అరచేతిలో ఆఖరి మాటలు
చిన్నకోడూరు, న్యూస్‌లైన్: శ్రమైక జీవన సౌందర్యానికీ, స్వశక్తికి చిరునామా ఆ ఇల్లు. తలా ఓ ప ని చేసుకుంటూ బతుకులను నెట్టుకొస్తున్న సంప్రదాయ కుటుంబం. కానీ స్థానికులు కొందరు ఆ ఇంటి పెద్దమ్మాయిని లక్ష్యం చేసుకున్నారు. తీవ్రంగా వేధించారు. ఇక నీకు పెళ్లి కాదంటూ వారి పేదరికంతో పరాచికాలు ఆడారు. సున్నిత మనస్కురాలైన ఆ విద్యాధికారాలు మానసికంగా ఎంతగానో కుమిలిపోయింది. అరచేతిలోనే సూసైడ్ నోట్ రాసి మరీ..ఉరి వేసుకుని ఊపిరి విడిచింది. ఈ హృదయ విదారకర సంఘన చిన్నకోడూరు మండలం చం ద్లాపూర్‌లో ఆదివారం రాత్రి జరిగింది. బాధితులు, పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం...తిరుమల యాదమ్మ, రాజు దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడున్నారు.
రాజు దర్జీగానూ యాదమ్మ బీడీ కార్మికురాలిగానూ స్వయం ఉపాధి పొందుతున్నారు. వీరి తొలి సంతానమైన మాధవి(20) ఇంటర్మీడియెట్ పూర్తి చేసింది. ఉన్నత చదువులకు తగిన డబ్బు లేదన్న భావనతో మాధవి బ్యూటీపార్లర్‌లో కోర్సు చేసింది. సమీప భవిష్యత్తులో అది ఉపయోగపడుతుందని ఆశించింది. ఈలోగా ఇంటిపట్టున ఊరకే ఉండలేక...బీడీలు చుడుతూ తల్లికి ఆసరాగా ఉంటోంది. ఇలా...ప్రశాంతంగా సాగుతున్న వారి జీవనంలో కొందరి నిర్వాకంతో కల్లోలం రేగింది. చక్కటి వర్ఛస్సుగల మాధవిని దుర్బుద్ధి, దురుద్దేశాలతో ఇదే గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు వేధించసాగారు. వారి తీరు శ్రుతి మించింది. ‘పేదరాలివి. నీకు పెళ్లి కాదు...మరోదారి చూసుకో’ అంటూ వారంతా వేధించారు. దీంతో బాగా నొచ్చుకున్న ఆమె ‘నేను చనిపోవడానికి తిరుమల మౌనిక, ఎల్లవ్వ, శ్రీకాంత్, సీహెచ్ శోభ, చీకోడు శ్రీనులు కారణం. వారికి శిక్ష పడేలా చూడండి. అప్పుడే నా ఆత్మకు శాంతి..’ అంటూ తన ఎడమ చేయి అరచేతిపైన పెన్నుతో రాసుకుంది.
అనంతరం ఇంట్లోని ఓ గదిలో ఆదివారం రాత్రి దూలానికి ఉరి వేసుకుని తనువు చాలించింది. ఆ సమయంలో కుటుంబసభ్యులు ఎవరి పనిలో వారున్నారు. మాధవి అలికిడి లేకపోవడంతో లోనికి వెళ్లి చూసేసరికి విగత జీవిగా కనిపించింది. ఈ హఠాత్పరిణామంతో మాధవి కుటుంబీకులు కన్నీరు మున్నీరయ్యారు. ఆ ఐదుగురు వేధించడం వల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందంటూ తల్లిదండ్రులు రోదిస్తూ తెలిపారు. ఈ సంఘటన గ్రామస్తులనూ కలిచివేసింది. ఆ ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ రవీందర్ సోమవారం తెలిపారు.