలో కోళ్ల ఉత్పత్తి తగ్గడంతో హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఇక్కడి నుంచే గుడ్లు ఎగుమతి చేశారు. దీంతో జిల్లాలో ప్రస్తుతం గుడ్ల ఉత్పత్తి తగ్గడంతో వీటి ధర రూ.5కు చేరింది. ప్రతి ఏడాది అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు గుడ్లకు డిమాండ్ ఉండే కాలంగా పౌల్ట్రీ వ్యాపారులు పరిగణిస్తారు. అయితే ఈ ఏడాది పక్క రాష్ట్రాలకు ఎగుమతి చేయడం వల్ల ముందుగానే ధరలు పెరిగాయని చెబుతున్నారు. పదిశాతం తగ్గిన ఉత్పత్తి.. జిల్లాలో రోజూ లక్షకు పైగా గుడ్లు ఉత్పత్తి కావ్వాల్సి ఉండగా.. 10 శాతం ఉత్పత్తి పడిపోవడం.. మరో 10 శాతం అమ్మకాలు పెరగడంతో డిమాండ్ ఎక్కువైంది. జిల్లాలో చౌటుప్పల్, ఆలేరు, మోత్కూర్, బొమ్మలరామారం, తుర్కపల్లి, బీబీనగర్, పోచంపల్లి భువనగిరి మండలాల్లో అధిక సంఖ్యలో పౌల్ట్రీఫామ్స్ ఉన్నాయి. ఇక్కడ రోజూ దాదాపు లక్ష గుడ్లు ఉత్పత్తి అవుతుంటాయి. ప్రస్తుతం ఉత్పత్తి తగ్గడంతో డిమాండ్ పెరిగిందని.. పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. బహిరంగ మార్కెట్లో రూ.5 ప్రస్తుతం గుడ్డు హోల్‌సెల్ ధర రూ.4.50 ఉండగా.. బహిరంగ మార్కెట్లో రూ.5కు విక్రయిస్తున్నారు. పౌల్ట్రీఫామ్ నుంచి రూ.4.50కు కొనుగోలు చేసిన గుడ్లను ఒక్కోగుడ్డుకు రూ.5 నుంచి రూ.5.50 వరకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 249 పౌల్ట్రీఫామ్స్ ఉండగా వీటిలో మాంసం కోసం పెంచే పౌల్ట్రీఫామ్స్ 180, గుడ్లను ఉత్పత్తి చేసేవి 69 ఉన్నాయి. వీటిలో కొన్ని పౌల్ట్రీఫామ్స్‌లో ప్రస్తుతం గుడ్లను ఉత్పత్తి చేసే దశలోకి కోళ్లు రాలేదు. దీంతో గుడ్ల ఉత్పత్తి తగ్గింది. ప్రస్తుతం కోళ్లను ఉత్పత్తి చేసే పౌల్ట్రీపామ్స్ తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. -
అరటాకుతో ఉపాధి
– హోటళ్లలో అరటి ఆకులకు పెరిగిన డిమాండ్ – వందల కుటుంబాలకు ఉపాధి పుట్లూరు: చిన్నపాటి గాలికే చిరిగిపోయి అరటాకు వందల కుటుంబాలకు ఉపాధినిస్తోంది. కష్టాల్లో ఉన్నప్పుడు అరటాకు బతుకైపోయిందంటూ పోల్చుకునే చాలా మందికి.. అదే అరటాకు బతుకుతెరువుగా మారింది. నిత్య జీవితంలో ఒక్క పూట భోజనం లేదా టిఫెన్ అరటి ఆకులో చేయడం ఎంతో గొప్పగా చాలా మంది భావిస్తుంటారు. ఎవరైనా కొత్తగా గ్రామాల్లోకి వస్తే వారికి కడుపునిండా భోజనాన్ని అరటి ఆకులో వడ్డిస్తే... జీవిత కాలం గుర్తుండిపోతోంది. ఇదే చాలా మందికి ఉపాధిగా మారింది. పోటీ ప్రపంచంలో.. పట్టణ ప్రాంతాల్లోని హోటళ్లలో అరటి ఆకులో భోజనం ప్రత్యేకంగా ఉంటోంది. గతంలో ప్లేట్లలో భోజనం వడ్డించే హోటళ్లలో సైతం నేడు అరటి