నిరాశ్రయులం..
సాక్షి, మంచిర్యాల : వారంతా ఎవరూ లేని అనాథలు.. దిక్కుతోచక రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో తలదాచుకుంటున్న అభాగ్యులు. ఎలాంటి ఆధారమూ లేని నిరాశ్రయులు. అయినా.. వారి గురించి ఎవరూ పట్టించుకోరు. జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిల్లో అనాథలు, నిరాశ్రయులు వందలాదిగా ఉన్నా నిబంధనల సాకుతో జిల్లా అధికారులు కొద్ది మందిపైనే కనికరం చూపారు. వందలాది మంది అభాగ్యులకు అన్యాయం చేశారు.
2011 జనాభా లెక్కల ప్రకారం.. లక్ష మంది జనాభా దాటిన ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 60 మంది నిరాశ్రయులనే గుర్తించిన అధికారులు వీరికి మాత్రమే ఆశ్రయం కల్పించాలంటూ కేంద్రాన్ని నివేదించారు. కేంద్రమూ ఆ ప్రాంత అనాథలు, నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించేందుకు ఏటా రూ.6 లక్షలు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ నిధులు జిల్లా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)కు అందాయి. అధికారులు నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు.
సర్వేకు నోచుకోని మంచిర్యాల, నిర్మల్!
2011 జనాభా లెక్కల ప్రకారం లక్ష మంది జనాభా ఉన్న ప్రాంతాల్లోనే సర్వే చేసి.. అనాథలు, నిరాశ్రయులను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ సాకుతో అధికారులు ప్రస్తుతం లక్షకు పైనే జనాభా దాటిన మంచిర్యాల, నిర్మల్ పట్టణాల్లోని రైల్వేస్టేషన్ , బస్టాండు ప్రాంతాల్లో నివసిస్తున్న వందలాది మంది అనాథలను విస్మరించారు. మంచిర్యాలలోని రేల్వేస్టేషన్లో ఏళ్ల నుంచి సుమారు వంద మంది అనాథలు దుర్భర జీవనం గడుపుతున్నా.. నెలకు ఒకరిద్దరి చొప్పున చచ్చిపోతున్నా కేంద్రం దృష్టికి తీసుకెళ్లలేదు.
అనాథలు, నిరాశ్రయుల సంఖ్య ఎక్కువగా ఉన్న మంచిర్యాలలోని పరిస్థితిని కేంద్రానికి నివేదిస్తే ఈ ప్రాంతంలోని అభాగ్యులకూ ‘ఆసరా’ లభించేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటు కేంద్ర నిర్ణయంపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనాథలు, నిరాశ్రయులను ఆదుకునే విషయంలో జనాభాతో ముడిపెట్టడం సబబు కాదని.. వంద మంది నిరాశ్రయులున్న ప్రాంతాలన్నింటిలోనూ పథకం వర్తింపజేయాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. 2011లో మంచిర్యాల పట్టణ జనాభా 88 వేల 400 మంది, నిర్మల్లో 88 వేల 215 మంది ఉన్నారు. ఈ రెండు మున్సిపాలిటీల్లో ప్రస్తుతం జనాభా లక్షపైనే ఉంటుంది. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి.. ఇక్కడా పథకం అమలయ్యేలా చూడాలని ఆయా నిరాశ్రయులు కోరుతున్నారు.
నాలుగేళ్ల తర్వాత..!
అనాథలు.. నిరాశ్రయులకూ బతికే హ క్కు కల్పించాలని సుప్రీంకోర్టు 2010లోనే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. పట్టణాలు.. నగరాల్లో లక్ష జనాభాకు ఒక రాత్రి బస కేంద్రం ఏర్పాటు చేయాలని ఆదేశించింది. సంబంధించిన మార్గదర్శకాలూ విడుదల చేసింది. ప్రతి కేంద్రంలో నీరు, ఆహారం, మరుగుదొడ్లు, పరుపులు, పారిశుధ్యం వంటి మౌలిక వసతులన్నీ కల్పించాలని.. వాటికయ్యే ఖర్చు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని సూచించింది. వయసుతో సంబంధం లేకుండా అనాథలు.. నిరాశ్రయులందరికీ అందులో నీడ కల్పించాలంది. అయినా.. జిల్లాలో ఎక్కడా రాత్రి బస కేంద్రాలు ఏర్పాటు చేయలేదు.
కొత్తగా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కార్ ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించింది. జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ ద్వారా 2011 జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకుని పట్టణాలు.. నగరాల్లో లక్ష జనాభా ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో రాత్రి సమయాల్లో సర్వే నిర్వహించి అనాథలు, నిరాశ్రయులను గుర్తించాలని ఆదేశించింది. వీరి కోసం బస కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని.. అందుకు అయ్యే ఖర్చు భరించేందుకు కేంద్రం ముందుకు వచ్చింది.
దీంతో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారులు రెండు నెలల క్రితం లక్ష జనాభా ఉన్న ఆదిలాబాద్పైనే నివేదికను కేంద్రానికి పంపారు. ఈ విషయమై మెప్మా ప్రాజెక్టు డెరైక్టర్ రాథోడ్ రాజేశ్వర్ వివరణ ఇస్తూ.. కేంద్రం సూచనల మేరకు 2011 జనాభా లెక్కల ప్రకారం లక్ష జనాభా దాటిన ఆదిలాబాద్ పట్టణంలోనే సర్వే నిర్వహించామని, 60 మంది అనాథలు, నిరాశ్రయులను గుర్తించి వారి వివరాలు కేంద్రానికి పంపామనిచ మంచిర్యాల, నిర్మల్లో 2011లో జనాభా లక్ష లేకపోవడంతో సర్వే చేయలేదని తెలిపారు.
తట్టుకోలేక.. తనువు చాలిస్తున్నారు..!
ఇంటి నుంచి వెలివేయబడ్డ వారు.. అనాథలు.. ఎక్కడి నుంచో పని కోసం వచ్చి శరీరం సహకరించక భిక్షాటన చేస్తున్న వృద్ధులు, వికలాంగులు మంచిర్యాలలోనే ఆశ్రయం పొందుతున్నారు. రైల్వేస్టేషన్లు.. బస్టాండులు.. చౌరస్తాలు.. ప్రార్థన మందిరాల వద్ద యాచకులుగా దర్శనమిస్తున్నారు. జిల్లాలో వేసవికాలంలో భరించలేని వేడి.. శీతాకాలం ప్రాణాలు తీసే చలిని తట్టుకోలేక ఎంతో మంది చనిపోతున్నారు.
మరెంతో మంది అనారోగ్యం పాలవుతున్నారు. అయినా.. వీరిని గురించి పట్టింపేవరికీ లేదు. ఇంత వరకు వీరి గురించి ఆలోచించిన నాధుడే లేడు. ఆరోగ్యం చెడిపోయినా వైద్యం చేయించుకోలేని దుస్థితి. పలు సందర్భాల్లో పోలీసులు లేనిపోని అనుమానంతో నిరాశ్రయులు.. అనాథలపై చేయి చేసుకోవడం అభాగ్యులను ఆవేదనకు గురి చేస్తోంది.