తెలంగాణ మాదిగల జీవన వేదన రాయక్క మాన్యమ్
‘మా సాహిత్యాన్ని కుక్క ముట్టిన కుండగా ఎందుకు పక్కన పెట్టేస్తారు?’ అని ప్రశ్నిస్తారు జూపాక సుభద్ర. ‘ఆధిపత్య కులాల రచనలకు లేబుల్స్ ఉండవు. పరిమితులుండవు. వారు రాసింది విశ్వసాహిత్యం. మేము రాస్తే- అది దళిత సాహిత్యం, తెలంగాణ సాహిత్యం... ఇంకా ఏవేవో పేర్లు’ అంటారామె. ‘స్త్రీవాదులు కోరుతున్న విముక్తికీ దళిత స్త్రీలు కోరుతున్న విముక్తికీ చాలా తేడా ఉంది. వారికి పితృస్వామ్యం నుంచి విముక్తి కావాలి. మాకు కులం నుంచి భూస్వాముల నుంచి ఆకలి నుంచి విముక్తి కావాలి’ అంటారామె. రవి కాంచనిది కవి గాంచును అని ఎవరన్నారోగాని అది తప్పు. కవి కంట పడని ప్రపంచం చాలా ఉంది. కవి తాకని వేదన ఎంతో ఉంది. కవి కలిసి భుజించని సమూహాలు ఎన్నో ఉన్నాయి. శతాబ్దాల తరబడి పట్టిన గంటాన్ని విడవకుండా రాసినా తీరనంత జీవితం ఈ దేశంలోని దళిత, బహుజన వర్గాల్లో ఉంది.
అదంతా ఎవరు రాయాలి? నా వంతుగా నేను అని ‘రాయక్క మాన్యమ్’ కథలు రాశారు జూపాక సుభద్ర. ఇవి తెలంగాణ జిల్లాల్లోని మాదిగల ఇంకా చెప్పాలంటే దాని ఉపకులమైన డక్కలి జీవితాల్లోని అంతులేని చీకటిని చూపే కథలు. కాసింత వెలుతురు కోసం పాకులాడే కథలు. కొన్ని ఏడుస్తాయి. కొన్ని తిరగబడతాయి. చాలా కొద్ది కథలు మాత్రమే పలువరుస మెరిసేలా చమక్కుమంటాయి. దళిత ఆడపిల్లల సోషల్ వెల్ఫేర్ చదువు, ‘ఏదైనా జరిగితే’ వార్డెన్లు చేసే అమానవీయమైన నఖశిఖ పరీక్షలు, టాయిలెట్లకు నోచని దీనత్వం, పరీక్షలు రాసే పెన్ను కూడా లేని దౌర్భాగ్యం, ఎలాగో గట్టెక్కి ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకుంటే- మీరు కడజాతి వాళ్లట కదా అని ఈసడించి ఇల్లు ఇవ్వకుండా గడియపెట్టే అంటరానితనం, వెజిటేరియన్ ఫుడ్డుకు ఉండే పవిత్రత ‘స్పెషల్స్’ వండుకుంటారన్న ఈసడింపు, రిజర్వేషన్ల పుణ్యమా అని తప్పనిసరి సీట్లలో నిలబడి గెలిచి ఆ తర్వాత పడే బాధలు... వీటన్నింటి సమాహారం ఈ కథలు. వీటిలోని ‘రాయక్క మాన్యమ్’ ముఖ్యమైనది. ఇది గాడిదలని చూసుకుంటూ మాదిగల మీద ఆధారపడి జీవించే ఒక డక్కిలి స్త్రీ కథ. డక్కిలివాళ్లు మాదిగలున్న అన్ని ఊళ్లకూ వెళ్లరు. తమకు ఏ ఊరి మీద ఇస్స (హిస్సా- భాగం) ఉందో ఆ ఊరికే వెళతారు. అక్కడి పంచాయితీలు తెంపుతారు. హక్కుగా తమకు రావలసింది తీసుకుంటారు. కులం కథ చెప్తారు. తేడా వస్తే నిలేస్తారు. అలాంటి డక్కిలి స్త్రీయే రాయక్క. ఆమె మాన్యాన్ని అనుభవిస్తూ ఆమెకు ఇవ్వాల్సిన గింజలు ఇవ్వని తగువును ఆమె ఎలా పరిష్కరించిందనేది కథ. బహుశా డక్కిలి స్త్రీల మీద వచ్చిన మొదటి/మంచి కథ అయి ఉండాలి. 2006లో వచ్చిన ఇలాంటి కథను ఉత్తమ కథలు ఎంచేవాళ్లు ఎలా వదిలేశారో ఎందుకు వదిలేశారో అని ప్రశ్నించుకుంటే సమాధానం బాధితులకు ఒకరకంగా బాధపెట్టేవాళ్లకు ఒకరకంగా తోస్తుంది. ఒక కథలో చిందు భాగవతం ఆడే మాదిగల దీన స్థితిని ఒక పాత్ర ఇలా చెప్తుంది- ‘ఇప్పుడు సిందోల్ల నెవలాడిత్తండ్రు. అందరు సీన్మలకెగబడ్తుండ్రు.
యిదువరకైతే పంటల మీదచ్చి ఆడితే ఒక్కో ఆసామి యిద్దుం ‘ముత్తుం’ వడ్లు బెట్టేది. యిప్పుడేమిత్తలేరు. యెవ్వలాడిత్త లేరు. ఆల్లనిగాదు ఎవ్వలత్తలేరు వూల్లెకు కత సెప్పేదానికి’.... ఈ దురవస్థని ఎవరైనా కథగా మలిచారా? తెలంగాణ భాషలో రాసిన ఈ కథలు ‘ప్రామాణిక భాష’కు అలవాటైన వారికి పోనీ సులువైన మాండలికాలకు అలవాటైన వారికి కూడా కొంచెం కష్టం కావచ్చు. వారికి తెలిసిన లెక్కలు డొక్కలలో ఈ కథలు ఇమడక పోవచ్చు. అయినప్పటికీ చదవాలి. ఎందుకంటే ఇవి- వాడకవి గాంచిన, దళిత కవి మాత్రమే కాంచగలిగిన కథలు.
రాయక్క మాన్యమ్ - దళిత మహిళల కతలు;
రచన: జూపాక సుభద్ర; వెల: రూ. 120;
ప్రతులకు: 9441091305, 9948311667
- లక్ష్మీ మందల