ఆకులు దర్శనమిస్తున్నాయి. అరటి ఆకులో టిఫెన్, భోజనాన్ని అందిస్తే వారి వ్యాపారం మూడు పూవ్వులు.. ఆరు కాయలుగా వర్ధిల్లుతుండడంతో చాలా మంది హోటల్ నిర్వాహకులు అరటి ఆకులపై మక్కువ చూపుతున్నారు. పోటీ ప్రపంచంలో నిలుదొక్కుకునేందుకు నేడు పట్టణ ప్రాంతాల్లోని హోటల్ నిర్వాహకులు అరటి ఆకులకు తొలి ప్రాధాన్యతనిస్తున్నారు. ‘అయిన వారికి అరటి ఆకుల్లో...కాని వారికి కంచాల్లో’ అన్న నానుడిని అనుసరిస్తూ తమ వ్యాపారాన్ని అభివృద్ది చేసుకుంటున్నారు. శింగనమల టాప్ శింగనమల నియోజకవర్గంలోని బుక్కరాయసముద్రం, నార్పల, పుట్లూరు, యల్లనూరు మండలాల్లో అరటి తోటలు విస్తారంటా ఉన్నాయి. ఈ ప్రాంతాల నుంచి ప్రతి రోజూ టన్నుల కొద్ది అరటి ఆకులు పట్టణ ప్రాంతాల్లోని హోటళ్లకు తరలి వెళ్తోంది. అరటి ఆకులను తరలించడాన్ని బతుకు తెరువుగా కొన్ని వందల కుటుంబాలు మార్చుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు హోటళ్లకు శింగనమల నియోజకవర్గం నుంచే అరటి ఆకులు అత్యధికంగా సరఫరా అవుతున్నాయి. తెల్లవారుజాము నుంచే.. అరటి ఆకులు సేకరించడం కోసం కూలీలు ఉదయం 5 గంటలకే తోటల వద్దకు చేరుకుంటారు. ఉదయం పది గంటల్లోపు తాము సేకరించిన అరటి ఆకులను కట్టలుగా కట్టి బస్సులు, ఆటోలలో అనంతపురంతో పాటు ఇతర ప్రాంతాలకు తరలిస్తుంటారు. ఏ కొద్దిగా ఆలస్యమైనా.. వారు పడిన కష్టానికి ఫలితం దక్కకుండా పోతుంది. రైతుల అనుమతి తప్పనిసరి అరటి తోటలలో గెలలు కొట్టిన అనంతరం రైతుల ఇళ్ల వద్దకెళ్లి అరటి ఆకుల సేకరణకు అనుమతి తీసుకుంటారు. ఎక్కువగా మూడవ పంట ముగిసిన అరటి తోటలలో ఆకుల సేకరణకు రైతులు అనుమతిస్తారు. కొన్ని సమయాల్లో అరటి ఆకులు దొరకక కూలీలు ఇతర మండలాలకు సైతం వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలా సేకరించిన 100 అరటి ఆకుల కట్టకు రూ.100 ఇస్తారని కూలీలు చెబుతున్నారు. ఇదే జీవనాధారం. మాకు అరటి ఆకుల సేకరణ మాత్రమే జీవనాదారం. ఎన్నో ఏళ్లుగా అరటి ఆకులను సేకరించి అనంతపురంలోని హోటళ్లకు సరఫరా చేస్తున్నాం. వర్షాలు వచ్చిన సమయంలో కూలి దొరకదు. ఇంటిళ్లపాది కష్టపడితే తప్ప మాకు గిట్టుబాటు కాదు. - నాగయ్య, నడిమిపల్లి, నార్పల మండలం సంస్కృతిలో భాగం.. అరటి ఆకులలో బోజనం చేయడమనేది మన పురాతన సంస్కృతి. నేటి పాశ్చత్య కాలంలో ఈ విషయంగా ప్రజల్లో మరింత ఆసక్తి పెరిగింది. తెల్లవారుజాము నుంచే మేము తోటల్లోకి వెళ్లి అరటి ఆకులను సేకరించాలి. కొన్నిసార్లు కూలి కూడా గిట్టుబాటు కాదు. మేము సేకరిస్తున్న అరటి ఆకులలో ఎంతో మంది కడుపు నిండా అన్నం తినడం మాకు సంతృప్తినిస్తోంది. - రాజేంద్ర, నార్పల