పోలీసుల తీరుపై ఎమ్మెల్యే కిలివేటి ఆగ్రహం
అవమానంతో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం
నాయుడుపేట: పోలీసుల తీరుపై ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన రాయపాటి శేఖర్‌ను సోమవారం పరా మర్శించారు. మెరుగైన వైద్యం అందించేందుకు బాధితుడిని నెల్లూరుకు అంబులెన్స్‌లో పోలీసులను వెంటబెట్టి పంపించారు. సీఐ రత్తయ్య టీడీపీకి ఏకపక్షంగా వ్యవహరించడం వల్లనే ఇలాంటి పరిస్థితి దారి తీసిందని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు.
టీడీపీ పార్టీకి సీఐ.. నా ప్రజా స్వామ్యాన్ని పరిరక్షించే సీఐ.. నా అని టీడీపీ నాయకులను ప్రశ్నించారు. ఈ విధంగా వ్యవహరిస్తున్న సీఐ తీరు మార్చుకోవాలని చెప్పారు. పోలీసులు రోజురోజుకు ఏకపక్షంగా కేసులు నమోదు చేయడం, వేధింపులకు గురిచేయడం నిత్యకృత్యమయిందని వాపోయారు. ఇప్పటికైనా పోలీసుల తీరులో మార్పు రాకపోతే అందుకు ప్రతిఫలం అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు.
ప్రశ్నించినందుకే దాడి...
మల్లాం క్రాసురోడ్డు వద్ద బ్రాందీషాపు ముందు వైపు ఉన్న కూల్‌డ్రింక్ దుకాణాన్ని ఆదివారం రాత్రి మూసివేయాలంటూ పోలీసులు హకుం జారీ చేయడంతో పాటు షాపు యజమానులపై విచక్షణా రహితంగా దాడి చేశారు. తొలుత పోలీసులు దారుణంగా దూషిస్తుండటంతో యజమాని రాయపుకృష్ణ అలా ఎందుకు మాట్లాడతారంటూ ప్రశ్నించారు. మాకే ఎదురు తిరుగుతావా..? అంటూ సీఐ చేయి చేసుకునే ప్రయత్నం చేశారు. సీఐ చేతిని అడ్డుకున్న షాపు యజమాని కృష్ణని పోలీసులు చితకబాదారు. బీటెక్ చదివి షాపులో పనిచేస్తున్నరాయపు శేఖర్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.
అర్ధరాత్రి వరకు స్టేషన్లో ఇద్దరినీ తీవ్రంగా కొట్టారు. శేఖర్‌ను మాత్రం ఇంటికి పంపి కృష్ణను స్టేషన్లోనే ఉంచారు. కొంతమంది పోలీసులతో సీఐ దగ్గరుండి కృష్ణను కుళ్ల పొడిపించి పడవేశారు. సోమవారం ఉదయం శేఖర్‌ను స్టేషన్‌కు పిలిపించి కేసు నమోదు చేశారు. రెండు రోజుల కిందట పోలీసుల అదుపులో ఉన్న మద్యం బాబులు ఐదుగురితో పాటు శేఖర్‌ను కూడా సూళ్లూరుపేట కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. కానిస్టేబుల్‌ను వారి వెంట పంపకుండా మీరే కోర్టులో హాజరై జరిమానా కట్టి రావాలంటూ ఎస్సై ఆంజనేయరెడ్డి ఆదేశాలు జారీచేశారు. శేఖర్ కోర్టుకు వెళ్లడం అవమానంగా భావించి జాతీయరహదారి సమీపానికి వెళ్లి శివాలయం వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
గ్రామస్తులు అందోళన ..
తమ బిడ్డలను పోలీసులు చిత్రహింసలు పెట్టడమే కాక ఆత్మహత్యాయత్నానికి కారకులైన పోలీసుల చర్యలకు నిరసనగా గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. తంబిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి, ఫ్లోర్ లీడర్ షేక్ రఫీ, కౌన్సిలర్లు కువ్వాకుల శ్రీనివాసులు, ఆలయ కమీటీ చైర్మన్ కట్టా వెంకటరమణారెడ్డి, ముప్ళాళ్ల జనార్ధన్‌రెడ్డి, దొంతాలి రాజశేఖర్‌రెడ్డి, గంధవల్లి సిద్దయ్య, మైలారి నాగరాజు, పాలేటి నాగార్జున, పేట చంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.